ప్రభుత్వ నిర్ణయం కోరిన ఉన్నత విద్యామండలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించడంపై నిర్ణయం కోసం ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి లేఖ రాసింది. కన్వీనర్ కోటా భర్తీ, యాజమాన్య కోటా భర్తీ అంశాలు రెండూ హైకోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. యాజమాన్య కోటా భర్తీ అంశంపై హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసిన వైనం కూడా తెలిపింది. కన్వీనర్ కోటా కోసం నోటిఫికేషన్ జారీచేస్తే యాజమాన్య కోటా భర్తీకి కూడా వెసులుబాటు కల్పించినట్లవుతుందని తెలియజేసింది.
ఈ నేపథ్యంలో కన్వీనర్ కోటా భర్తీకి నోటిఫికేషన్ జారీచేసి.. యాజమాన్య కోటా భర్తీని మాత్రం హైకోర్టు తీర్పునకు లోబడి చేయాలనే ఆదేశాలను ఆ నోటిఫికేషన్‌లో పొందుపరచడానికి గల సాధ్యాసాధ్యాలను న్యాయశాఖ పరిశీలి స్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తక్షణం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు గల అన్ని అంశాలను పరిశీలించాలని సూచించారు.