కన్వీనర్ కోటాలోనే 73,059 సీట్లు ఖాళీ | over 73,000 seats not fulfilled in convenor quota | Sakshi
Sakshi News home page

కన్వీనర్ కోటాలోనే 73,059 సీట్లు ఖాళీ

Published Sun, Aug 31 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

over 73,000 seats not fulfilled in convenor quota

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు మొదటి దశ కౌన్సెలింగ్ కన్వీనర్ కోటా సీట్లను శనివారం కేటాయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ కలిపి 575 కళాశాలల్లో 1,16,029 మంది విద్యార్థులకు ఎంసెట్ ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఈ సీట్లను కేటాయించింది. ఈ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 1,89,088 సీట్లు అందుబాటులో ఉండగా.. 73,059 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 57,372 సీట్లు మిగిలిపోగా, తెలంగాణలో 15,677 సీట్లు మిగిలినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే తరహాలో యాజమాన్య కోటాలో కూడా భారీగా సీట్లు మిగిలిపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంసెట్ సీట్ల కేటాయింపు వివరాలు https://eamcet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.


 ఎంసెట్ ప్రవేశాల కోసం 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహించారు. ఎంసెట్ అర్హులు మొత్తంగా 2,03,450 మంది ఉండగా.. 1,22,389 మంది మాత్రమే తనిఖీకి హాజరయ్యారు. ఇందులో 1,20,098 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను (మొత్తంగా 36 లక్షల ఆప్షన్లు) ఇచ్చుకున్నారు. వారిలో 1,16,029 మందికి సీట్లను కేటాయించగా... మిగతా వారికి ఆప్షన్లు ఇచ్చుకున్న కాలేజీల్లో సీట్లు రాలేదు. ఈ వివరాలను విద్యార్థులకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేశారు.
 
 యాజమాన్య కోటా పరిస్థితి ఏమిటి?
 
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి యాజమాన్య కోటాలో మరో 81,037 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కన్వీనర్ కోటాలోనే 73,059 సీట్లు మిగిలిపోగా... యాజమాన్య కోటాలో ఎన్ని మిగిలిపోతాయోనని యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రముఖ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లు సులువుగానే భర్తీ అయ్యే అవకాశం ఉంది. మిగతా కాలేజీల పరిస్థితి కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాజమాన్య కోటాలో తెలంగాణలో 29,364 సీట్లు ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లో 51,673 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి భర్తీకి ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ కూడా జారీ చేసి.. సెప్టెంబరు 15లోగా ఆ ప్రవేశాలను పూర్తి చేయాలని పేర్కొంది.
 
 రెండో దశ కౌన్సెలింగ్‌పై త్వరలో నిర్ణయం..
 
 ఇంజనీరింగ్, ఫార్మసీ రెండో దశ కౌన్సెలింగ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రవేశాల కమిటీ సమావేశమై ఆ తేదీలను ఖరారు చేస్తుందని వెల్లడించారు.
 
 అడ్మిషన్ విధానం ఇదీ..
 
 విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబరు, లాగిన్ ఐడీ, పుట్టినతేదీ, పాస్‌వర్డ్ ఉపయోగించి తమ సీటు కేటాయింపు ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
 ఫీజు వర్తించే విద్యార్థులు ఉంటే.. ఇండియన్ బ్యాంకు, రెండు రాష్ట్రాల్లోని ఏదేని ఆంధ్రా బ్యాంకు శాఖలో చలానా రూపంలో చెల్లించాలి.
 
 సీటు కేటాయింపు ఆర్డర్, ఫీజు చెల్లించిన చలానాలను రెండు సెట్ల కాపీలు తీసుకుని సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో రిపోర్టు చేయాలి.
 
 1వ తేదీన ఒకటో ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు వరకు.. 2వ తేదీన 50,001 నుంచి లక్ష ర్యాంకు వరకు.. 3వ తేదీన 1,00,001 నుంచి 1,50,000 ర్యాంకు వరకు.. 4వ తేదీన 1,50,001 నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత తేదీల్లో రిపోర్టు చేయని వారు 5వ తేదీన రిపోర్టు చేయవచ్చు.
 
 హెల్ప్‌లైన్ కేంద్రం వారు కౌంటర్ సైన్ చేసి అలాట్‌మెంట్ ఆర్డర్‌పై తమ స్టాంపు వేసి, విద్యార్థులకు అందజేస్తారు.
 
 విద్యార్థి సంబంధిత కాలేజీలో 6వ తేదీలోగా రిపోర్టు చేయాలి.
 విద్యార్థులు తరువాతి దశ కౌన్సెలింగ్‌లోనూ పాల్గొనవచ్చు. అయితే చివరి దశ కౌన్సెలింగ్ తరువాతే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, చలానాలను కాలేజీల్లో అందజేయాలి.
 
 చివరి దశ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకోవద్దు. ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దు.
 
 హెల్ప్‌లైన్ కేంద్రంలో కౌంటర్ సైన్ చేసిన అలాట్‌మెంట్ ఆర్డర్‌ను మాత్రమే తీసుకొని విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకోవాలి.
 
 అయితే ఒకటో తేదీన చేరిన వారికి ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభమైనట్లు పరిగణిస్తారని, 7వ తేదీ నుంచి మొదటి దశలో కాలేజీల్లో చేరిన వారందరికీ తరగతులు ప్రారంభిస్తారని ఓ అధికారి వెల్లడించారు.
 
 సీట్ల కేటాయింపు ఆర్డర్‌లో ఫీజుల వివరాలు
 
 ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు లభించిన విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన వివరాలు సదరు విద్యార్థి సీటు కేటాయింపు ఆర్డర్‌లో ఉంటాయని ఎంసెట్ ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి ర ఘునాథ్ వెల్లడించారు. ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజు ఉన్నందున... విద్యార్థికి కేటాయించిన కాలేజీకి సంబంధించిన ఫీజు వివరాలు, అర్హతలు, చెల్లింపు నిబంధనలను అందులోనే పొందుపరిచినట్లు చెప్పారు.
 
 10 వేల ర్యాంకు దాటితే రూ. 35 వేలే!
 
 ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఉన్నందున ఆయా నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించాలని రఘునాథ్ వెల్లడించారు. దాని ప్రకారం.. 10 వేల ర్యాంకులోపు విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థుల్లో 10 వేల ర్యాంకుపైన వచ్చినవారికి రూ. 35 వేల కనీస ఫీజును మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని సదరు విద్యార్థే భరించాల్సి ఉంటుంది.
 
 తెలంగాణలో ‘ఫాస్ట్’ మేరకు..
 
 ఇక తెలంగాణలో 1956 స్థానికత ప్రామాణికంగా ‘ఫాస్ట్’ పథకాన్ని అమలు చేయనున్నందున .. ఆ నిబంధనల మేరకు ఫీజుల విధానం ఉంటుంది. అయితే తెలంగాణలో ఈ మార్గదర్శకాలు జారీ అయ్యేందుకు 3 నెలలు సమయం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటి వరకు విద్యార్థులను ఫీజులు అడుగవద్దని ఫాస్ట్ మార్గదర్శకాల కమిటీ యాజమాన్యాలను కోరింది. దీనికి వారు అంగీకరించారు కూడా. ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు జారీ అయ్యాక తెలంగాణలో ఫీజుల చెల్లింపుపై తదుపరి చర్యలు ఉంటాయి.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement