ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చినట్లే విద్యా రంగంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మన దేశంలో గత కొంతకాలంగా విద్య అనేది అతిపెద్ద వ్యాపార పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఇక్కడ విద్యారంగానికి అతిపెద్ద మార్కెట్ కలిగి ఉందని గుర్తించిన విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా ఇక్కడి విద్యార్థులను దోచుకోవడానికి తమ దుకాణాలను తెరవడం మొదలు పెట్టాయి. ఒకపక్క అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో విద్య అనేది వాణిజ్య వస్తువు కాదనీ, దాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టడం నేరమనీ తీర్పులు ఇచ్చినా కూడా విద్యా వ్యాపారవేత్తల తీరు మారకపోవడం శోచనీయం.
1995లో ఐక్యరాజ్యసమితి పేద వర్గాల అభ్యున్నతికి కేవలం విద్య మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి సమాజంలోని ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలని తీర్మానం చేయడం జరిగింది. మన ప్రభుత్వం కూడా విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి అవసరమైన నూతన విధానాన్ని రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంబానీ బిర్లా కమిటీగా పేర్కొన్న ఈ కమిటీ నివేదిక ప్రకారం, సమాచార సాంకేతిక యుగంలో విద్య అత్యంత అవసరం అనీ, అదే సమయంలో మన దేశం లోని విద్యా వ్యవస్థ అత్యంత వక్రంగా ఏర్పాటు చేయ బడిందనీ వ్యాఖ్యానించింది. సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను స్వాగతిస్తూ సరికొత్త విధానాలను రూపకల్పన చేసుకుని అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే, విద్యారంగాన్ని ప్రైవేటీకరించి ఆ రంగంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను, విదేశీ సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వ వర్సిటీలకు నిధులను తగ్గిస్తుండటంతో... పేదవాళ్లు ఉన్నతవిద్యకు దూరమవుతున్నారని గ్రహించలేకపోతున్నారు. విద్య అనేది ప్రభుత్వ సామాజిక బాధ్యత అనే విషయాన్ని ఈ కమిటీ విస్మరించింది. (చదవండి: కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!)
ప్రైవేటు విద్యా సంస్థలు వివిధ మార్గాల ద్వారా విద్యార్థి వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇటువంటి ధోరణి వల్ల విద్యా వ్యవస్థలో నాణ్యత అనేది దిగజారి పోతుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులకు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు రూపకల్పన చేస్తున్నాయి. ఈ వ్యాపార ధోరణిలో కేవలం మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు మాత్రమే బతికి ఉంటాయి. కంప్యూటర్ రంగానికి చెందిన కృత్రిమ మేథస్సు వంటి కొత్త శాఖలు ఆవిర్భ వించడంతో వాటి వైపు విద్యార్థులు పరుగులు తీస్తూ, సాంప్రదాయ కోర్సుల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ కోర్సులు అన్నీ కూడా ఎంతో ఖర్చుతో కూడినవి. పేద వర్గాలకు ఇవి అందనంత దూరంలో ఉన్నాయి. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు)
ఈ నేపథ్యంలో పేదవాడికి కూడా ఇటువంటి అత్యాధునిక కోర్సులు అందుబాటులోకి రావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ విధానాన్ని కల్పించి, ఎంతోమంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు అత్యున్నతమైన ఆధునిక విద్యను అభ్యసించడానికి అవకాశం ఏర్పరిచింది. అయితే, గత ప్రభుత్వం ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయక పోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించలేక మధ్యలోనే తమ చదువులు ఆపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బకాయిలు చెల్లిస్తే గానీ సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా పేద విద్యార్థులు తమకొచ్చిన ఉపాధి ఉద్యోగ అవకా శాలను వదులుకోవాల్సి వచ్చింది.
కానీ నేడు వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం నిర్దిష్ట కాలంలో ఫీజు బకాయిలను విడుదల చేయటం వల్ల విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ చదువులను కొనసాగిస్తున్నారు. ఫీజు రుసుమును తమ తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటం వల్ల తామే స్వయంగా కళాశాలల ఫీజు చెల్లించినట్లయిందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఫీజు రియింబర్స్‌మెంట్ విధానాన్ని ఆర్థిక పరమైన అంశంగానే ప్రభుత్వాలు ఆలోచించాయి. కానీ నేడు పేదలకు ఉద్దేశించిన ప్రతి పథకాన్ని సామాజికపరమైన అంశంగా కూడా చూస్తుండటం వల్ల బలహీన వర్గాల్లో ఆర్థిక స్వావలంబనతో పాటు ఆత్మగౌరవం నెలకొన్నదని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. (చదవండి: అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు)
- ప్రొఫెసర్ ఈదర శ్రీనివాసరెడ్డి
ప్రిన్సిపల్, డాక్టర్ వైఎస్సార్ ఏఎన్నార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
Comments
Please login to add a commentAdd a comment