- భారం కానున్న మెడికల్, ఇంజినీరింగ్ విద్య
- ఫీజులు రెట్టింపు చేసేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరిన ప్రైవేట్ విద్యాసంస్థలు
సాక్షి, బెంగళూరు : మెడికల్, ఇంజినీరింగ్‌తో పాటు ఇతర విభాగాల్లో ఉన్నత విద్యకు సంబంధించిన ఫీజులను రెట్టింపు చేసుకునేందుకు తమకు అనుమతివ్వాలని ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వాన్ని కోరడం విద్యార్థుల్లో కలకలాన్ని రేపుతోంది. అయితే ప్రైవేటు విద్యాసంస్థలు కోరినట్లు ఫీజును రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించలేదని రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ వెల్లడించడం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే....ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్ తదితర ఉన్నత విద్యా విభాగాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఫీజును రెట్టింపు చేసేందుకు వీలుగా తమకు అనుమతినివ్వాలని రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి.
గత ఎనిమిదేళ్లుగా ఫీజుల పెంపు చేపట్టని కారణంగా కళాశాలలను నడపడం చాలా కష్టంగా మారిందని కళాశాలలు ప్రభుత్వానికి నివేదించాయి. అయితే ఒకేసారి ఫీజులను రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించబోదని స్పష్టం చేసినట్లు రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ శనివారమిక్కడ తనను కలిసిన విలేకరులకు తెలిపారు. సాధారణంగా వైద్య విద్యకు సంబంధించి మూడేళ్లకు ఓ సారి 10శాతం మేర ఫీజును పెంచేందుకు అవకాశం ఉందని చెప్పారు. అయితే ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలకు సంబంధించి ఒకేసారి ఫీజును రెట్టింపు చేసేందుకు తామెంతమాత్రం అంగీకరించబోమని పేర్కొన్నారు. ఇక వృత్తి విద్యాకోర్సులకు సంబంధించి ప్రవేశ రుసుముకు సంబంధించిన 2006 చట్టం జారీకి సంబంధించి కళాశాలల యాజమాన్యాలతో మరోసారి చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కళాశాలల ఏర్పాటు ప్రక్రియ సాగుతోందని అన్నారు.
అంగీకరించండి
Published Sun, May 3 2015 2:29 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement