globalisation
-
ఆర్థికమే కాదు... సామాజికం కూడా!
ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చినట్లే విద్యా రంగంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మన దేశంలో గత కొంతకాలంగా విద్య అనేది అతిపెద్ద వ్యాపార పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఇక్కడ విద్యారంగానికి అతిపెద్ద మార్కెట్ కలిగి ఉందని గుర్తించిన విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా ఇక్కడి విద్యార్థులను దోచుకోవడానికి తమ దుకాణాలను తెరవడం మొదలు పెట్టాయి. ఒకపక్క అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో విద్య అనేది వాణిజ్య వస్తువు కాదనీ, దాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టడం నేరమనీ తీర్పులు ఇచ్చినా కూడా విద్యా వ్యాపారవేత్తల తీరు మారకపోవడం శోచనీయం. 1995లో ఐక్యరాజ్యసమితి పేద వర్గాల అభ్యున్నతికి కేవలం విద్య మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి సమాజంలోని ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలని తీర్మానం చేయడం జరిగింది. మన ప్రభుత్వం కూడా విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి అవసరమైన నూతన విధానాన్ని రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంబానీ బిర్లా కమిటీగా పేర్కొన్న ఈ కమిటీ నివేదిక ప్రకారం, సమాచార సాంకేతిక యుగంలో విద్య అత్యంత అవసరం అనీ, అదే సమయంలో మన దేశం లోని విద్యా వ్యవస్థ అత్యంత వక్రంగా ఏర్పాటు చేయ బడిందనీ వ్యాఖ్యానించింది. సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను స్వాగతిస్తూ సరికొత్త విధానాలను రూపకల్పన చేసుకుని అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే, విద్యారంగాన్ని ప్రైవేటీకరించి ఆ రంగంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను, విదేశీ సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వ వర్సిటీలకు నిధులను తగ్గిస్తుండటంతో... పేదవాళ్లు ఉన్నతవిద్యకు దూరమవుతున్నారని గ్రహించలేకపోతున్నారు. విద్య అనేది ప్రభుత్వ సామాజిక బాధ్యత అనే విషయాన్ని ఈ కమిటీ విస్మరించింది. (చదవండి: కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!) ప్రైవేటు విద్యా సంస్థలు వివిధ మార్గాల ద్వారా విద్యార్థి వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇటువంటి ధోరణి వల్ల విద్యా వ్యవస్థలో నాణ్యత అనేది దిగజారి పోతుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులకు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు రూపకల్పన చేస్తున్నాయి. ఈ వ్యాపార ధోరణిలో కేవలం మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు మాత్రమే బతికి ఉంటాయి. కంప్యూటర్ రంగానికి చెందిన కృత్రిమ మేథస్సు వంటి కొత్త శాఖలు ఆవిర్భ వించడంతో వాటి వైపు విద్యార్థులు పరుగులు తీస్తూ, సాంప్రదాయ కోర్సుల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ కోర్సులు అన్నీ కూడా ఎంతో ఖర్చుతో కూడినవి. పేద వర్గాలకు ఇవి అందనంత దూరంలో ఉన్నాయి. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు) ఈ నేపథ్యంలో పేదవాడికి కూడా ఇటువంటి అత్యాధునిక కోర్సులు అందుబాటులోకి రావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు రియింబర్స్మెంట్ విధానాన్ని కల్పించి, ఎంతోమంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు అత్యున్నతమైన ఆధునిక విద్యను అభ్యసించడానికి అవకాశం ఏర్పరిచింది. అయితే, గత ప్రభుత్వం ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయక పోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించలేక మధ్యలోనే తమ చదువులు ఆపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బకాయిలు చెల్లిస్తే గానీ సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా పేద విద్యార్థులు తమకొచ్చిన ఉపాధి ఉద్యోగ అవకా శాలను వదులుకోవాల్సి వచ్చింది. కానీ నేడు వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం నిర్దిష్ట కాలంలో ఫీజు బకాయిలను విడుదల చేయటం వల్ల విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ చదువులను కొనసాగిస్తున్నారు. ఫీజు రుసుమును తమ తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటం వల్ల తామే స్వయంగా కళాశాలల ఫీజు చెల్లించినట్లయిందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఫీజు రియింబర్స్మెంట్ విధానాన్ని ఆర్థిక పరమైన అంశంగానే ప్రభుత్వాలు ఆలోచించాయి. కానీ నేడు పేదలకు ఉద్దేశించిన ప్రతి పథకాన్ని సామాజికపరమైన అంశంగా కూడా చూస్తుండటం వల్ల బలహీన వర్గాల్లో ఆర్థిక స్వావలంబనతో పాటు ఆత్మగౌరవం నెలకొన్నదని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. (చదవండి: అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు) - ప్రొఫెసర్ ఈదర శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపల్, డాక్టర్ వైఎస్సార్ ఏఎన్నార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ -
దేశంలో దొంగలు పడ్డారు
వీధి చివర మొగలో ఏడు పెంకులాట ఆడే పిల్లలు కనిపిస్తున్నారా? మండు వేసవిలో మిట్టమధ్యాహ్నం ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని అల్టిమేటం జారీచేసే అమ్మానాన్నల కళ్లు గప్పి ఆరుబయటకు వచ్చి జోరీ బాల్ ఆడే కుర్రాళ్లు కనిపిస్తున్నారా? బంతీ బ్యాటూ లేకపోతే రంగు రంగుల గోళీకాయలతో వీధుల్లో అంతర్జాతీయ మ్యాచులు ఆడే బాలలు కనిపిస్తున్నారా? ఎర్ర గోళీని పచ్చగోళీతో కొట్టేసి గెలిచిన ఆనందంలో కేరింతలు కొట్టేవాళ్లనీ, ఓడిపోయి గోళీ పోగొట్టుకుని రాజ్యం కోల్పోయిన రాజులా బెంగపడే వాళ్లనీ చూశారా? ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు పోగు చేసి వాటితో బొమ్మ గడియారాలు తయారు చేసే చిన్ని చిన్ని కళాకారులు కనిపిస్తున్నారా? సిగరెట్ ప్యాకెట్లనే చించి బచ్చాలాట ఆడుకునే బచ్చాల్ని ఈ మధ్య ఎక్కడైనా చూశారా? ఏ వెంకన్న కాపు పొలంలోనో... కాపరి లేని సమయం చూసి మామిడి చెట్లు ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడే అబ్బాయిలు మురిపిస్తున్నారా? ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అంటూ దాక్కున్న వాళ్లని పట్టుకోడానికి నానా తంటాలు పడే పిల్లల ఒలింపిక్స్ క్రీడ ఇప్పటికీ ఉందా? గూటీ బిళ్ల లేదా గిల్లీ దండా ఆటతో వీధిలో అటూ ఇటూ పోయే వాళ్లని భయపెడుతూ తమాషా చూసే పిల్లల ఆనందాన్ని చూశారా? ఇంట్లో పెద్దలు మరీ చండ శాసనుల్లా బయటకు వెళ్ళనీయకుండా ఆపేస్తే ఇళ్ల అరుగుల మీదే పులీ మేక ఆడే పిల్లలు ఇంకా ఆడుతున్నారా? మంచి ఎండలో ఏ మధ్యాహ్నమో ఐస్ ఫ్రూట్ అబ్బాయి ‘ఐస్... పాలైస్’ అంటూ అరుచుకుంటూ వస్తే అమాంతం నిద్ర నటనలోంచి బయటపడి ఐస్ కొని పెట్టమని పెద్దాళ్లను బతిమాలే పిల్లల ఆరాటం చూశారా? (చదవండి: ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?) ఇళ్ల లోగిళ్లలో రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు తొక్కుడు బిళ్ల ఆటలు ఆడుతున్నారా? తాటి ముంజెలను మూడు చక్రాల బళ్లుగా తయారు చేసుకుని వాటినే మెర్సిడెస్ బెంజ్ కారులా సంబరపడిపోయే పిల్ల ఇంజినీర్ల బాలానందాన్ని చూశారా? నదీ తీరాల్లో ఇసుకతో ఇళ్లు కట్టేసి గర్వంగా నవ్వుకునే బుల్లి సివిల్ ఇంజనీర్లు కొత్త వెంచర్లు వేస్తున్నారా లేదా? నెమలి పింఛాన్ని పుస్తకం మధ్యలో పెట్టుకుని కొబ్బరి మట్టపై నూగును తురిమి, పింఛానికి ఆహారంగా పెట్టి ప్రతీ రోజూ పింఛం ఎంత పెరిగిందో పరీక్షించుకునే అమాయక బాల్యంలోని అందాన్ని చూశారా? (చదవండి: అన్నదాత హక్కు గెలిచినట్లే...!) వేసవిలో పూడిక తీతల పనుల కోసం కాలువలు బంద్ చేసే సమయంలో నడుం లోతు ఉన్న నీళ్లల్లో రోజూ దొంగచాటుగా ఈత కొట్టి తడిసిన జుట్టుతో ఇంట్లో డిటెక్టివ్లకు దొరికిపోయి వీపు మీద విమానం మోత మోగగానే గుక్కపెట్టి ఏడ్చే బాల్యాన్ని చూశారా? చిల్ల పెంకును కాలువ నీళ్లపై విసిరి అది ఎన్ని ఎక్కువ గంతులు వేస్తూ ముందుకు పోతే అంత గొప్ప అని పోటీలు పడి ఆడుకునే కుర్రాళ్లు ఇంకా ఉన్నారా? (చదవండి: ఋతు ఘోష) ఏవీ కనపడ్డం లేదు కదూ! మన ఆటలు మన ఆనందాలు రేపటి తరపు మధుర జ్ఞాపకాలు అన్నీ కూడా ఎత్తుకుపోయారు. మన నుండి మన ఆత్మను దోచుకుపోయారు. మన జీవితాల నుండి వెలుగులను దోచుకుపోయారు. ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే మన దేశంలో అడుగు పెట్టాయో అప్పుడే కార్పొరేట్ దొంగలు అవతరించారు. వారే మన ఊళ్లల్లోని చేతి వృత్తులను ఎత్తుకుపోయారు. మన పేదల ఉపాధి అవకాశాలు ఎత్తుకుపోయారు. ఊళ్లల్లో జీవాన్ని, బాలల్లో ఆనందాన్ని, మనుషుల్లో మానవత్వాన్ని... అన్నింటినీ ఎత్తుకుపోయారు. అన్నీ దోచుకుపోయిన ఘరానా దొంగలను పట్టుకోండని ఎవరికి చెప్పాలి? ఒక్కసారి మళ్లీ బాల్యంలోకి రివైండ్ అయిపోయి గత కాలపు ఆటలు మరోసారి ఆడుకుంటే బాగుండునని అనిపిస్తోంది కదూ! కార్పొరేట్ ప్రపంచంలో ఈ కల బహుశా ఇక ఎప్పటికీ నెరవేరదేమో? పగటి కలలోనే ఇక ఈ ఆటలు ఆడుకోవాలేమో? – సి.ఎన్.ఎస్.యాజులు -
ప్రపంచీకరణ అవలంబించే దేశాలకు గ్రీస్ ఎన్నికలు గుణపాఠం
మట్టెవాడ (వరంగల్) : సంస్కరణలు-ప్రపంచీకరణ అవలంబించే దేశాలకు గ్రీస్ ఎన్నికలు ఓ గుణపాఠమని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి ఎండీ గౌస్ అన్నారు. వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జ్ ఓంకార్ భవన్లో పార్టీ జిల్లా కమిటీ సమావేశం పరికిరాల భూమయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ ఇటీవల గ్రీస్ దేశంలో జరిగిన ఎన్నికలలో సిరోజా వామపక్ష పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇది భారత పాలక పెట్టుబడిదారులకు గుణపాఠమని ఆయన తెలిపారు. సామ్రాజ్యవాది అయిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు పెద్దపీట వేయడం శోచనీయమన్నారు. మార్చి 24 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్లో ఎంసీపీఐ(యూ) మూడవ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు.