అందరికీ ఆమోదం.. అందుకే ఏకగ్రీవం
బొత్స రాజకీయ చతురత ముందు నిలవలేని కూటమి కుయుక్తులు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవ ఎన్నిక
ప్రజాబలమున్న నాయకుడు.. ఉత్తరాంధ్రకు ఆప్తుడు.. రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిని రాటుదేలిన విజయనగరం పెద్దాయన.. ఆయనెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ అభిమానించే బొత్స సత్యనారాయణ. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ వ్యూహాలు, బొత్స సత్యనారాయణ స్థాయి ముందు కూటమి ఎత్తుగడలు ఫలించలేదు. శతవిధాలా కూటమి నేతలు ప్రయత్నించినప్పటికీ బొత్స బలం ముందు ఎవరూ పోటీ చేయడానికి సాహసం చేయలేకపోయారు. దీంతో బొత్స.. ఎదురన్నదే లేకుండా ఎమ్మెల్సీగా గెలుపొందారు.
సాక్షి, విశాఖపట్నం: విద్యార్థి దశ నుంచే తోటి విద్యార్థులకు సహాయం చేయడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటి నాయకత్వ లక్షణాలు అలవరుచుకున్న బొత్స అంచెలంచెలుగా.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా అనేక పదవులు చేపట్టారు. తన రాజకీయ చరిత్రలో అందరివాడుగా నిలిచారనే చెప్పుకోవచ్చు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స వ్యూహం ముందు కూటమి పార్టీలే డీలా పడ్డాయి. వైఎస్సార్‌సీపీకి స్థానిక సంస్థల ఓటర్ల బలముంది. దీంతోపాటు ఎన్నికల నిర్వహణ నైపుణ్యం కలిగిన బొత్సను బరిలోకి దించడంతో ఆయనకు దీటైన పోటీ కోసం కూటమి ప్రభుత్వం గట్టి కసరత్తు చేసింది. కానీ బొత్స వ్యూహం ముందు కూటమి ప్రణాళికలు చిన్నబోయాయి.
బలం లేకున్నా ఎమ్మెల్సీ స్థానం వైఎస్సార్‌సీపీకి దక్కకుండా చేయాలని కూటమి నేతలు కుయుక్తుల పన్నినా.. వారి పన్నాగాలు ఫలించలేదు. ఆ స్థానానికి మొత్తం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ నుంచి బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ ఉల్లా నామినేషన్లు వేశారు. వైఎస్సార్‌సీపీ జోరు చూసి కూటమి వెనక్కి తగ్గింది. బొత్సపై అభిమానంతో వేసిన ఒక్క నామినేషన్‌ను కూడా ఈ నెల 14వ తేదీన ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది.
వైఎస్సార్ కుటుంబమంటే అమితమైన ప్రేమ
బొత్స సత్యనారాయణకు వైఎస్సార్ కుటుంబమంటే అమితమైన ప్రేమ. అప్పుడు మహానేత వైఎస్సార్‌తో సన్నిహితంగా మెలిగిన బొత్స.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కూడా అంతే సన్నిహితంగా ఉంటున్నారు. మహానేత వైఎస్సార్ కేబినెట్‌లో ఉత్తరాంధ్ర ప్రాంత వెనకబడిన వర్గాలకు చెందిన బొత్సకు అప్పట్లో కీలక మంత్రి పదవి కేటాయించారు. మళ్లీ అదే తరహాలో 2019–24లో ఐదేళ్లపాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో కూడా కీలక మంత్రి పదవులు చేపట్టారు. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment