కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఉన్నత విద్యనభ్యసించే నిరుపేద విద్యార్థులకు కష్టాలొచ్చిపడ్డాయి. మరో నెల రోజుల్లో ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడీ తదితర కోర్సుల విద్యా సంవత్సరం ముగుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదు. త్వరలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో ఫీజు భారం ఎవరు భరిస్తారనే ప్రశ్నలు విద్యార్థుల్లో మొదలవుతున్నాయి. నిరుపేద విద్యార్థులు ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించాలనే గొప్ప ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు.
మహానేత హయాంలో జిల్లాలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశారు. అయితే వైఎస్సార్ మరణం తరువాత వచ్చిన ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. దీంతో అనేక మంది విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోలేక పోయారు. అష్టకష్టాలు పడి దరఖాస్తు చేసుకున్నా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చేయడంలో నిర్లక్ష్యాన్ని చూపారు. 2013-14, 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి 3,2014 మంది బీసీ విద్యార్థులకు ఎంటీఎఫ్ (మెయింటెయిన్ ఆఫ్ ట్యూషన్ ఫీజు) కింద రూ.12 కోట్లు, 38,710 మందికి ఫీజు రీయంబర్స్‌మెంట్ కింద రూ.35 కోట్లు చెల్లించాల్సి ఉంది.
అలాగే 5,762 మంది ఈబీసీ విద్యార్థుల ఫీజు రూ. 21 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని 6364 మంది ఎస్‌సీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు గాను రూ.6 కోట్లు, ఎంటీఎఫ్‌కు రూ.3 కోట్లు మంజూరు చేయాలి. గిరిజన వర్గాలకు చెందిన 1,666 మంది విద్యార్థుల ఆర్‌టీఎఫ్‌కు రూ.1.60 కోట్లు, ఎంటీఎఫ్‌కు రూ.40 లక్షలు చెల్లించాల్సి ఉంది. సకాలంలో విద్యార్థులకు ఫీజును విడుదల చేయకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఆయా కళాశాలలకు చెందిన యాజమాన్యాల ఒత్తిళ్లను భరించలేక చదువును మధ్యలోనే ఆపేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆధార్‌తో అన్నీ ఇబ్బందులే..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్ కార్డుతో ముడిపెట్టడంతో విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. అనేక మంది విద్యార్థులు ఆధార్ కోసం ఎన్‌రోల్ చేసుకున్నా, వారికి యూఐడీలు రాకపోవడంతో ఫీజుకు దరఖాస్తు చేసుకోలేక పోయారు. అయితే ప్రభుత్వం ఎట్టకేలకు యూఐడీ లేని విద్యార్థులు కనీసం ఈఐడీ ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని గత నెల 31వ తేదీ వరకు గడువిచ్చింది. ఈ అంశం కొంత ఊరటనిచ్చినా, చివరకు యూఐడీ ఉంటేనే ఫీజు మంజూరు అవుతుందని సంక్షేమశాఖలకు చెందిన వారే చెబుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఫీజుకు బూజు
Published Fri, Jun 6 2014 1:58 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement