ఇన్నాళ్లూ పేద విద్యార్థుల ఉన్నత చదువులకు కల్పవృక్షంగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. పథకం రూపశిల్పి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ సర్కారు ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయగా.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. పాత నిబంధనలు కొనసాగిస్తూనే కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోంది.
ఏలూరు సిటీ : జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో సుమారు లక్ష మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు పూర్తి కావస్తున్నా ఆన్‌లైన్ దరఖాస్తులకు ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు. ఈ పథకంలో ప్రస్తుత పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. పూర్తిస్థాయిలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించలేకపోవటంతో విద్యార్థులు నష్టపోయారు.
బడ్జెట్ కేటాయింపులేవి?
గతంలో జిల్లాకు ఫీజు పథకంలో సుమారు రూ.100 కోట్లు విడుదల చేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తులకు మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను మాత్రం కేటాయించలేదు. జిల్లాలో రూ.18 కోట్ల వరకూ ఫీజు బకాయిలు ఉండిపోయాయి. బీసీ విద్యార్థులకు రూ.6 కోట్లు, ఈబీసీ రూ.7కోట్లు, ఎస్సీ విద్యార్థులకు రూ.5కోట్ల వరకూ ఫీజులు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో బీసీ విద్యార్థులు 52 వేల మంది, ఈబీసీ 21వేల మంది, ఎస్సీలు 24 వేల మంది ఫీజు పథకంలో లబ్ధి పొందుతున్నారు.
మార్గదర్శకాలివే
ఏడేళ్లు తక్కువ కాకుండా వరుసగా స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్లను ఫ్రెష్, రెన్యువల్ అభ్యర్థులు దరఖాస్తు దశలోనే సమర్పించాలి.
ఈ ఏడాది జూన్ 2 తర్వాత తీసుకున్న స్థానికత ధ్రువీకరణ పత్రమే చెల్లుతుంది.
విద్యార్థి తల్లిదండ్రుల ఆధార్ నెంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలి.
తల్లిదండ్రుల్లో ఎవరికి 4 చక్రాల వాహనం ఉన్నా వివరాలు చెప్పాలి
స్థానికత, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పొంది ఉండాలి.
ఎస్సీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ యథావిధిగా కొనసాగిస్తారు.
ఆర్టికల్ 371(డి) మేరకే స్థానికత వర్తిస్తుందని, దీని ఆధారంగానే ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మార్గదర్శకాలతో పాటు పాత నిబంధనలు కొనసాగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఫీజు పథకానికి బూజు
Published Mon, Oct 20 2014 2:49 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement