బీజేపీ ఉపవాస దీక్షలో ట్విస్ట్‌ | High Tension At BJP 24 Hours Deeksha at Hyderabad Dharna Chowk - Sakshi
Sakshi News home page

బీజేపీ ఉపవాస దీక్షలో ట్విస్ట్‌.. రాత్రంత కిషన్‌రెడ్డి దీక్ష అక్కడే!

Published Wed, Sep 13 2023 7:07 PM | Last Updated on Wed, Sep 13 2023 9:20 PM

High Tension At BJP 24 Hours Deeksha at Hyderabad Dharna Chowk - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద దీక్షకు సమయం మించి పోవడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు సిద్ధం కాగా.. పార్టీ శ్రేణులు అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాయి. 

ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బుధవారం బీజేపీ చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్ష భగ్నం అయ్యింది. దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తీసుకెళ్లే క్రమంలో కిషన్‌రెడ్డి సొమ్మసిల్లిపడి పోయారు. ఆ తర్వాత ఆయన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా..  బుధవారం ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష చేపట్టింది. కిషన్‌రెడ్డి నేతృత్వంలో.. కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శలపరంపరతో సాయంత్రం దాకా గడిచింది. అయితే సాయంత్రం ఆరు దాటగానే.. దీక్షా సమయం ముగిసిందని పోలీసులు శిబిరం వద్దకు చేరుకున్నారు. ఖాళీ చేసి వెళ్లిపోవాలని బీజేపీ నేతలకు సూచించారు. 

అయితే ఇది 24 గంటల దీక్ష అని.. తెల్లవారు దాకా దీక్ష చేసి తీరతానని కిషన్‌రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు ఆయనతో చాలాసేపు సంప్రదింపులు జరిపారు. ఈలోగా దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. అక్కడున్నవాళ్లను బయటకు పంపించే యత్నం చేశారు. కిషన్‌రెడ్డి మాత్రం లిఫ్ట్‌ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 

ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయడానికి కిషన్‌రెడ్డి ఒప్పుకోలేదు. దీంతో రూల్స్‌ ప్రకారం గడువు ముగిసినా దీక్ష చేస్తు‍న్నారనే కారణంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement