జన నినాదమై... ఉవ్వెత్తున సమైక్య సమరం | samaikyandhra agitation raise effective in seemandhra regions | Sakshi
Sakshi News home page

జన నినాదమై... ఉవ్వెత్తున సమైక్య సమరం

Published Thu, Aug 8 2013 12:51 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

జన నినాదమై... ఉవ్వెత్తున సమైక్య సమరం - Sakshi

జన నినాదమై... ఉవ్వెత్తున సమైక్య సమరం

సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్రనే శ్వాసిస్తూ, ధ్యానిస్తూ జన నినాదమై ఉద్యమం సీమాంధ్రలో వెల్లువెత్తుతోంది. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాలు, మారుమూల పల్లెలు అన్నీ ఒక్కటై సమైక్యమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నాయి. కులాలు, మతాలు, శ్రామిక వర్గాల వారీగా ప్రజలు విభజనయత్నాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. స్వచ్ఛందంగా వివిధ రూపాల్లో ఆందోళనలను హోరెత్తిస్తున్నారు. వరుసగా ఎనిమిదో రోజైన బుధవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థల మూత కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు తోడుగా ప్రైవేటురంగంలోని ఉద్యోగులందరూ సమైక్యపోరాటంలో భాగస్వాములవుతున్నారు. మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన 72గంటల పెన్‌డౌన్ బుధవారంతో ముగిసింది. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై  ఆగ్రహజ్వాలలు కొనసాగుతున్నాయి.
 
 గోదావరి తీరాన 300కుటుంబాల నిరాహారదీక్ష
 రాజమండ్రి లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 300కుటుంబాలు నిరాహార దీక్షలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి.  కాకినాడలో జర్నలిస్టు వారణాసి సాయిపెరుమాళ్లు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అడ్డుకున్నారు.  గుంటూరులో ఏపీఎన్జీవో జేఏసీ పిలుపు మేరకు అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రదర్శన చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు గుంటూరు-విజయవాడ హైవేపై రాస్తారోకో చే శారు.
 
 నడిరోడ్డుపై ముస్లింల ప్రార్ధన
 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో వేలాదిమంది ముస్లింలు మసీదుల నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు.  సోనియా మనసు మార్చి రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాలని నడిరోడ్డుపై ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. కర్నూలులో పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో సుమారు 500మంది సభ్యులు వెంకటరమణ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై యోగాసనాలతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు.
 
 మేముసైతమంటూ అంధుల ర్యాలీ
 తిరుపతిలో అంధులు భారీ ర్యాలీ నిర్వహించారు. కపిలితీర్థం నుంచి లీలామహల్ కూడలి, మున్సిపల్ కార్పొరేషన్, నాలుగుకాళ్ల మంటపం, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా తెలుగుతల్లి విగ్రహం వరకు సుమారు 7 కిలోమీటర్ల దూరం నడిచి సమైక్యనినాదాలతో ప్రదర్శన చేపట్టారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచే షాపులను మూయించి బంద్ నిర్వహించారు. పరకాల ప్రభాకర్ బుధవారం మదనపల్లి నుంచి బస్సుయాత్రను కొనసాగించారు.
 
 సినిమా థియేటర్లమూత
 కృష్ణా జిల్లాలో ఫిలింఛాంబర్ నేతృత్వంలో ఎగ్జిబిటర్లు బుధవారం బంద్ పాటించి జిల్లా మొత్తం సినిమా థియేటర్లు మూసివేశారు. విజయవాడలో భారీ ప్రదర్శన చేపట్టారు. నాలుగురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న  కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు బుధవారం రాత్రి  గుండెనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఉయ్యూరులో రైతులు ఎడ్లబళ్లతో ప్రదర్శన చేశారు. గుడివాడలో నడిరోడ్డుపై నాట్లు వేశారు.
 
 సమ్మెకు తామూసిద్ధమన్న ఎంపీడీవోలు
 ఈ నెల 12 నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు రాష్ట్ర ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు హరిహరనాధ్ విజయవాడలో ప్రకటించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న జిల్లా న్యాయమూర్తి ఎ.రాధాకృష్ణ వాహనాన్ని అడ్డగించారు. ఒంగోలు నగరంలో పదివేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్‌ఆధ్వర్యంలో బుజబుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై చేసిన రాస్తారోకోతో రాకపోకలు స్తంభించాయి.
 
 పదివేలమంది ఉద్యోగుల భారీ ప్రదర్శన
 అనంతపురం నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా  గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు పది వేల మంది ఉద్యోగులతో ఆర్ట్స్ కళాశాల నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐదు వేల మంది మహిళలు నగరంలో ర్యాలీ నిర్వహించారు.
 
 సమైక్య ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటు
 ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ఆధ్వర్యంలో పీఆర్‌టీయూ నాయకులు శ్రీకాకుళంలో సమావేశమై సమైక్య రాష్ట్ర సాధన కోసం  సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్య ఉపాధ్యాయ జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  ఎచ్చెర్లలోని బీఆర్ అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు హౌరా-చెన్నై జాతీయ రహదారిపై హోమం నిర్వహించి, రహదారిని దిగ్బంధించడంతో సుమారు పది కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. రణస్థలం, నరసన్నపేట, టెక్కలి తదితర ప్రాంతాల్లోనూ రాస్తారోకోలునిర్వహించారు. విజయనగరంలో ఉద్యోగులు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించడడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  
 
  పేలుతున్న స్లో ‘గన్స్’
 సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యవాదులు చేస్తున్న నిరసనల్లో నినాదాలు హోరెత్తుతున్నాయి. ప్లకార్డులు, ఫ్లెక్సీలపై ఆందోళనకారులు రాసి, ప్రదర్శిస్తున్న నినాదాలు, వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ,  టీడీపీ అధినేత చంద్రబాబు,  కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలను ఎండగడ్తూ చిత్రించిన, రూపొందించిన  ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లకు జనం నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. గత వారం రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో నిరసనకారులు ప్రదర్శించిన ప్లకార్లుల్లోని నినాదాలు, వాల్‌పోస్టర్లలోని వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని....
 
 విభజనకు ముందు దర్జా... ఆ తర్వాత బికారి
  సమైక్యాంధ్రలో కుర్చీలో దర్జాగా ఉన్న కేసీఆర్.. విభజన జరిగితే బికారిగా మారతారంటూ రూపొందించిన ఫ్లైక్సీ అనంతపురం నగరంలో వెలిసింది.
 
 నాకు నచ్చని పదం రాజీనామా
  సినిమాల్లో  చిరంజీవి డైలాగులను పేరడీ చేస్తూ విజయవాడలో ప్లకార్డులు ప్రదర్శించారు. నాకు తెలుగుభాషలో నచ్చనిది ఒకే ఒక్క పదం ‘రాజీనామా’ అంటూ ఠాగూర్ సినిమాలో డైలాగ్‌ను,  నా ఇంటి ముందు ధర్నా చేయమని ముగ్గురికి చెప్పండి.. వారు ముగ్గురికి చెబుతారు.. వారు మరో ముగ్గురికి చెబుతారు.. అంటూ స్టాలిన్ సినిమాలో డైలాగ్‌ను పేర డీ చేశారు.
 
 బొత్స ఆచూకీ చెప్పండి
  ‘‘విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని వెతుక్కుంటూ వెళ్లి తప్పిపోయారు. ఆచూకీ తెలిసిన వారు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యకర్తలకు తెలియజేయాలి.’’ అంటూ విజయనగరం జిల్లా  గరివిడి పట్టణంలో వాల్‌పోస్టర్ అంటించారు.
 
 తెలుగుతల్లికి సోనియా తూట్లు
  తెలుగు తల్లిని సోనియాగాంధీ బల్లెంతో పొడుస్తుంటే కారుతున్న రక్తాన్ని గద్ద రూపంలో కేసీఆర్ తాగుతున్న చిత్రాన్ని  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రదర్శించింది.  రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటూ చిరంజీవి, బొత్స, గంటాశ్రీనివాసరావులను కోతి బొమ్మలుగా చిత్రీకరించినబ్యానర్‌ను తెలుగుశక్తి నేతలు విశాఖపట్నంలో ఊరేగించారు.
 
 కేసీఆర్ ఫామ్‌హౌస్ పాము.. చిరు చీటింగ్ జీవి... చెన్నైలో అవార్డులు
  సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ తమిళనాడు రాష్ట్రం చెన్నై మైలాపూర్‌లో తెలుగు సంఘాలు బుధవారం నిరాహారదీక్ష నిర్వహించాయి. ఈ సందర్భంగా వ్యంగ్యోక్తులతో అవార్డులను ప్రకటించారు. సోనియాకు ‘విభజన విధ్వంస స్వరూపిణి’, కేసీఆర్‌కు ‘ఫామ్ హౌస్ పాము’, చిరంజీవికి ‘చీటింగ్ జీవి’, పురంధేశ్వరికి ‘పితృ ఆత్మక్షోభకారిణి’, సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ‘సోనియా పెట్స్’, కాంగ్రెస్ అధిష్టానానికి ‘అష్టదరిద్ర స్థానం’ అవార్డులను ప్రకటించారు.
 
 తొమ్మిదిమందిని మింగిన ‘విభజన’
 ఒకరి ఆత్మహత్య.. గుండెపోటుతో 8 మంది.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం
 సాక్షి నెట్‌వర్క్:  రాష్ట్ర విభజన ప్రకటనను జీర్ణించుకోలేక బుధవారం ఒక్కరోజే  8 మంది గుండెపోటుతో మరణించగా, ఒకరు ఆత్మహత్యకు, మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరులో పెయింటర్ దిడుమర్తి రాజీవ్‌గాంధీ (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తిలి మండలం గుమ్మంపాడులో వినుకొండ వెంకటసుబ్బమ్మ (54), ఉండి గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీను (31), పెంటపాడు మండలం గ్రామానికి చెందిన మేనేటి కోటేశ్వరరావు(61), ఉంగుటూరు మండలం నారాయణపురంలో కర్రి నాగరాజు(35), అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన రంగప్ప (45), రాయదుర్గం మండలంలోని జుంజరంపల్లికి చెందిన అచ్చెల్లి మాబు(35) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు.  
 
 రాష్ట్ర విభజనపై వస్తున్న వార్తలను టీవీలో వీక్షిస్తూ కర్నూలు జిల్లా అవుకు మండల పరిధిలోని రాఘవరాజపురానికి చెందిన బూరుగుల నాగేష్  బుధవారం గుండెపోటుతో మరణించాడు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురంలో చంద్రమౌళి నాయుడు (55) సమైక్య ఉద్యమాలను టీవీలో చూస్తూ కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు రుయాకు తరలించగా చికిత్సపొం దుతూ మరణించాడు. సత్యవేడులో బాలాజీ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ  అనంతపురం జిల్లా గుత్తికి చెందిన కిషోర్ బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  
 
 సమైక్య ద్రోహులకు కుంభీపాకం శిక్ష
 విజయనగరంలో  సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో  జరిగిన ఆందోళనలో  సోనియా, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను మరుగుతున్న నూనెలో దించి కుంభీపాకం శిక్ష విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement