యువకల చెదిరింది
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు శాపం
నాడు మహానేత ఉన్నతాశయం
ఆయన తర్వాత సర్వనాశనం
బాబు హయాంలో కానరాని సాయం
బకాయిలు, ఆంక్షలతో భ్రష్టుపట్టిన పథకం
సాక్షి,విశాఖపట్నం:‘‘ఉన్నత చదువులు చదుకోవాలని కల లు కన్న ఏ ఒక్క పేద విద్యార్థి డబ్బులు లేవనే కారణం తో చదువుకు దూరం కాకూడదు.ధనిక వర్గాలకే పరి మితమయ్యే ఉన్నత చదువులు పేద విద్యార్థికి అందాలన్నదే నా ధ్యేయం’ అంటూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో ఫీజురీయంబర్స్‌మెంట్ పథకాన్ని ఆవిష్కరించారు. పెద్ద చదువులు చదువుకోవాలన్న పేద విద్యార్థులకు తానే పెద్దదిక్కై నిలిచారు.
పథకానికి నిధుల కొరత లేకుండా చూసి లక్షలాదిమంది విద్యార్థుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారు. ఆయనకు ముందు, ఆయన తర్వాత పాలించిన పెద్దలు మాత్రం యువత ఆకాంక్షలను పట్టించుకోలేదు సరికదా, వాటిని కాలరాసేట్టు వ్యవహరించారు. వైఎస్ ముందు చంద్రబాబు పాలనలో విద్యార్థులు కనీసం డిగ్రీ చదవడానికి కూడా దిక్కులేక అవస్థలు పడ్డారు. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో ఫీజు పథకానికి గండి కొట్టడంతో విద్యార్థులు విలవిలలాడుతున్నారు.
ఉదారంగా వరం
పేద,మధ్యతరగతి వర్గాల విద్యార్థులు ఎంబీఏ,ఎంసీఏ, ఇంజినీరింగ్ చదువుకోవడం దాదాపు అసాధ్యమే. మహానేత వైఎస్ ఈ కలను నిజం చేశారు. రీయింబర్స్‌మెంట్ పథకానికి ఎప్పుడూ నిధుల కొరత రానివ్వలేదు. 2008-2009లో రూ. 91 కోట్లు, 2009-2010లో రూ. 97 కోట్లు ఠంచనుగా మంజూరు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో ఆంక్షలతో పథకాన్ని కాలరాసేందుకు యత్నించారు.
ఎంత వ్యత్యాసం!
వైఎస్ ఉండగా విద్యార్థులకు ఫీజులన్నీ ఒకేసారి చెల్లించేవారు. ఆయన మరణం తర్వాత నుంచి ఫీజుల వాపస్‌లో అంతు లేని జాప్యం కలుగుతోంది. వైఎస్ పాలనలో జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులు రెండు లక్షలకు పైగా ఉండేవారు. ప్రస్తుతం రకరకాల షరతుల కారణంగా దరఖాస్తుదారులు గతేడాది 82 వేలకు, ఈఏడాది 53 వేలకు తగ్గిపోయారు. వైఎస్ ఉన్నప్పుడు పథకానికి ఒక్క పైసా కూడా బకాయి ఉండేదికాదు. కానీ ఇప్పుడు పేరుకుపోయిన బకాయిలు రూ.70 కోట్లకు పైగానే ఉన్నాయి.
చదువు చాలా దూరం
చంద్రబాబు హయాంలో విద్యార్థుల సంక్షేమానికి ఒక్కటంటే ఒక్క పథకం కూడా లేదు. డిగ్రీ చదవాలన్నా ఆస్తులు ఆమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు కూడా కూలి పనులకు వెళ్లేవారు. ఇంజనీరింగ్ పీజులు కట్టలేక ఎందరో మెరిట్ విద్యార్థులు చదువుకు స్వస్తి చెప్పేవారు. గిరిజన విద్యార్థులు టెన్త్ తర్వాత పొలం పనులు చేసేవారు. ఈ కష్టాలను పాదయాత్రలో గమనించిన వైఎస్ విద్యార్థులకు మహోపకారం చేశారు.