పరిష్కారానికి చొరవ చూపేదెవరు?
* ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై పీటముడి
* స్లైడింగ్‌కైనా అవకాశం తప్పనిసరి
* ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందిస్తేనే విద్యార్థులకు న్యాయం
* ఇంజనీరింగ్ రివ్యూ పిటిషన్‌పైనే ఆశలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వ్యవహారంలో విద్యార్థులకు మేలు జరగాలంటే కనీసం స్లైడింగ్‌కైనా (కాలేజీ, బ్రాంచీ మార్చుకునే) అవకాశం కల్పించాల్సి ఉంది. ఇందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలసి స్పందిస్తేనే ఫలితం ఉంటుంది. అయితే ఎవరు చొరవ తీసుకుంటారన్నదే ఇపుడు సమస్య. ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయంటూ కోర్టుకు చెప్పిన ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై మిన్నకుండిపోగా, తాము ప్రవేశాల గడువు పెంచాలని కోరినా ఏపీ సర్కారే వద్దన్నదంటూ తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో కన్వీనర్ కోటాలో తమకు ఇష్టంలేని బ్రాంచీల్లో మెరిట్ మేరకు సీట్లు పొందిన విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది.
వేలమందికి నిరాశ..
ఇంజనీరింగ్‌లో 1.16 లక్షల మందికి అధికారులు సీట్లు కేటాయించారు. అందులో 1.12 లక్షలమంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. ఇంకో నాలుగువేల మంది స్లైడింగ్ ఉంటుందనే ఆశతో ఇష్టంలేని కాలేజీల్లో చేరలేదు. కాగా, కాలేజీల్లో చేరిన వారిలో చాలా మంది స్లైడింగ్‌లో మరో కాలేజీలో.. మరో బ్రాంచీకి మారవచ్చనే ఆలోచనతో ఉన్నారు. అయితే గురువారంనాటి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వారి ఆశలు అడియాసలయ్యాయి. తల్లిదండ్రులు కూడా తీవ్రఆవేదన చెందుతున్నారు.
35 వేల మందికి ఇష్టమైన బ్రాంచీలో సీటు రానందునే!
మేనేజ్‌మెంట్ కోటా విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే భావన అధికారుల్లో ఉంది. మేనేజ్‌మెంట్ కోటా కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి గత నెల 22న నోటిఫికేషన్‌ను జారీ చేసినా, అంతుకుముందుగానే యాజమాన్యాలు సీట్లు భర్తీ చేసుకున్నాయని తెలుస్తోంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కన్వీనర్ కోటాలో మంచి బ్రాంచీల్లో సీట్లు రాకపోవడంతో మేనేజ్‌మెంట్ కోటాలో పేరున్న కాలేజీలో, ఇష్టమైన బ్రాంచీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారు 35 వేలమంది ఉంటారు. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
దీనికితోడు బీటెక్ బయోటెక్నాలజీ వంటి కోర్సుల్లో బైపీసీ స్ట్రీమ్ ద్వారా ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న మరో 3 వేల మందికి కౌన్సెలింగ్ ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక వారంతా నేరుగా కాలేజీలను సంప్రదించి అనధికారింగా చేరాల్సి ఉంది. అయితే అసలు నోటిఫికేషనే జారీ చేయనపుడు ప్రవేశాలు చేపట్టడమూ కుదరకపోవచ్చనే వాద న ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలప్రభుత్వాలు, రెండు ఉన్నత విద్యా మండళ్లు పట్టిం పులు వీడాలని నిఫుణులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు మేలు చేసేందుకు ఉమ్మడి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.