సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఏడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 679 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపించింది. అలాగే ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ వంటి విభాగాల్లో అధ్యాపకుల కొర తను అధిగమించేందుకు అవసరమైతే 25 శాతం అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చి కాంట్రాక్టు లేదా రెగ్యులర్ పద్ధతిలో అధ్యాపకులను భర్తీ చేయాలని కూడా ప్రతిపాదించింది. మరోవైపు కొత్త కాలేజీ లకు అనుమతి కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కు దరఖాస్తు ప్రక్రియను వైద్య, ఆరోగ్య శాఖ వేగవంతం చేసింది. సెప్టెంబర్ నాటికి నిబంధ నల ప్రకారం దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం ఆ మేరకు మౌలిక సదుపాయాల కల్పన ఏమేరకు జరిగిందో పరిశీలించేందుకు ఎన్‌ఎంసీ ఉన్నతాధికారులు నవంబర్‌లో ఆయా కాలేజీలను సందర్శిస్తారు. వచ్చే ఏడాది బ్యాచ్ ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అనుబంధ ఆసుపత్రుల్లో పడకల కొరత...
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నెలకొల్పాలంటే వాటికి అనుబంధ ఆసుపత్రులు అవసరం. ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను అనుబంధ ఆసుపత్రులుగా నిర్ణయించారు. అయితే మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో తప్పనిసరిగా 300 పడకలు ఉండాలన్నది నిబంధన. అయితే ఆ నిబంధన మేరకు ఏడు ఆసుపత్రుల్లో ఒక దానికే ఆ మేరకు పడకలు ఉన్నాయి. మిగిలిన ఆసుపత్రుల్లో 300 పడకలు లేవు. ఇది ఇప్పుడు వైద్య, ఆరోగ్యశాఖకు సవాల్‌గా మారింది. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 400 పడకలు ఉండగా వనపర్తి, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో 150 చొప్పున, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం వంద చొప్పున పడకలు ఉన్నాయి. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకలున్నాయి. తక్కువ పడకలున్న జిల్లా ఆసుపత్రుల్లో ఆగమేఘాల మీద 300 పడకల చొప్పున వాటిని పెంచాల్సి ఉంటుంది. ఆ మేరకు తక్షణమే పడకల పెంపుపై దృష్టి సారించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది.
కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే ప్రాంతాలు
సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, కొత్తగూడెం, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment