ఫీజుల లెక్క తేలింది! | It was found that the number of fees! | Sakshi
Sakshi News home page

ఫీజుల లెక్క తేలింది!

Published Thu, Jun 9 2016 2:46 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

ఫీజుల లెక్క తేలింది!

ఫీజుల లెక్క తేలింది!

- ఇంజనీరింగ్ ఫీజులపై ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన ఏఎఫ్‌ఆర్‌సీ
- టాప్ కాలేజీల్లో రూ. 3 వేల నుంచి రూ. 25 వేల వరకు పెంపు
- ఆ తర్వాత స్థాయి కాలేజీల్లో రూ.2 వేల నుంచి 10 వేల వరకు పెంపు
- ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజులను అంగీకరించని కొన్ని కాలేజీలు
- పూర్తి స్థాయి కమిటీ నిర్ణయం తర్వాత సర్కారు నిర్ణయమే ఫైనల్
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే మూడేళ్ల పాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు పూర్తయ్యింది. కళాశాలల ఆదాయ వ్యయాల ప్రకారం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ) ఫీజులను ఖరారు చేసింది. అయితే యాజమాన్యాలు తమ కాలేజీల్లో ఫీజుల పెంపు కోసం చేసిన ప్రతిపాదలను బట్టి చూస్తే.. ఈసారి భారీ మొత్తంలో ఫీజులు పెరుగుతాయని భావించినా అంత మొత్తం పెరగలేదు. కాలేజీల ఆదాయ, వ్యయాల లెక్కల ప్రకారమే ఫీజులను పెంచారు. కాలేజీలు చేసిన ప్రతిపాదనలకు భారీగా కత్తెర పడింది.

కానీ కొన్ని టాప్ కాలేజీల్లో గత ఏడాది వరకు ఉన్న ఫీజులపై అదనంగా రూ. 3 వేల నుంచి రూ. 25 వేల వరకు పెరిగింది. ఆ తర్వాత స్థాయిలో ఉన్న కాలేజీల్లో రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు ఫీజులు పెరిగినట్లు తెలిసింది. ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజుకు తాము అంగీకరించబోమని కొన్ని ప్రముఖ కాలేజీ యాజమాన్యాలు తేల్చిచెప్పినట్లు సమాచారం. గడిచిన మూడేళ్ల ఆదాయ వ్యయాల పరిశీలన , కొత్త ఫీజుల ఖరారు కోసం యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఏఎఫ్‌ఆర్‌సీ ఖ రారు చేసిన ఫీజుకు 95 శాతం యాజమాన్యాలు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. కొన్ని టాప్ కాలేజీలు మాత్రం అంగీకరించలేదు. తమ కాలేజీలకు ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజుకు తాము ఒప్పుకోమని పేర్కొంటూ ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయానికి అనుగుణంగా సంతకం చేయలేదని తెలిసింది. అంటే ఆయా కాలేజీలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

 మెజారిటీ కాలేజీల్లో రూ.65 వేల నుంచి రూ.75 వేలు
 రాష్ట్రంలోని 247 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిల్లో అనేక కాలేజీల్లో వార్షిక ఫీజును రూ.65 వేల నుంచి రూ.75 వేల వరకు ఖరారు చేసింది. మిగతా కాలేజీల్లో రూ.35 వేల నుంచి రూ.65 వేలుగా ఖరారు చేసినట్లు సమాచారం. కాలేజీల ఆదాయ వ్యయాలను ఏఎఫ్‌ఆర్‌సీ పరిశీలించిన తర్వాత కొన్ని కాలేజీలకు ఇప్పటివరకు ఉన్న కనీస ఫీజు రూ.35 వేలు కూడా రాలేదు. దీంతో అంతకంటే తక్కువ ఫీజు చెల్లిస్తే కాలేజీల నిర్వహణ సాధ్యంకాదన్న భావనతో అనేక చర్చల తర్వాత వచ్చే మూడేళ్లు కూడా కనీస ఫీజు రూ. 35 వేలు ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.

 మరో రెండు దశల తర్వాతే ఫైనల్
 ఏఎఫ్‌ఆర్‌సీ ప్రాథమికంగా నిర్ణయించిన ఫీజులే ఫైనల్ కాదు. వీటిపై ఏఎఫ్‌ఆర్‌సీ పూర్తి స్థాయి కమిటీ సమావేశమై చర్చించి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ప్రభుత్వ స్థాయిలోనూ వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజుల వివరాల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏఎఫ్‌ఆర్‌సీ పూర్తి స్థాయి కమిటీ సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం ఖరారు చేసేవే ఫైనల్ ఫీజులు. వాటిని కాలేజీలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజుల నిర్ణయంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానానికీ లింకు ఉన్నందునా ప్రభుత్వం విస్తృతంగా చర్చించాకే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

 బయోమెట్రిక్ తప్పనిసరి
 ప్రస్తుతం కాలేజీలవారీగా ఫీజులపై నిర్ణయం చేసిన ఏఎఫ్‌ఆర్‌సీ ఈసారి ప్రభుత్వానికి మరో కీలక ప్రతిపాదన చేయబోతున్నట్లు తెలిసింది. ప్రతి కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తేనే ఈ ఫీజులను ఇవ్వాలని సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వం ప్రవేశాల్లోనూ ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేస్తోంది. ఇక వచ్చే వారం పది రోజుల్లో ఏఎఫ్‌ఆర్‌సీ పూర్తి స్థాయి కమిటీ సమావేశమై ప్రభుత్వానికి ఫీజుల ఫైలు పంపించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement