నగరాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ విజన్
వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి
ఏపీ డెవలప్‌మెంట్ డైలాగ్ పేరుతో సదస్సు నిర్వహణ
స్కిల్ డెవలప్‌మెంట్ నిర్వహణపై సీఎం సమక్షంలో ఎంవోయూలు
రూ.1,500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం.. పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నగరానికి కొత్త ఇమేజ్ తీసుకొచ్చేందుకు ఆలోచనలు కార్యరూపం దాల్చేలా అడుగులు వేశారు. విశాఖలో ఇతర పరిశ్రమలకూ ఆస్కారం ఉందన్న ఆలోచన దిగ్గజ పారిశ్రామికవేత్తల మదిలో కలిగేలా.. విశాఖను గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో విశ్వవ్యాప్తంగా ప్రమోట్ చేశారు.
అందుకే.. దిగ్గజ పారిశ్రామికవేత్తలు వైజాగ్‌కు క్యూ కట్టారు. భవిష్యత్తులో విశాఖ వైభవాన్ని విశ్వం వినువీధుల్లో ప్రతిబింబించేలా సమగ్ర కార్యచరణను అమలు చేసే ప్రణాళికలతో సీఎం వైఎస్ జగన్ ముందుకొస్తున్నారు. వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులతో ఏపీ డెవలప్‌మెంట్ డైలాగ్ పేరుతో విజన్ విశాఖ సదస్సులో పాల్గొంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలో నడిచేలా విశాఖను నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సైతం అడుగులు పడుతున్నాయి.
విజన్ వైజాగ్ పేరుతో..
పరిశ్రమలకు పట్టుగొమ్మగా.. ఉపాధి కల్పనకు ఆలంబనగా.. పెట్టుబడులకు స్వర్గధామంగా.. అంతర్జాతీయ నగరంగా భాసిల్లుతున్న విశాఖ.. భవిష్యత్తులో మరింత గొప్పగా అభివృద్ధి చెందేందుకు ఉన్న వనరులేంటి..? వాటిని ఎలా వినియోగించుకోవాలి.. ప్రపంచ పటంలో విశాఖని ఎలా నిలబెట్టాలనే సంకల్పంతో విజన్ వైజాగ్ కాన్సెప్ట్‌తో సీఎం వస్తున్నారు. ఆది నుంచి దూసుకుపోతున్న రియల్ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖపట్నం వైపు చూసేలా చేసింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. ఇప్పటికే పలుమార్లు నివాస యోగ్యమైన నగరంగానూ... వ్యాపారానికి అనువైన నగరాల్లో విశాఖపట్నం చరిత్రకెక్కింది.
సరికొత్త విశాఖ ఆవిష్కృతమయేలా.. పరిశ్రమలు, పర్యాటకం, హాస్పిటల్స్, హోటల్స్, మౌలిక సదుపాయాలు తదితర రంగాలకు చెందిన సుమారు 2000 మందితో సీఎం చర్చించున్నారు. విశాఖపట్నం విజన్ డాక్యుమెంటును ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలలో కల్పించిన మౌలిక సదుపాయాల గురించి, విశాఖ నగరంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాల గురించి వైఎస్ జగన్ సంభాషించనున్నారు.
విద్యార్థుల నైపుణ్యానికి ‘భవిత’...
విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ.. రాష్ట్రంలోని విద్యార్థులు అంతర్జాతీయ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. ఇందుకోసం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా విద్యార్థులు నైపుణ్య రంగంలో నిష్ణాతులుగా మారాలనీ.. విశాఖని స్కిల్ డెవలప్‌మెంట్‌కి కేంద్ర బిందువుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మంగళవారం భవిత కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుడుతున్నారు.
మధురవాడలోని వీ–కన్వెన్షన్ హాల్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని.. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన 8 స్కిల్ డెవలప్‌మెంట్ స్టాల్స్‌ని పరిశీలిస్తారు. అనంతరం పరిశ్రమల భాగస్వాములతో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం 3 ఒప్పందాల్ని సీఎం సమక్షంలో కుదుర్చుకోనున్నారు. ఈ సందర్భంగా స్కిల్‌లోగో, ఫ్లాగ్‌ని, స్కిల్ యాంథమ్‌ని, స్కిల్ యూనివర్స్ యాప్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, న్యూ స్కిల్స్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. నైపుణ్య శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతోనూ సీఎం మాట్లాడనున్నారు.
రూ.1,500 కోట్ల అభివృద్ధి పనులకు...
విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. నగర పర్యటనలో భాగంగా.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఆవిష్కరణలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. రూ.98 కోట్లతో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను సీఎం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
సుమారు రూ.100 కోట్లతో ముడసర్లోవలో నిర్మించనున్న జీవీఎంసీ నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారు. రూ.10 కోట్లతో టెర్టెల్ బీచ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. వెంకోజీపాలెం నుంచి మారియట్ హోటల్ వరకు ఆల్టర్నేటివ్ డబుల్ రోడ్ నిర్మాణం, మధురవాడకు కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏర్పాటు చేయనున్న వాటర్ సప్లయ్ ప్రాజెక్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం తదితర ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమానంలో మంగళవారం 10.30 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో 10.45 గంటలకు మధురవాడ ఐటీ హిల్స్ నెం.3 వద్ద చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 11 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్‌కు చేరుకుంటారు. ‘విజన్..విశాఖ’ పేరిట నిర్వహించే సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. అక్కడ నుంచి 12.35 గంటలకు బయలుదేరి పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ ‘భవిత స్కిల్ డెవలప్‌మెంట్, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకొని 2.30 గంటలకు విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment