
ఫీజులు భారీగా పెంచాలంటున్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు
ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి ముందు ప్రతిపాదనలు
ఖర్చులు భారీగా పెరిగినట్టు లెక్కలు చూపించిన యాజమాన్యాలు
ఆడిట్ వ్యవస్థతో పాటు ప్రభుత్వ పెద్దలతోనూ మంతనాలు!
ప్రయత్నాలు సఫలమైతే ఈ ఏడాది కన్వినర్ కోటా ఫీజులు రెట్టింపయ్యే చాన్స్
గత మూడేళ్ల కాలంలో ప్రవేశ పెట్టిన పలు కొత్త కోర్సులు, మౌలిక సదుపాయాల కల్పన కారణంగా ఖర్చు బాగా పెరిగిపోయిందని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు చెబుతున్నాయి. వార్షిక ఫీజులను ఈ ఏడాది భారీగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి (టీజీఎఫ్‌ఆర్‌సీ) ముందు ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించాయి. మరోవైపు ప్రభుత్వ పెద్దలతోనూ ఫీజుల పెంపు విషయమై యాజమాన్యాలు లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.
ఖర్చులు పరిశీలించే ఆడిటింగ్ వ్యవస్థతో దొడ్డిదారిన సంప్రదింపులు జరుపుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీలు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది కన్వీనర్ కోటా ఫీజులు దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ఫీజులు కూడా పెరుగుతాయని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్
ప్రతిపాదనలు పరిశీలిస్తున్న ఎఫ్‌ఆర్‌సీ
బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల ఫీజులను ఎఫ్‌ఆర్‌సీ ప్రతీ మూడేళ్ళకోసారి సమీక్షిస్తుంది. 2022లో కొత్త ఫీజులను నిర్ణయించారు. ప్రస్తుతం ఇవే అమల్లో ఉన్నాయి. 2022–23లో నిర్ణయించిన ఫీజులు అప్పట్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఆఖరి సంవత్సరం వరకూ వర్తిస్తాయి. కాగా 2025–26కు కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు గాను ఆడిట్ నివేదికలు ఇవ్వాలని గత ఏడాది ఆగస్టులోనే ఎఫ్‌ఆర్‌సీ యాజమాన్యాలను ఆదేశించింది. దీంతో 157 కాలేజీలు కొత్త ఫీజులతో మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి.
గత మూడేళ్లలో కొత్తగా వచ్చిన కోర్సుల కోసం, మౌలిక వసతులు, బోధన సిబ్బంది కోసం భారీగా ఖర్చు చేశామని జమా ఖర్చుల్లో పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనలను మండలి నేతృత్వంలోని ఆడిట్ బృందాలు పరిశీలిస్తాయి. ఆ తర్వాత యాజమాన్యాలతో మండలి చర్చలు జరిపి ఫీజులను నిర్ణయిస్తుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కొత్త ఫీజులు అమలులోకి వస్తాయి. 2025–26, 2026–27, 2027–28 వరకూ కొత్త ఫీజులు అమల్లో ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌సీ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.
వంద శాతం పెంచాల్సిందే
ఈసారి ఫీజులు భారీగా పెంచాల్సిందేనని ప్రైవేటు కాలేజీలు పట్టుబడుతున్నాయి. 157 కాలేజీలకు గాను 60 కాలేజీల్లో ప్రస్తుతం రూ. 1.40 లక్షలకు పైనే ఫీజు ఉంది. వీటిని ఈసారి రెట్టింపు చేయాలని కోరుతున్నాయి. 33 కాలేజీల్లో రూ.75 నుంచి రూ.1.15 లక్షల వరకూ ఫీజులున్నాయి. ఈ కాలేజీలు రూ.1.10 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకూ పెంచాలని ప్రతిపాదించాయి. రూ.50 వేల లోపు ఉన్న మిగతా కాలేజీలు కనీస ఫీజు రూ.75 వేలు చేయాలని పట్టుబడుతున్నాయి.
మూడేళ్ళ క్రితం కొన్ని కాలేజీల ఫీజులు భారీగా పెరిగాయి. వసతులు, బోధన సిబ్బంది పరిశీలన అనంతరం కొన్నింటికి తగ్గించారు. ఎంజీఐటీ ఫీజు రూ.1.08 లక్షల నుంచి రూ.1.60 లక్షలకు పెరిగింది. నారాయణమ్మ ఫీజు రూ.1.22 లక్షల నుంచి రూ. లక్షకు తగ్గించారు. సీబీఐటీ ఫీజును తొలుత రూ.1.34 లక్షల నుంచి రూ.1.73 లక్షలకు పెంచారు. తర్వాత ఆడిట్ నివేదిక ప్రకారం సవరించి రూ.1.15 లక్షలకు తగ్గించారు. కాలేజీ కోర్టును ఆశ్రయించడంతో అనంతరం రూ.1.65 లక్షలుగా ఖరారు చేశారు. కొన్ని కాలేజీల ఫీజులు అసలు పెంచలేదు. ఇవి ఈసారి ఫీజుల పెంపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.
కొత్త కోర్సులు వచ్చాయి..ఖర్చు పెరిగింది
రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో లక్షకు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో 61 వేల సీట్లు సీఎస్‌ఈ, ఇతర కొత్త కంప్యూటర్ కోర్సులవే ఉన్నాయి. కాగా కొత్త కోర్సుల కోసం భారీగా ఖర్చు చేశామని కాలేజీలు అంటున్నాయి. లైబ్రరీ, లేబొరేటరీ, ఇతర మౌలిక వసతుల నేపథ్యంలో ఈ మూడేళ్ళలో 80 శాతం వ్యయం పెరిగిందని చెబుతున్నాయి. ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల ఫ్యాకల్టీకి అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నట్టు జమా ఖర్చుల్లో పేర్కొన్నాయి.
తీవ్ర వ్యతిరేకత
ప్రైవేటు కాలేజీల ప్రతిపాదనలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేటు అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మౌలిక వసతులు ఈ మూడేళ్లలో ఎక్కడా పెరగలేదని, చాలా కాలేజీల్లో సరిపడా ఫ్యాకల్టీ లేదని అంటున్నాయి. ఆడిట్ వ్యవస్థతో పాటు ప్రభుత్వం అన్నీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఫీజులపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి.
వేతనాలే ఇవ్వడం లేదు
చాలా కాలేజీలు ఉద్యోగులకు సరిగా వేతనాలు ఇవ్వడం లేదు. ఒక్కసారి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. కొత్త కోర్సులు వచ్చినా, సీట్లు పెరిగినా, నైపుణ్యం ఉన్న సిబ్బందిని నియమించలేదు. కాలేజీల్లో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయో అధికారులు పరిశీలించాలి. తప్పుడు నివేదికలు ఇచ్చిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. – అయినేని సంతోష్‌కుమార్ (ప్రైవేటు సాంకేతిక కాలేజీల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు)
తప్పుడు లెక్కలు ఆమోదించొద్దు
ప్రైవేటు కాలేజీలు తప్పుడు ప్రతిపాదనలతో ఫీజుల పెంపునకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని గుడ్డిగా ఆమోదించవద్దు. దీనివల్ల పేద విద్యార్థికి చదువు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎఫ్‌ఆర్‌సీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. – టి.నాగరాజు (ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)