విభజన వద్దు: సమస్త వృత్తుల చైతన్యనాదం.. పల్లెల్లోనూ పల్లవించిన నినాదం | We Won't State Bifurcation: Samaikyandhra agitations | Sakshi
Sakshi News home page

విభజన వద్దు: సమస్త వృత్తుల చైతన్యనాదం.. పల్లెల్లోనూ పల్లవించిన నినాదం

Published Tue, Aug 6 2013 3:59 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

We Won't State Bifurcation: Samaikyandhra agitations

సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోనివ్వమంటూ సీమాంధ్రలో రగిలిన ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. వరుసగా ఆరో రోజు సోమవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది.  ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వేర్పాటు నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు, రాజకీయపార్టీల నేతలు, మేధావులు, వివిధవర్గాల ప్రజలే కాదు.. సామాన్యజనం కూడా రోడ్లపైకి వస్తున్నారు. పిల్లా, పెద్దా, ముసలి, ముతక బేధం లేకుండా వ్యక్తిగతంగా కుటుంబాలు సైతం నిరసనదీక్షలకు దిగుతున్నాయి. రాష్ట్రం సమైక్యంగా లేకుంటే తమకు భవితవ్యమే లేదనే ఆందోళనతో అన్ని కులాలు, వృత్తుల వారు స్వచ్ఛందంగా ఆందోళనలు చేపడుతున్నారు.
 
 నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామీణప్రాంతాల నుంచి ఉద్యమం ఇప్పుడు మూరుమూల పల్లెలకు సైతం విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించని ఆ పార్టీ నేతల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులతీరుపై సమైక్యవాదులు, సామాన్యప్రజానీకమే కాదు స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద సమైక్యవాదులు చేపట్టిన రిలే దీక్షల శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన మంత్రి అహ్మదుల్లాకు చేదు అనుభవం ఎదురైంది.
 
 దీక్షా శిబిరం వద్దకు రావద్దని చెప్పడంతో మంత్రి, సమైక్యవాదుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ దశలో సమైక్యవాదులు మంత్రిపై దాడికి యత్నించడంతోపాటు చెప్పులు విసిరారు. దీంతో ఆయన అతికష్టంపై పోలీసు రక్షణలో దీక్షా శిబిరం వద్దకు రాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. చిరంజీవి, కావూరి, బొత్స డబ్బుకు అమ్ముడుపోయి మాకంటే హీనంగా మారారని ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో హిజ్రాలు దుమ్మెత్తిపోశారు. మంత్రి పదవి కోసం కావూరి కక్కుర్తి పడి రాష్ట్రం ముక్కలవుతున్నా చేతకానివాడిలా ఉండిపోయారని ఆయన ఇంటిని ముట్టడించిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెదబొడ్డేపల్లిలో సోమవారం ఉదయం మంత్రి బాలరాజు కాన్వాయ్‌ను ఉపాధ్యాయులు అడ్డగించి మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కోపోద్రిక్తుడైన మంత్రి  వారిపై చెయ్యెత్తి దాడి చేసేంత పని చేశారు. పరిస్థితి వేడెక్కడంతో పోలీసులు ఆయనను బతిమాలి అక్కడ నుంచి పంపించేశారు.
 
 విశాఖలో తన వాహనాన్ని అడ్డగించిన నిరసనకారులపై గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పక్కనే ఉన్న సీఐ సత్యనారాయణతో ‘నీ గన్ ఇవ్వు..ఒక్కొక్కరినీ కాల్చేస్తా’నంటూ ఆవేశంతో ఊగిపోయూరు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన మంత్రి తోట నరసింహం సరైన సమయంలో తాను రాజీనామా చేస్తానన్నారు. టీడీపీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో ఆ పార్టీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని న్యాయవాదులు అడ్డుకున్నారు. విజయనగరం పట్టణంలో చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు.
 
 అన్నిచోట్లా మున్సిపల్ ఉద్యోగుల సమ్మె
 సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ పిలుపుమేరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ అధికారులు, సిబ్బంది 72గంటల సమ్మెలో భాగంగా సోమవారం విధులను బహిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలలో  ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీలో వైద్యసేవలను నిలుపుచేసి డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. క్వారీ ఏరియాలో గుడాల ప్రసాద్ అనే  యువకుడు భార్య, ఇద్దరు పిల్లలతో పాటు 24 గంటల దీక్ష ప్రారంభించారు.
 
 ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన భారీ బహిరంగసభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హాజరై ఉద్యమానికి ఊతమిచ్చారు.  పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో రైల్ రోకో నిర్వహించారు. ప్రకాశం  జిల్లా కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్ ఆండ్ బీ ఈఈ లక్ష్మీనారాయణరెడ్డికి సన్మానం చేశారు. ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్‌లో యాచకులు నిరసన ప్రదర్శన, మానవహారం చేపట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గుంటూరు నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూయించారు.
 
 విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ నేతృత్వంలో జరిగిన  ధర్నాలో  పార్టీ  జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, సెంట్రల్ కన్వీనర్ పి. గౌతంరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనని పొలిటికల్ జేఏసీ తరపున మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. విజయనగరం శివారు ప్రాంతంలో మజ్జిపేట కాలనీ వద్ద విజయనగరం నుంచి విశాఖ వెళ్తున్న దుర్గ్ పాసింజర్ రైలును ఆందోళనకారులు అరగంటపాటు అడ్డుకున్నారు. బొబ్బిలిలో  రైల్‌రోకో నిర్వహించారు.
 
  హిందూపురం మెప్మా పీఓ విజయభాస్కర్ రాజీనామా
 అనంతపురం జిల్లా హిందూపురం మునిసిపాలిటీలో మెప్మా ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న విజయభాస్కర్ సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు అనంతపురం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, డీఆర్వో హేమసాగర్ మద్దతు తెలిపారు.  కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో గుండా రవికుమార్ అనే వికలాంగుడు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు.
 
 తెలంగాణ ఉద్యోగుల ‘సమైక్యాంధ్ర’ నినాదాలు
 చిత్తూరు జిల్లా పీలేరులో తెలంగాణ ప్రాంత అధికారులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేయడంతో వారికి స్థానిక ఉద్యోగులు సన్మానం చేశారు. ఐదురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఆయన సతీమణి లావణ్య ప్రకటించారు. చిత్తూరులోని మత్య్సశాఖ కార్యాలయంలో రెండు ప్రభుత్వ వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
 
 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో రెండున్నర గంటలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. విశాఖ జిల్లా ఏజెన్సీలో వైఎస్సార్ సీపీ సహా వర్తక, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో దుకాణాలు మూయించారు. మన్యంలోని టూరిస్టు ప్రదేశాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. మ్యూజియం, పద్మావతి గార్డెన్, బొర్రా గుహలు మూతపడ్డాయి. నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైల్‌రోకో చేశారు. కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పాల్గొన్న నిరసన కార్యక్రమంలో గోపి అనే యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
 
 విభజన వార్తలతో కలత
 ఒకరి ఆత్మహత్య, నలుగురు గుండెపోటుతో మృతి
 సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజన వార్తలను తట్టుకోలేక సోమవారం వేర్వేరు ప్రాంతాలలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు గుండెపోటుతో మరణించగా, ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన కొవ్వూరి రాంబాబు (50), కామవరపుకోట మండలం వీరంపాలెంకు చెందిన బొమ్మగంటి సత్యనారాయణ (63) విభజన వార్తలపై తీవ్ర కలత చెందారు. దీంతో వారు నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుమడాం గ్రామానికి చెందిన పొడమచ్చిలి బంగారి(51) టీవీలో విభజన వార్తలు చూస్తుండగా ఉద్వేగానికి గురై గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా.. కొద్దిసేపటికే మృతి చెందారు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనబావికి చెందిన వడ్డే కొల్లప్ప (60), అనంతపురం నగరానికి చెందిన శివశంకరరావు(42) గుండెపోటుతో మృతి చెందారు. కాగా, నిడదవోలు మండలం ఉనకరమిల్లిలో రవికుమార్ (35) మూడు రోజులుగా సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నాడు. రాష్ట్ర విభజన ఖాయమనే వార్తల నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
  ఆంజనేయులు కుటుంబానికి చెవిరెడ్డి సాయం
 సమైక్యాంధ్ర కోసం ఆత్మాహుతి చేసుకున్న చిత్తూరు జిల్లా పాకాల మండలం కూనపల్లెకు చెందిన ఆంజనేయులు(48) కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం ఆర్థిక సాయం అందజేశారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన ఆయన రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఎవరూ బలిదానాలకు పాల్పడవద్దని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement