సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీలో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానుంది. కౌన్సెలింగ్ వ్యవహారంపై ఏం చేయాలని ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ.. న్యాయశాఖను సంప్రదించింది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగానే యాజమాన్యాలు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రకటనలు ఇచ్చుకోవచ్చన్న నిబంధన ఉన్న కారణంగా ఇన్ని రోజులూ కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై తీర్పు రిజర్వులో ఉంది.
దీంతో కన్వీనర్ కోటా సీట్లకు కూడా నోటిఫికేషన్ వెలువడలేదు. అయితే ప్రవేశాలకు తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఇక కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వడానికే ఉన్నత విద్యాశాఖ అధికారులు మొగ్గుచూపుతున్నారు. న్యాయశాఖ కూడా ఇందుకు సమ్మతించినట్టు ఉపముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీని హైకోర్టు తీర్పు ప్రకారం జరపాలన్న షరతు విధిస్తూ కన్వీనర్ కోటా సీట్ల భర్తీని మాత్రం త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఢిల్లీలో ఉన్నందున ఆయన రాగానే ఇందుకు సంబంధించి చర్యలు చేపడతారని ఉపముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా హైకోర్టుకు నివేదించనున్నట్టు సమాచారం.
గత పరిణామాలు పునరావృతం?
గతంలో ఉన్నత విద్యామండలి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి, అందరికీ యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తులివ్వాలని, ప్రతిభావంతులనే ఎంపిక చేయాలని ఆదేశించినా యాజమాన్యాలు ఖాతరు చేయలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం హైకోర్టు తీర్పు తర్వాతే భర్తీ చేసుకోవాలంటూ షరతులు విధించినా.. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన మరుక్షణం యాజమాన్యాలు తమ కోటా సీట్లను ఇష్టారాజ్యంగా భర్తీ చేసుకునే వీలుంది. అయితే ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఇన్నిరోజులు వేచి ఉన్న ఉన్నత విద్యామండలి.. చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఒత్తిళ్లకు తలొగ్గి కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సిద్ధమవుతోంది.
ఆందోళనలతో మళ్లీ బ్రేక్!
ఉన్నత విద్యామండలి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ సిద్ధం చేసినా.. ఈనెల 12 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె ఉన్న నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడనున్నాయి. కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లోనే జరిగినప్పటికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హెల్ప్‌లైన్ సెంటర్లు అవసరం. ఉద్యోగులు సమ్మెకు దిగిన పక్షంలో హెల్ప్‌లైన్ సెంటర్లు పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు.
ఎంబీఏ, ఎంసీఏ కనిష్ట ఫీజు రూ.20 వేలు...
అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులను నోటిఫై చేసి ఇప్పటికే ప్రభుత్వానికి పంపినప్పటికీ ఇంతవరకు జీవో వెలువడలేదు. అయితే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కనిష్ట ఫీజు రూ. 20 వేలు, గరిష్ట ఫీజు రూ.70 వేలుగా రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కన్వీనర్ కోటాకు గ్రీన్‌సిగ్నల్!
Published Wed, Aug 7 2013 12:45 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement