సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల పనితీరుపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) నిర్దేశించిన బోధన రుసుము కంటే వాసవీ, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలు అధికంగా వసూలు చేస్తున్నాయంటూ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. వాసవీ కళాశాల తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపిస్తూ సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఏఎఫ్‌ఆర్సీ ఫీజులు నిర్ధారించిందని, అందువల్ల కళాశాల హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింద ని నివేదించారు. ఏఎఫ్‌ఆర్సీ సదరు కళాశాల ఫీజును రూ.97 వేలుగా నిర్దేశిస్తే హైకోర్టు ఆ ఫీజును రూ.1.60 లక్షలకు పెంచిందని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కె.రాధాకృష్ణన్ ధర్మాసనానికి నివేదించారు. దీంతో ఏఎఫ్‌ఆర్సీ నిర్ణయాన్ని కాదని హైకోర్టు ఎలా ఫీజులను పెంచుతుందని ధర్మాసనం ప్రశ్నించింది.
హైకోర్టుకు ఆ అధికారం ఉందా అన్న అంశంపై లోతుగా విచారణ జరుపుతామని పేర్కొంది. జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రైవేటు కళాశాలల పనితీరు మాకు తెలుసు. 250కి పైగా కళాశాలలు తనిఖీ చేశా. నిర్వహణ ఎలా ఉంటుందో మాకు తెలుసు. రికార్డుల్లోనే ప్రొఫెసర్లు ఉంటారు. కళాశాలవారీగా ఎవరికి వారు ఫీజు నిర్దేశించుకుంటామంటే కుదరదు.. అని వ్యాఖ్యానించారు. ఏఎఫ్‌ఆర్సీ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు నిర్దేశించిన ఫీజుల వివరాలు, వాటిపై హైకోర్టు పెంచిన ఫీజు వివరాలు, కళాశాలలు తమకు తామే నిర్దేశించిన ఫీజుల వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది వెంకటరెడ్డి, పేరెంట్స్ అసోసియేషన్ తరఫున న్యాయవాది కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
రికార్డుల్లో మాత్రమే ప్రొఫెసర్లు
Published Thu, Mar 14 2019 3:20 AM | Last Updated on Thu, Mar 14 2019 3:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment