డబ్బుంటేనే డాక్టర్‌ గిరి? | Convener Quota Seats In Private Medical Colleges Are Likely To Increase | Sakshi
Sakshi News home page

డబ్బుంటేనే డాక్టర్‌ గిరి?

Published Tue, Dec 10 2019 1:35 AM | Last Updated on Tue, Dec 10 2019 9:14 AM

Convener Quota Seats In Private Medical Colleges Are Likely To Increase - Sakshi

ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రభుత్వం భర్తీ చేసే సీట్ల ఫీజు రూ.60 వేలు. అదే ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని  బీ కేటగిరీ సీట్ల ఫీజు రూ.11.55 లక్షలు. అదే సీ(ఎన్‌ఆర్‌ఐ) కేటగిరీ ఫీజు రూ. 23.10 లక్షలు. ఇప్పుడు వీటినే ప్రధానంగా మార్చనున్నారు.ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజులు పేదలకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంతో ఉపశమనంగా ఉన్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020–21 వైద్య విద్యా సంవత్సరంలోనే ఈ ఫీజుల భారాన్ని వైద్య విద్యార్థులపై పడేసేలా కేం ద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చట్టం అమలుపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ఫీజుల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఎంసీఐ స్థానంలో ఏర్పడిన బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బోగ్‌)ను కేంద్రం తాజాగా ఆదేశించింది.

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజును కాలేజీ యాజమాన్యాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేస్తారు. మిగి లిన 50% కన్వీనర్‌ కోటా ఫీజులను కేంద్రం నిర్ధారించనుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ‘బోగ్‌’ఫీజులపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. వారి సలహాలను కోరింది. ఎంఎన్‌సీ చట్టం వల్ల అత్యంత తక్కువగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా ఫీజులు మరింత పెరుగుతాయి. 

యాజమాన్య సీట్ల ఫీజులూ ఇష్టారాజ్యంగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్‌ఎంసీ బిల్లుపై మొదట్లో జూనియర్‌ డాక్టర్లు (జూడా) రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కానీ సర్కారు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.

పేద విద్యార్థులపై పిడుగు...
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 4,900 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 1,500 వరకు కన్వీనర్‌ కోటా సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సీట్ల ఫీజు ఏడాదికి రూ. 10 వేలుకాగా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్‌ కోటా సీట్లను కూడా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. వాటి ఫీజును రూ. 60 వేలుగా ప్రభుత్వం నిర్ధారించింది. ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజులు పేదలకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంతో ఉపశమనంగా ఉన్నాయి.

అదే ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 35 శాతంగా ఉన్న బీ కేటగిరీ ఎంబీబీఎస్‌ సీట్ల ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలుగా ఉండగా సీ (ఎన్‌ఆర్‌ఐ) కేటగిరీ ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ. 23.10 లక్షలుగా ఉంది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజులను ఎంఎన్‌సీ నియంత్రిస్తుంది. వాటినే ఇప్పుడు ప్రధానంగా మార్చనున్నారు. ప్రస్తుతం ఈ ఫీజులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. డీమ్డ్‌ వర్సిటీల్లోని అన్ని ఎంబీబీఎస్‌ సీట్లకు ఒకటే ఫీజు ఉంది.

దేశవ్యాప్తంగా ఒక్కో డీమ్డ్‌ వర్సిటీలో ఫీజులు మన రాష్ట్రంలోని బీ కేటగిరీ ఫీజులకు దగ్గరగా ఉంటాయి. వాటిని క్రమబద్ధీకరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయా ఫీజులను రూ. 6–7 లక్షల వరకు క్రమబద్ధీకరిస్తారని సమాచారం. అవే ఫీజులను ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లకు కూడా ఖరారు చేస్తారని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. 

గందరగోళం నెలకొంది...
ఎన్‌ఎంసీ చట్టం నేపథ్యంలో ఫీజులపై ఇప్పుడు కసరత్తు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్‌ఎంసీ చట్టం ప్రకారం ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజును ‘బోగ్‌’నిర్ధారించనుంది. మిగిలిన 50 శాతం సీట్ల ఫీజును ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదించి యాజమాన్యాలు నిర్ధారించుకునే అవకాశముంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అయితే ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజును ఇప్పుడు ఏ మేరకు నిర్ధారిస్తారన్న దానిపై గందరగోళం నెలకొంది. ఫీజుల పెంపుపై మాకు ఇప్పటివరకు సమాచారం రాలేదు.
– డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం

పెంచితే పెనుభారమే...
డీమ్డ్‌ వర్సిటీలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజులను పెంచితే అది పేద విద్యార్థులకు పెనుభారమే కానుంది. ఫీజులు పెంచుతారన్న ఆందోళనైతే ఇప్పటికీ నెలకొని ఉంది. ఎన్‌ఎంసీ బిల్లు వచ్చిన సమయంలో ఫీజులు పెరుగుతాయని ఉద్యమాలు చేశాం. అయినా బిల్లు చట్టంగా రూపుదిద్దుకుంది.
- డాక్టర్‌ విజయేందర్, సలహాదారు, జూడాల సంఘం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement