రాష్ట్ర విద్య, వైజ్ఞానిక ప్రదర్శనకు భారీ ఏర్పాట్లు
రాష్ట్ర విద్య, వైజ్ఞానిక ప్రదర్శనకు భారీ ఏర్పాట్లు
Published Thu, Nov 24 2016 11:16 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
నేటి నుంచి ప్రారంభం
జిల్లాలో ఇదే మొదటిసారి
కాకినాడ రూరల్ : విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్‌స్పైర్–2016)ని తొలిసారిగా కాకినాడలో ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ నరసింహరావు తెలిపారు. గురువారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలోని హంసవాహిని విద్యాలయలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీలను రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బీఎస్ భార్గవ్‌లు పాల్గొని ప్రారంభిస్తాన్నారు. జిల్లా స్థాయిలో ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశామని, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి మొత్తం 300 మంది ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లో వాటిని ప్రదర్శిస్తారన్నారు. జిల్లా నుంచి 99 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రదర్శించిన ప్రదర్శనల నుంచి పది శాతం ప్రాజెక్టులను జాతీయ స్థాయి ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి వచ్చే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హంసవాహిని పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 600 మందికి వసతి ఏర్పాట్లు చేశామని డీఈవో నరసింహరావు వివరించారు. రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ అవార్డుల ప్రదర్శన జిల్లాలో జరగడం ఇదే ప్రథమమన్నారు. ఉత్తమ ప్రాజెక్టులుగా జాతీయ స్థాయికి ఎంపికైన ప్రాజెక్టులు ఆయా విద్యార్థుల పేరుతోనే రిజిస్ట్రేషన్ జరుగుతాయన్నారు. భవిష్యత్తులో ఆ విద్యార్థే ఆ ప్రాజెక్టును నిర్వహిస్తారన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను ఏర్పాటు చేసేందుకు అనువుగా 12 గదులను అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశామన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో డీవోఈవైలు ఆర్‌ఎస్ గంగాభవాని, డి నాగేశ్వరరావు, డి వాడపల్లి, ఎస్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
ఎగ్జిబిషన్ ఏర్పాట్లపై సంతృప్తి
రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఇన్‌స్పైర్ ప్రదర్శన ఏర్పాట్లను రాష్ట్ర పరిశీలకులు మెటిల్లా వనజాక్షి, డీఈవో ఆర్ నరసింహారావు పరిశీలించారు. ఏర్పాట్ల వివరాలకు సంబంధించి నియమితులైన ఉపాధ్యాయ బృందాలతో సమీక్ష నిర్వహించి సంతృప్తిని వ్యక్తం చేశారు. వివిధ పాఠశాలలు నిర్వహించిన నృత్యప్రదర్శల రిహాల్స్‌ను అధికారులు పరిశీలించారు.
Advertisement