Engineering: ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు | Telangana High Court Permits Enhanced Fee for Engineering Courses | Sakshi
Sakshi News home page

Engineering: ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు

Published Wed, Sep 7 2022 12:16 PM | Last Updated on Wed, Sep 7 2022 12:28 PM

Telangana High Court Permits Enhanced Fee for Engineering Courses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పెరిగిన ఫీజులు.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు గుదిబండగా మారనున్నాయి. సగటున ఒక్కో విద్యార్థిపై ఏటా అదనంగా రూ.20 వేల భారం పడుతుందని.. నాలుగేళ్లకు కలిపి రూ.80వేలు భరించాల్సి వస్తుందని విద్యా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ ఫీజులు పెంచిన కళాశాలల్లో చేరే దాదాపు 45 వేల మంది విద్యార్థులపై ఈ భారం పడనుంది. వీరంతా కన్వీనర్‌ కోటా కింద చేరే విద్యార్థులే కానుండటం గమనార్హం. ఇక అదనపు ఫీజు భారానికితోడు ట్రాన్స్‌పోర్టు/హాస్టల్‌/ల్యాబ్‌ ఖర్చులపేరిట ప్రతినెలా మరో రూ.ఐదు వేల వరకు భారం పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ ఫీజులో అదనంగా రూ.లక్షకుపైనే ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

రూ.45 వేల దాకా అదనపు భారం 
కోర్టు అనుమతి మేరకు కాలేజీలను బట్టి వార్షిక ఫీజు కనీసం రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.45 వేల వరకు పెరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 10వేలలోపు ర్యాంకు వచ్చి కాలేజీల్లో చేరే దాదాపు ఆరు వేల మంది బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు పూర్తిఫీజును ప్రభుత్వం ఇస్తుంది. గతేడాది కనీస ఫీజు రూ.35 వేలు, గరిష్ట ఫీజు రూ.1.38 లక్షలు ఉండేది. అదిప్పుడు రూ.45 వేల నుంచి రూ1.73 లక్షలకు పెరిగింది. ఈ అదనపు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.

మరోవైపు పదివేలకన్నా పైన ర్యాంకు వచ్చినవారికి ప్రభుత్వం కనీస ఫీజును మాత్రమే చెల్లిస్తుంది. ఆపై మొత్తాన్ని విద్యార్థులే కట్టాలి. దీంతో పదివేలపైన ర్యాంకు వచ్చిన బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులందరిపై పెరిగిన ఫీజు మోత మోగనుంది. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పరిధిలోకి రానివారికీ భారం పడుతోంది. సగటున చూస్తే ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.20వేల చొప్పున నాలుగేళ్లకు రూ.80 వేలకుపైగా అదనపు భారం పడనుంది. 

పెంచిన ఫీజులను తగ్గించాల్సిందే.. 
ఏఎఫ్‌ఆర్‌సీ, రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష సహకారంతోనే ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఫీజులు పెంచుకున్నాయి. దీనిని వెంటనే వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరోనా ప్రభావం నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్‌ ఫీజులు పెంచవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. పేద విద్యార్థులపై ఫీజుల భారం మోపారు.   
– ప్రవీణ్, ఏబీవీపీ నేత  

కోర్టుకెళ్లి పెంచుకున్న కాలేజీలు 
‘తెలంగాణ రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిషన్‌(టీఎస్‌ఏఎఫ్‌ఆర్‌సీ)’ ఈసారి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫీజుల పెంపు ప్రక్రియ చేపట్టింది. కాలేజీల ప్రతిపాదనలను పరిశీలించి, యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి.. 20 నుంచి 25% ఫీజుల పెంపును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలపై ఏమీ తేల్చలేదు. దీనితో 81 ఇంజనీరింగ్‌ కాలేజీలు కోర్టును ఆశ్రయించి ఈ విద్యా సంవత్సరంలోనే ఫీజుల పెంపునకు అనుమతి తెచ్చుకున్నాయి. అయితే కోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటివరకు అప్పీలు చేయలేదని.. అంటే పరోక్షంగా పెంపును అంగీకరించనట్లేనన్న విమర్శలు వస్తున్నాయి. 


ట్యూషన్‌ ఫీజు రూ.లక్షకు పైగా ఉండే అవకాశం

సీబీఐటీలో రూ.1.73 లక్షలకు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్‌ఐటీ మహిళా కాలేజీలలో రూ.1.55 లక్షలు, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి కాలేజీలో రూ.1.50 లక్షలు, ఎంవీఎస్‌ఆర్‌ రూ.1.45 లక్షలు చొప్పున ట్యూషన్‌ ఫీజులకు అనుమతి లభించింది. అయితే ఫీజు పెంపునకు సంబంధించి హైకోర్టు.. కాలేజీలకు తాత్కాలిక అనుమతి మాత్రమే ఇచ్చింది. మొత్తం 79 కాలేజీలుండగా.. 36 కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజు రూ.లక్షకు పైగా ఉండే అవకాశం ఉంది. కాగా, కాలేజీలు వసూలు చేసే పెంపు మొత్తాన్ని బ్యాంకుల్లోనే ఉంచాలని.. తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఫీజు పెంపు ఉత్తర్వులు ఉంటాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement