ఉమ్మడి విశాఖలో కూటమిలోని ముగ్గురు ఎంపీ అభ్యర్థులపై ఆరోపణలు
భూఆక్రమణకు పాల్పడిన విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ ఫ్యామిలీ
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై పలు కేసులు
అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై బ్యాంక్ రుణాల ఎగవేత కేసు
రుణాల ఎగవేత నుంచి కుల అనర్హత కేసు వరకు..
2014లో వైఎస్సార్ సీపీ తరఫున అరకు ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత ప్రలోభాలకు లోనై కొద్ది రోజులు టీడీపీకి దగ్గరయ్యారు. 2018లో జనజాగృతి పేరిట రాజకీయ పార్టీని నెలకొల్పారు. 2019 ఎన్నికల అనంతరం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆమైపె పలు కేసు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.42.79 కోట్ల లోన్ తీసుకుని ఎగవేత కేసులోనూ దోషిగా తేలిన ఆమెకు 2022లో సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె కొన్నాళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చారు. అంతేకాకుండా గీత గిరిజన మహిళ కాదని, గిరిజనులకు కేటాయించిన అరకు ఎంపీ స్థానంలో ఆమె తప్పుడు కులధ్రువీకరణ పత్రంతో పోటీ చేసి గెలుపొందిందని ఆమె ప్రత్యర్థి హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. 2024 జనవరిలో గీత ఎస్టీ కాదని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఆమె హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ గెజిట్‌ను సస్పెండ్ చేసింది.
వెంటాడుతున్న గీతం భూ ఆక్రమణల కేసు
అక్రమాల పునాదులపై విశ్వవిద్యాలయాన్ని తన కుటుంబీకులు నిర్మిస్తున్నా.. ఆపకుండా ప్రోత్సహించిన చరిత్ర విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్‌ది. అక్రమ కట్టడాలు, భూఆక్రమణలతోనే గీతంని విస్తరించారనే ఆరోపణలు నిజమని ప్రభుత్వాధికారుల స్వాధీనంతో నిరూపితమయ్యాయి. గతంలో ఆ వివాదాస్పద వ్యవహారాలన్నీ ప్రస్తుత గీతం వర్సిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎం.భరత్‌ని వెంటాడుతున్నాయి. గీతం కళాశాల తొలుత పాతిక ఎకరాల్లో ఏర్పాటైంది. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటూ 110 ఎకరాల విస్తీర్ణంలో డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి చేరింది.
ఈ సంస్థ ఆధీనంలో ఉన్న 35 ఎకరాల భూములను లీగల్‌గా కై వసం చేసుకునేందుకు అప్పటి కలెక్టర్ ద్వారా 2012 మే 28వ తేదీన ఎలినేషన్ ప్రతిపాదనలు పంపించగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాటు తొక్కిపెట్టింది. ఈ భూముల్ని దళిత విద్యార్థుల కళాశాల, పోస్ట్ మేట్రిక్ హాస్టల్స్, బలహీన వర్గాల గృహనిర్మాణం, అధికారులకు రెసిడెన్షియల్ క్వార్టర్స్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్ ఇలా వివిధ ప్రభుత్వ అవసరాల కోసం కేటాయిస్తున్నట్లు 2014 ఫిబ్రవరి 26వ తేదీన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేసినా.. గీతం యాజమాన్యం వాటిని వదల్లేదు.
గీతం ఆక్రమించిన 40.52 ఎకరాల భూముల విలువ ఇప్పుడు రూ.500 కోట్ల పైమాటే. ఇక కేబినెట్ ఆదేశాలు, కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నప్పటికీ ఈ భూములు 2019 వరకూ గీతం ఆధీనంలోనే ఉన్నాయి. గీతం మూర్తి చేసిన సంస్థాగత తప్పుల గురించి తెలిసినా.. తప్పు అని చెప్పకుండా.. ప్రోత్సహించిన భరత్‌ని.. ఆ పాపాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 40 ఎకరాల వరకూ గీతం ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంది. అయినా.. తమదేం తప్పులేదంటూ భరత్ మొసలి కన్నీరు కారుస్తూ.. కబ్జా భూమిలో కొంత భాగం తన వర్సిటీలోనే ఉంచేసుకున్నారు.
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు పలు కేసులు ఎదుర్కొంటున్నారు. భూకబ్జా, ఫోర్జరీ, రుణాల ఎగవేత వంటి కేసులు వారిని వెంటాడుతున్నాయి. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు, అరకు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీతపై బ్యాంక్ రుణాల ఎగవేత కేసు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ కుటుంబంపై భూఆక్రమణ కేసులు ఉన్నాయి. వీరిపై తవ్వే కొలదీ అవినీతి, ఆక్రమణలు బయటకు వస్తున్నాయి. ఇలా పలు ఆరోపణలు ఉన్న వీరు చట్టసభలకు పోటీ చేస్తుండడంపై జనాలు విస్తుపోతున్నారు. వీరు తీరు ఇప్పుడు ‘ముగ్గురూ ముగ్గురే’ అన్నట్లు ఉంది.
కడప నుంచి హైదరాబాద్ వరకు అదే తీరు
సీఎం రమేష్ కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలో జన్మించారు. ఓసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ 2012లో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. 2018లో రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా టీడీపీ నుంచి నామినేట్ అయ్యారు. 2019 జూన్ 20న బీజేపీలో చేరారు. ఈయన అక్రమాల బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. 2019లో కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్‌తో కలిపి తనపై దాడి చేశారని ఎర్రగుంట్లకు చెందిన పడిగపాటి వెంకట సుదక్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
దీనిపై ఐపీసీ 323, 324 కింద కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లాలో సారా వ్యాపారాలు చేశారు. అదేవిధంగా 2014–19లో గండికోట ప్రాజెక్ట్ పెండింగ్ పనుల్లో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అలాగే ఆయనపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ స్వాతి కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఫోర్జరీ సంతకాలతో బోగస్ సబ్ కాంట్రాక్టు ఒప్పందం చేసుకొని రూ.450 కోట్లు కొట్టేశారనీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సినీ నటుడు వేణు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇది కోర్టులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment