సాక్షి, కరీంనగర్ : ముస్లిం మైనారిటీలు.. పేరుకు తగ్గట్టుగానే వీరు అన్ని రంగాల్లోనూ వెనుకబడ్డవారు. జిల్లాలో మైనారిటీ జనాభా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు వీరిని చిన్నచూపు చూస్తున్నాయి. దీంతో వీరు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఆమడదూరంలో ఉన్నారు. ముస్లింల దుర్భర పరిస్థితులపై దయతలిచే నాయకుడే లేకపోయాడు. ఇదంతా 2004 సంవత్సరానికి ముందున్న దుస్థితి. అంతకుముందు వ రుసగా తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడు మైనారిటీల సంక్షేమానికి చేసింది శూన్యం. టీడీపీ పాలనలో ముస్లిం మైనారిటీలు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు దూరంగా ఉన్నారు.
2004లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ముస్లింల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. సమాజంలో వారికి గౌరవం, ప్రత్యేక హోదా కల్పించాలని తలంచారు. వారిని బీసీ-ఈ కింద ప్రత్యేక జాబితాలో చే ర్చడంతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారు. 2008లో ముస్లింల మాతృభాష ఉర్దూను ద్వితీయ భాషగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘనత చ రిత్రలో ఆ మహానేతకే దక్కింది. వైఎస్సార్ మరణానంతరం గద్దెనెక్కిన పాలకులు ముస్లింలను విస్మరించడంతో వారి పరిస్థితి మళ్లీ తిరగబడింది. ఎన్నికల వేళ ఓట్లడిగేందుకు వచ్చేవారిని తమ సమస్యలపై నిలదీసేందుకు ప్రజలు సిద్ధమవడంతో రాజకీయ పార్టీల్లో గుబులు మొదలైంది.
విద్య, ఉద్యోగావకాశాలు
2006లో ముస్లింలలోని సయ్యద్, ఖాన్, మీర్జా కులాలను మినహాయించి ప్రభుత్వం ముస్లింలందరినీ బీసీ-ఈ జాబితాలో చేర్చి నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. దీంతో ఉన్నతవిద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రతీ వంద సీట్లలో నాలుగు ముస్లింలకు దక్కాయి. పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య, తదితర శాఖల్లో ఇప్పటివరకు జిల్లాకు చెందిన రెండువేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వందలాది మంది మెడిసిన్, ఇంజినీరింగ్ అభ్యసించి డాక్టర్లుగా, ఇంజినీర్లుగా రాణిస్తున్నారు.
రాజకీయాల్లో పెరిగిన ప్రాతినిధ్యం
నాలుగు శాతం రిజర్వేషన్‌తో రాజకీయాల్లో ముస్లింల ప్రాతినిథ్యం పెరిగింది. బీసీ స్థానాల్లో పోటీ చేసి వందలాది మంది సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ప్రస్తుత కరీంనగర్ కార్పొరేషన్‌లో ఎన్నికల్లో 6, 32, 39వ డివిజన్లను బీసీలకు కేటాయించడంతో బీసీ-ఈ కింద ముస్లింలు పోటీకి దిగారు. జిల్లావ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పదుల సంఖ్యలో బరిలో నిలిచారు.