Eamcet web counselling
-
నేటి నుంచి ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 19 నుంచి చేపట్టనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని వారు ఈ నెల 19న వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని పేర్కొన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. చివరిదశ కౌన్సెలింగ్‌లో మొత్తంగా 27,075 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అందులో ఇంజనీరింగ్‌లో 23,640 సీట్లు, బీ ఫార్మసీలో 2,964 సీట్లు, ఫార్మ్–డీలో 471 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 22న సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చుకోని వారు, ఆప్షన్లు ఇచ్చుకున్నా సీట్లు రాని వారు, సీటు వచ్చినా ఆ కాలేజీల్లో వద్దనుకునే వారు తాజాగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. కాగా, కన్వీనర్ కోటాలో 64,300 సీట్లు అందుబాటులో ఉండగా మొదటి దశలో 56,046 మందికి సీట్లు కేటాయించారు. అందులో 42,529 మంది కాలేజీల్లో చేరారు. 8,254 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇక చివరి దశ నాటికి మరో 1,869 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చివరి దశలో 23,640 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. -
ప్రశాంతంగా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
కర్నూలు (ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం సాగుతున్నా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు ఎలాంటి అంతరాయం లేదు. రాయలసీమ విశ్వ విద్యాలయంలోని ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్లో శనివారం 326 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించి వారికి స్క్రాచ్‌కార్డులు అందజేశారు. ఒకటో ర్యాంకు నుంచి లక్ష ర్యాంకు వరకు విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. సెంటర్ కోఆర్డినేటర్ సంజీవరావు పర్యవేక్షణలో ఆర్యూ ఆచార్యులు, అధ్యాపకులు ఆచార్య చక్రవర్తి, డాక్టర్ ఎన్. నరసింహులు, డాక్టర్ డి.వి.శేషయ్య, డాక్టర్ గీతానాథ్, జి.సురేంద్రబాబు, డాక్టర్ ఎం. రవిశంకర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల అధికారులు, ఉద్యోగులు జె. రవికుమార్, నాగలక్ష్మి, మహేశ్వర సింగ్, ధనుంజయ, వి. రాఘవేంద్ర, ఎ.ఎం.ప్రసాద్, అఫ్జల్ఖాన్ ధృవపత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. వీసీ కృష్ణానాయక్ కౌన్సిలింగ్‌ను పరిశీలించారు. ఆదివారం 80 వేల నుంచి 90 వేల ర్యాంకుల వారికి మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుందని కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ సంజీవరావు తెలిపారు. తాలుకా సీఐ వీవీ నాయుడు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
సర్టిఫికెట్ల తనిఖీకి పెరిగిన హాజరు
నేటి నుంచి విశాఖపట్నంలో కొత్త కేంద్రం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా నడుస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నాలుగో రోజు విద్యార్థుల హాజరు స్వల్పంగా పెరిగింది. సీమాంధ్ర జిల్లాల్లో ఉద్య మం కారణంగా 37 కేంద్రాలకుగానూ 20 కేంద్రాల్లో సర్టిఫికెట్ తనిఖీ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే 17 కేంద్రాల్లో మాత్రం ఈ ప్రక్రియ సజావుగానే సాగుతోంది. ఈ 17 కేంద్రాల్లో గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 4,791 మంది విద్యార్థులు హాజరుకాగా.. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 4,702 మంది హాజరైనట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తెలిపారు. ఎంసెట్ సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియపై గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎం. డోబ్రియాల్, సాంకేతిక విద్యా శాఖ సంయుక్త సంచాలకులు మూర్తి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం చైర్మన్ జయప్రకాశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఇప్పటివరకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కాలేదని చెప్పారు. శుక్రవారం నుంచి విశాఖలోని డాక్టర్ వి.ఎస్. కృష్ణ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభమవనుందని వెల్లడించారు. కాకినాడలో శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. -
కన్వీనర్ కోటాకు గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీలో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానుంది. కౌన్సెలింగ్ వ్యవహారంపై ఏం చేయాలని ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ.. న్యాయశాఖను సంప్రదించింది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగానే యాజమాన్యాలు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రకటనలు ఇచ్చుకోవచ్చన్న నిబంధన ఉన్న కారణంగా ఇన్ని రోజులూ కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై తీర్పు రిజర్వులో ఉంది. దీంతో కన్వీనర్ కోటా సీట్లకు కూడా నోటిఫికేషన్ వెలువడలేదు. అయితే ప్రవేశాలకు తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఇక కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వడానికే ఉన్నత విద్యాశాఖ అధికారులు మొగ్గుచూపుతున్నారు. న్యాయశాఖ కూడా ఇందుకు సమ్మతించినట్టు ఉపముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీని హైకోర్టు తీర్పు ప్రకారం జరపాలన్న షరతు విధిస్తూ కన్వీనర్ కోటా సీట్ల భర్తీని మాత్రం త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఢిల్లీలో ఉన్నందున ఆయన రాగానే ఇందుకు సంబంధించి చర్యలు చేపడతారని ఉపముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా హైకోర్టుకు నివేదించనున్నట్టు సమాచారం. గత పరిణామాలు పునరావృతం? గతంలో ఉన్నత విద్యామండలి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి, అందరికీ యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తులివ్వాలని, ప్రతిభావంతులనే ఎంపిక చేయాలని ఆదేశించినా యాజమాన్యాలు ఖాతరు చేయలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం హైకోర్టు తీర్పు తర్వాతే భర్తీ చేసుకోవాలంటూ షరతులు విధించినా.. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన మరుక్షణం యాజమాన్యాలు తమ కోటా సీట్లను ఇష్టారాజ్యంగా భర్తీ చేసుకునే వీలుంది. అయితే ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఇన్నిరోజులు వేచి ఉన్న ఉన్నత విద్యామండలి.. చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఒత్తిళ్లకు తలొగ్గి కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సిద్ధమవుతోంది. ఆందోళనలతో మళ్లీ బ్రేక్! ఉన్నత విద్యామండలి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ సిద్ధం చేసినా.. ఈనెల 12 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె ఉన్న నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడనున్నాయి. కౌన్సెలింగ్ ఆన్లైన్లోనే జరిగినప్పటికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హెల్ప్‌లైన్ సెంటర్లు అవసరం. ఉద్యోగులు సమ్మెకు దిగిన పక్షంలో హెల్ప్‌లైన్ సెంటర్లు పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. ఎంబీఏ, ఎంసీఏ కనిష్ట ఫీజు రూ.20 వేలు... అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులను నోటిఫై చేసి ఇప్పటికే ప్రభుత్వానికి పంపినప్పటికీ ఇంతవరకు జీవో వెలువడలేదు. అయితే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కనిష్ట ఫీజు రూ. 20 వేలు, గరిష్ట ఫీజు రూ.70 వేలుగా రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఏం చేయాలో చెప్పండి
ప్రభుత్వ నిర్ణయం కోరిన ఉన్నత విద్యామండలి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించడంపై నిర్ణయం కోసం ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి లేఖ రాసింది. కన్వీనర్ కోటా భర్తీ, యాజమాన్య కోటా భర్తీ అంశాలు రెండూ హైకోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. యాజమాన్య కోటా భర్తీ అంశంపై హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసిన వైనం కూడా తెలిపింది. కన్వీనర్ కోటా కోసం నోటిఫికేషన్ జారీచేస్తే యాజమాన్య కోటా భర్తీకి కూడా వెసులుబాటు కల్పించినట్లవుతుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో కన్వీనర్ కోటా భర్తీకి నోటిఫికేషన్ జారీచేసి.. యాజమాన్య కోటా భర్తీని మాత్రం హైకోర్టు తీర్పునకు లోబడి చేయాలనే ఆదేశాలను ఆ నోటిఫికేషన్లో పొందుపరచడానికి గల సాధ్యాసాధ్యాలను న్యాయశాఖ పరిశీలి స్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తక్షణం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు గల అన్ని అంశాలను పరిశీలించాలని సూచించారు.