సాక్షి, హైదరాబాద్: రాష్ట్రచరిత్రలో మొదటిసారిగా కన్వీనర్ కోటాకింద ఎంబీబీఎస్‌లో అధిక ర్యాంకర్‌కు సీటు లభించింది. నీట్‌లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఓ విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు లభించింది. ఈ విషయాన్ని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
ఎంబీబీఎస్ కన్వినర్ కోటా మొదటివిడత జాబితాను వర్సిటీ బుధవారం వెల్లడించింది. ఏ కాలేజీలో ఎవరికి సీట్లు వచ్చాయో... విద్యార్థులకు సమాచారం పంపించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న కన్వినర్ సీట్లలో 4,378 సీట్లు విద్యార్థులకు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది.
♦ గతేడాది ఓ ప్రైవేట్ కాలేజీలో చివరి (నాలుగో) విడత కౌన్సెలింగ్‌లో 2.28 లక్షల ర్యాంకర్‌కు బీసీ–ఏ కేటగిరీలో కన్వినర్ సీటు లభించగా, ఈసారి మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే 2.38 లక్షల ర్యాంకు సాధించిన ఎస్సీ కేటగిరీ విద్యార్థికి కన్వినర్ సీటు లభించడం విశేషం.
♦ గతేడాది జనరల్ కేటగిరీలో చివరి విడతలో 1.25 లక్షల ర్యాంకుకు సీటు లభించగా, ఇప్పుడు మొదటి విడతలోనే 1.31 లక్షల ర్యాంకుకు జనరల్ కేటగిరీలో సీటు వచ్చింది.
♦ బీసీ– బీ కేటగిరీలో గతేడాది 1.37 లక్షల ర్యాంకుకు సీటు రాగా, ఈసారి మొదటి విడతలోనే 1.40 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చింది.
♦ గతేడాది బీసీ–డీ కేటగిరీలో 1.28 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.35 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చింది.
♦ అన్ని కేటగిరీల్లోనూ గత ఏడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా కన్వినర్ కోటాలోనే సీట్లు వచ్చాయి.
కన్వినర్ కోటా సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు విడతల కౌన్సెలింగ్ జరుగుతుంది. మొద టి విడతలో సీటు వచ్చినా, జాతీయస్థాయి కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినవారు ఇక్కడ చేరకుంటే, ఆ సీట్లు తదుపరి విడతల్లో కేటాయిస్తారు. అప్పుడు ఇంకా పెద్ద ర్యాంకర్‌కు సీటు వచ్చే అవకాశముంది.
పెరిగిన సీట్లు.. ఎక్కువగా అవకాశాలు
రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీల సంఖ్య పెరిగింది. కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరిగాయి. 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. అందులో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిలభారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుండటం తెలిసిందే. మరోవైపు ప్రైవేట్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ సీట్లకు కూడా త్వరలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. వాటిల్లో భారీ ర్యాంకర్లకు కూడా సీట్లు వస్తాయి. జాతీయస్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి మన ప్రైవేటు కాలేజీల్లోనూ బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందంటున్నారు.
బీడీఎస్‌కు కౌన్సెలింగ్ నేటినుంచి
ప్రభుత్వ, ప్రైవేటు దంత కళాశాలల్లో కన్వినర్ కోటా బీడీఎస్ ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ నెల 24 ఉదయం 10 గంటల నుండి 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకుు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment