సీట్లన్నీ మేనేజ్‌మెంట్ కోటాగా మార్చుకునేందుకు వ్యూహాలు
ఇందుకోసం డీమ్డ్ యూనివర్సిటీలుగా మారేందుకు యత్నాలు
ఇలాగైతే పేదలకు అందే 50 శాతం కనీ్వనర్ సీట్లకు మంగళం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లూ వర్తించని పరిస్థితి
ఇప్పటికే రాష్ట్రంలో రెండు కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారిన తీరు
అదే దారిలో యూజీసీకి దరఖాస్తు చేసుకున్న మరో రెండు మెడికల్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పేదలకు అందే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నుతున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలుగా హోదా తెచ్చుకుని.. ప్రభుత్వ నియంత్రణ లేకుండా తమదైన నిబంధనలు అమలు చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్‌మెంట్ సీట్లుగా మార్చుకోవడమేకాదు.. ఫీజులను ఇష్టారీతిన పెంచుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం వంటి చర్యల ద్వారా అంతా సొంత రాజ్యాలుగా మార్చుకునేందుకు ఈ మార్గం ఎంచుకుంటున్నాయి. ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)’నుంచి డీమ్డ్ వర్సిటీలుగా అనుమతులు తెచ్చుకుంటాయి. ప్రతిభ ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలలకు ఈ తీరు దెబ్బకొట్టనుంది.
ఇప్పటికే రెండు కాలేజీలకు..
ఇటీవలే మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీ హోదాను మంజూరు చేసింది. అపోలో, సీఎంఆర్ మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. మున్ముందు మరికొన్ని కాలేజీలు ఇదే బాటన నడిచేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది. ఈ పరిణామాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా యూజీసీకే దరఖాస్తు చేసుకుంటూ పోతే ఎలాగని.. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
ఇష్టారాజ్యంగా సీట్ల భర్తీ కోసం..
రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాగా.. 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వంలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా కనీ్వనర్ కోటాలోనే భర్తీ చేస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో సగం కనీ్వనర్ కోటా కింద భర్తీ చేస్తారు. వాటి ఫీజు ఏడాదికి రూ.60 వేలు మాత్రమే. డీమ్డ్ వర్సిటీలుగా మారిన మెడికల్ కాలేజీల్లో ఈ కనీ్వనర్ కోటా సీట్లన్నీ మేనేజ్‌మెంట్ కోటాలోకి మారిపోతాయి. మొత్తం సీట్లన్నీ కాలేజీల చేతిలోకే వెళ్లిపోతాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లుండగా... అందులో 200 సీట్లు కనీ్వనర్ కోటాలోకి రావాలి.
కానీ వాటికి డీమ్డ్ వర్సిటీ హోదా రావడంతో.. అవన్నీ మేనేజ్‌మెంట్ కోటాలోకే వెళ్లిపోయాయి. ఇక డీమ్డ్ వర్సిటీ కాలేజీల్లో స్థానిక అభ్యర్థులకు కోటా ఉండదు. దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులైనా వచ్చి చేరవచ్చు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉండవు. ఫీజులు నిర్ణయించుకునే అధికారం కూడా యాజమాన్యాలకే ఉంటుంది. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా యాజమాన్యాలే నిర్వహించుకుంటాయి. అంటే ఆ మెడికల్ కాలేజీలు పూర్తిగా యాజమాన్యాల సొంత రాజ్యాలుగా మారిపోతాయి. కనీ్వనర్ కోటా సీట్లలో చాలా వరకు ప్రతిభ ఉన్న పేద విద్యార్థులే దక్కించుకుంటారు. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోతుండటంతో వారికి అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకూ నష్టదాయకమేకావడం ఆందోళనకరం.
Comments
Please login to add a commentAdd a comment