ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపునకు రంగం సిద్ధం | Telangana: Private Engineering Colleges To Increase Fees By 15 Percent | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపునకు రంగం సిద్ధం

Published Mon, Apr 4 2022 4:24 AM | Last Updated on Mon, Apr 4 2022 9:16 AM

Telangana: Private Engineering Colleges To Increase Fees By 15 Percent - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల మోత మోగనుంది. ఫీజుల పెంపు దిశగా ప్రవేశాలు, నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) కసరత్తు మొదలు పెట్టినట్టు తెలిసింది. ఇప్పుడున్న ఫీజుకు దాదాపు 15 శాతం పెంపునకు ఎఫ్‌ఆర్‌సీ అంగీకరించినట్టు కాలేజీల యాజమాన్యాలు చెప్పుకుంటున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంనుంచి పెంచిన ఫీజులు అమలులోకి వచ్చే అవకాశముంది.

2019లో నిర్ధారించిన ఇంజనీరింగ్‌ ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఫీజుల పెంపు కోసం ప్రైవేటు కాలేజీల నుంచి వచ్చిన ఆడిట్‌ రిపోర్టులపై ఎఫ్‌ఆర్‌సీ పరిశీలన తుదిదశకు చేరుకుంది. గత మూడేళ్లలో మౌలిక సదుపాయాల కోసం వెచ్చించిన మొత్తం, విద్యార్థుల నుంచి వచ్చిన ఫీజులు, ఇంకా ఎంత లోటు ఉంటుందనే వివరాలను కాలేజీ యాజమాన్యాలు ఎఫ్‌ఆర్‌సీ ముందుంచాయి. కోవిడ్‌ వల్ల కాలేజీలు పూర్తిస్థాయిలో తెరవకపోయినా ఖర్చును మాత్రం పెంపునకు సరిపడా చూపించాయి.  

కంప్యూటర్‌ కోర్సులతో ఖర్చు 
మూడేళ్లుగా విద్యార్థులు 95.56 శాతం కంప్యూటర్, అనుబంధ కోర్సులనే ఎంచుకున్నారని ఎక్కువ కాలేజీలు ఎఫ్‌ఆర్‌సీ ముందు పేర్కొన్నాయి. గతేడాది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ వంటి కోర్సుల్లో ఆయా కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి. ఈ కోర్సులకు అదనంగా అప్లికేషన్స్, కంప్యూటర్స్, ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాల్సి వచ్చిందని, వీటికి అదనంగా ఖర్చు చేశామని చెబుతున్నాయి.

సైన్స్‌ గ్రూపుల ఫ్యాకల్టీకి కూడా అదనంగా వెచ్చించాల్సి వస్తోందన్నాయి. ప్రస్తుతం ఫీజులు రూ.35 వేల నుంచి 1.40 లక్షల వరకూ ఉన్నాయి. కాలేజీలు 25 శాతం మేర ఫీజులు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి. రూ.35 వేల వార్షిక ఫీజు ఉన్న కాలేజీలు మాత్రం రెట్టింపును కోరుతున్నాయి. అయితే, కనీసం 10 నుంచి 15 శాతం పెంపు అనివార్యమనే వాదన ఎఫ్‌ఆర్‌సీ వర్గాల నుంచి విన్పిస్తోంది.  

ఇదో మాయాజాలం
కొత్త కోర్సులను అడ్డుపెట్టుకుని ప్రైవేటు కాలేజీలు మరోసారి ఫీజుల మాయాజాలానికి తెరలేపుతున్నాయి. కంప్యూటర్‌ కోర్సుల బోధనకు అవసరమైన నైపుణ్యం గల ఫ్యాకల్టీ లేదని ప్రభుత్వ కమిటీనే పేర్కొంది. . డబ్బుల కోసం కాలేజీలు చేస్తున్న వాదన పేదలకు నష్టం చేస్తుంది. ఫీజుల నియంత్రణ కమిటీ జోక్యం చేసుకుని, వాస్తవాలు పరిశీలించాలి. అడ్డగోలుగా ఫీజులు పెంచితే విద్యార్థిలోకం ఆందోళన చేపట్టడం మినహా మరోమార్గం లేదు.     
–టి.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి  

అవి బోగస్‌ రిపోర్టులు
ప్రైవేటు కాలేజీల ఆడిట్‌ రిపోర్టుల్లో విశ్వసనీయత లేదు. నిర్వహణ ఖర్చులపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి, జేఎన్‌టీయూ, ఎఫ్‌ఆర్‌సీకి వేర్వేరు నివేదికలకు ఇస్తున్నాయి. 2019లో పెంచిన ఫీజులకు అనుగుణంగా ఫ్యాకల్టీకి చాలా కాలేజీలు వేతనాలు ఇవ్వడం లేదు. కరోనా కాలంలో మెజారిటీ కాలేజీలు 50 శాతం జీతాలు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల ఆడిట్‌ రిపోర్టులను ఎఫ్‌ఆర్‌సీ క్షుణ్ణంగా పరిశీలించి ఫీజులపెంపుపై నిర్ణయం తీసుకోవాలి.    
–అయినేని సంతోష్‌ కుమార్, టీఎస్‌టీసీఈఏ, రాష్ట్ర అధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement