కరీంనగర్ సిటీ : ఫీజు రీయింబర్‌సమెంట్‌పై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు తొలగిపోయింది. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్‌సమెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఫీజు రీయింబర్‌సమెంట్‌ను ప్రస్తుతం ఉన్న విధానంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఫీజులు అడ్డంకి కారాదానే మహోన్నత లక్ష్యంతో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్‌సమెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు.
డిగ్రీ చదవడానికి కూడా ఆర్థిక స్థోమత సరిపోక, చదువును అర్ధంతరంగా నిలిపివేసే తరుణంలో రీయింబర్‌సమెంట్ ప్రవేశంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంజినీరింగ్, మెడిసిన్‌లాంటి ఉన్నత చదువులకు ఆటంకాలు లేకుండా నిరుపేదలు కొనసాగించారు. అయితే వైఎస్సార్ మరణానంతరం ఫీజురీయింబర్‌సమెంట్ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంతోపాటు దశలవారీగా ఎత్తివేసేందుకు కుట్రపన్నాయి. దీనిపై బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు చేపట్టిన ఆందోళనలకు వెరసిన ప్రభుత్వాలు చాలీచాలని నిధులు కేటాయిస్తూ విద్యార్థులు, కళాశాలల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర విభజన జరగడంతో కొత్తగా ఏర్పడిన కేసీఆర్ సర్కార్ ఈ పథకాన్ని కొనసాగిస్తుందా.. రద్దు చేస్తుందా.. దాని స్థానంలో మరే పథకమైనా ప్రవేశపెడుతందా..? అనే అనుమానాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటన్నింటికి సమాధానంగా ఫీజు రీయింబర్‌సమెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో ఉత్కంఠ తొలగిపోయింది.
లక్ష మందికి లబ్ధి
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్‌సమెంట్ పథకాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని లక్షకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఫీజు రీయింబర్‌సమెంట్‌పై ఆధారపడే వేలాదిమంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఫీజు కొనసాగింపుతో వీరంతా నిరాటంకంగా విద్యను అభ్యసించే అవకాశం ఏర్పడింది.
రూ.101కోట్లు విడుదల
2013-14 విద్యా సంవత్సరానికిగాను లక్షా 3,233 మంది బీసీ విద్యార్థులు ఫీజు రీయింబర్‌సమెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 46,731మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్‌సమెంట్ కింద రూ.113కోట్ల 91 వేలు మంజూరయ్యాయి. ఇప్పటివరకు రూ.101కోట్ల 52 లక్షల 25 వేల ఫీజు రీయింబర్‌సమెంట్ కళాశాలలకు చేరాయి. 6146 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.కోటి 36లక్షల 46 వేలు రాగా, 4,222 మంది విద్యార్థులకు రూ.4 కోట్ల 1లక్షా 14 వేలు అందాయి. ఈబీసీ విద్యార్థులకు సంబంధించి 8136 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 7187 మందికి రూ.11 కోట్ల 54 లక్షల 45 వేలు మంజూరు కాగా, రూ.11 కోట్ల 27 లక్షల 10 వేలు మాత్రమే విద్యార్థులకు చేరాయి.
బకాయిలు రూ.73 కోట్లు
ఫీజు రీయింబర్‌సమెంట్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రస్తుతం అందరి దృష్టి బకాయిలపై పడింది. బకాయిలపై స్పష్టత ఇవ్వనప్పటికీ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు చెప్పడంతో బకాయిలు కూడా చెల్లిస్తారనే విశ్వాసం విద్యార్థుల్లో ఏర్పడింది. జిల్లాలో గత సంవత్సరం స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్‌సమెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పూర్తి చెల్లింపులు చేయాలంటే ప్రభుత్వం అత్యవసరంగా జిల్లాకు సుమారు రూ.73 కోట్లు చెల్లించాలి. బీసీ విద్యార్థులకు సంబంధించి స్కాలర్‌షిప్‌ల కోసం రూ.15కోట్లు, ఫీజు రీయింబర్‌సమెంట్ కోసం రూ.35 కోట్లు, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్‌సమెంట్ రూ.8 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు రూ.5 కోట్ల 76లక్షలు, ఫీజు రీయింబర్‌సమెంట్ రూ.5 కోట్ల 69లక్షలు, 1500 మంది గిరిజన విద్యార్థులకు రూ.4కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.
ఫీజురీయింబర్స్‌మెంట్ యథాతథం
Published Tue, Jun 17 2014 3:36 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement