వైఎస్సార్.. ఆ పేరు ఓ ప్రభంజనం. నవ్వులో స్వచ్ఛత.. పిలుపులో ఆత్మీయత.. మాట తప్పని, మడమ తిప్పని గుణంతో ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్. మహానేతను కోల్పోయి 14 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు..ఆ రూపం చెదిరిపోలేదు. మహానేత వైఎస్సార్ మానస పుత్రికగా విశాఖ నగరం.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఉజ్వలంగా వెలుగొందుతోంది. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విశాఖలో మహానేత చేపట్టిన అభివృద్ధి.. సంక్షేమాన్ని గుర్తు చేసుకుందాం..
సాక్షి, విశాఖపట్నం: 2004.. ఉమ్మడి విశాఖ జిల్లా అన్ని రంగాల్లో సంక్షోభ వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. నగరంలో తాగునీటి సమస్య, అచ్యుతాపురం సెజ్ ఏర్పాటుకు భూసేకరణ, పరవాడ ఫార్మాసిటీ భూ వివాదాలు, గంగవరం పోర్టు భూ సేకరణ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, బీహెచ్‌పీవీ, షిప్‌యార్డులు నష్టాల ఊబిలో కూరుకుపోయి మూసివేసే పరిస్థితి ఏర్పడింది. వీటి పరిష్కారమే లక్ష్యంగా 2005 జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఒక్కో సమస్యకు సానుకూల పరిష్కారం చూపించారు. నగరంలో మంచినీటి సమస్య పరిష్కారంతో పాటు అచ్యుతాపురం, ఫార్మా సెజ్‌లకు భూముల ధర నిర్ణయించడంతో పాటు పునరావాస ప్యాకేజీలు ప్రకటించారు. నష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను గట్టెక్కించి రెండో దశను విస్తరించాలని నిర్ణయించారు. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్(బీహెచ్‌పీవీ)ని భెల్(బీహెచ్‌ఈఎల్)లో విలీనం చేశారు. షిప్‌యార్డును రక్షణ శాఖలో విలీనం చేసి పునరుజ్జీవం కల్పించారు. అదే సమావేశంలో విశాఖలో ఐటీకి అభివృద్ధి బాటలు వేశారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజా నాయకుడిగా మన్ననలు అందుకున్నారు. ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం, జలయజ్ఞం.. ఇలా ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేశారు.
మరుపురాని మహానేత గురుతులివీ..
► వైఎస్సార్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ను 2005 నవంబర్ 22న మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)గా మార్పు చేస్తూ.. గ్రేటర్ హోదా కల్పించారు. అప్పటి వరకు 111 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న విశాఖ 540 చ.కి.మీ విస్తీర్ణంతో మహా విశాఖగా అవతరించింది. 2013లో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 10 పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేసి.. 98 వార్డులుగా విస్తరించారు.
► జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్ని ర్మాణ పథకం(జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం)లో విశాఖ నగరాన్ని చేర్పించడంలో వైఎస్సార్ కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతో నగరానికి రూ.1,885 కోట్ల విలువైన పనులు దక్కాయి. సింహాచలం, పెందుర్తి బీఆర్‌టీఎస్ కారిడార్లు, ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్, విలీన గ్రామాలకు తాగునీటి సౌకర్యం, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన 20 ప్రాజెక్టులను వైఎస్సార్ తీసుకొచ్చారు.
► విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చింది వైఎస్సారే. దాంతో విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయి. విదేశాలకు కూడా ఇక్కడ నుంచి విమానాలు ఎగిరాయి. ఆ ఒరవడి కొనసాగిస్తూ ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
► గోదావరి నీటిని విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్న సంకల్పంతోనే పోలవరం ఎడమ కాలువను నిర్మించారు. తాండవ, రైవాడ, పెద్దేరు, కోనాం ప్రాజెక్టుల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఏలేరు నీటిని మళ్లించడం ద్వారా స్టీల్‌ప్లాంట్ నీటి సమస్యను పరిష్కరించారు.
► నగరంలోని నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాజీవ్ గృహకల్ప ఇళ్లకు శ్రీకారం చుట్టారు. నగర పరిధిలో సుమారు లక్షకుపైగా పునరావాస, పూర్‌సెటిల్‌మెంట్ కాలనీ ఇళ్లు నిర్మించారు. రాజీవ్ గృహకల్ప ద్వారా రూ.650 కోట్లతో 15,320 ఇళ్లు, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా రూ.600 కోట్లతో 15 వేల గృహాలు, వాంబే కింద రూ.400 కోట్లతో 9 వేల ఇళ్ల నిర్మాణం చేశారు. మధురవాడలో గృహ సముదాయాలు ఆయన చేతుల మీదుగానే ప్రారంభమయ్యాయి.
► ఐటీ ప్రగతి ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వికేంద్రీకరణ జరగాలని వైఎస్ భావించారు. విశాఖలో 3 కొండలు, కొండల కింద ఉన్న సుమారు 100 ఎకరాల పల్లపు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. కనీసం 100 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఐటీ కంపెనీలకు మాత్రమే అవకాశమిచ్చి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్లాట్లుగా డివైడ్ చేసి అందించారు. వైఎస్ ఆలోచనలను మెచ్చి సుమారు 200 కంపెనీలు ముందుకొచ్చాయి.కొద్ది కాలంలోనే 70 శాతం కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించాయి. సత్యం, విప్రో కంపెనీలూ విశాఖలో తమ శాఖలను విస్తరింపజేశాయి.
అలా.. వైజాగ్‌ను ఐటీ హబ్‌గా మార్చేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. వైఎస్సార్ మరణం తర్వాత.. దాదాపు పదేళ్లు విశాఖ ప్ర‘గతి’తప్పింది. మళ్లీ 2019 తర్వాత ఐటీ ప్రగతి మళ్లీ పట్టాలెక్కింది. కొత్తగా ఇన్ఫోసిస్ తమ కార్యకలాపాలు ప్రారంభించింది. అదానీ డేటా సెంటర్‌కు ఇటీవలే సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు 2006లో విమ్స్‌కు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. 1130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీ బ్లాకులతో రూ.250 కోట్లతో విమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి 2007లో శంకుస్థాపన చేశారు. ఆయన మరణాంతరం అనేక పరిణామాల తర్వాత 2016 ఏప్రిల్‌లో విమ్స్ అందుబాటులోకి వచ్చింది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం.. విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు కుయుక్తులు పన్నింది. అప్పుడే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ ఈ ప్రయతాన్ని అడ్డుకుంది. కోవిడ్ సమయంలో విమ్స్ స్టేట్ కోవిడ్ హాస్పిటల్‌గా విశేష సేవలందించింది.
Comments
Please login to add a commentAdd a comment