సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమంలో కలిసిరావాలని, విభజనను అడ్డుకోవడానికి మద్దతు ఇవ్వమని తాము చేసిన విజ్ఞప్తికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందించలేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. అశోక్‌బాబు నేతృత్వంలోని ఉద్యోగుల ప్రతినిధి బృందం సోమవారం చంద్రబాబు, బొత్సలతో వేర్వేరుగా భేటీ అయింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీమాంధ్ర ప్రజల ఆందోళనల నేపథ్యంలో విభజనపై టీడీపీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోమని, సమైక్య ఉద్యమానికి అండగా నిలబడమని చంద్రబాబును కోరామని, ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేదని చెప్పారు. సమైక్య ఉద్యమానికి ప్రతికూల వైఖరి తీసుకోవడం వల్ల సీమాంధ్ర ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత ఏర్పడుతోందని, చంద్రబాబును ప్రజలు దోషిగా చూస్తున్నారని చెప్పినప్పు డు.. ‘అదంతా పొలిటికల్ గేమ్. తప్పదు. భరించా లి’ అని బాబు స్పందించారని వెల్లడించారు. పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి అంత సులభంగా నిర్ణయం తీసుకోలేనన్నారని అశోక్‌బాబు చెప్పారు.
అయితే ఇరు ప్రాంతాలకూ న్యాయం జరిగే విధంగా సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటానని బాబు చెప్పారని వివరించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఇదే తీరు గా స్పందించారని చెప్పారు. అన్ని పార్టీల నాయకులను కలుస్తామని, విభజనను ఆపడానికి ఆఖరు వరకు తమ శక్తి మేరకు ప్రయత్నిస్తామన్నారు. ‘సమైక్యానికి కలిసొచ్చే పార్టీలతో నడుస్తాం. అన్ని రాజకీయ పార్టీలు కలిసిరాకపోతే.. ఏ పార్టీతో కలిసి వెళ్లాలనే విషయంలో మేం కూడా రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి రాజకీయ శూన్యత సృష్టిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. సమైక్య ఉద్యమం వల్ల ప్రజలు, ఉద్యోగులకు కష్టాలు, నష్టాలు ఉంటాయని, విభజన వల్ల జరిగే నష్టం కంటే అవేమీ ఎక్కువ కాదన్నారు. 12న అర్ధరాత్రి నుంచి సమ్మె ఉంటుందన్నారు. అనంతరం ఢిల్లీ వెళ్లి వివిధ పార్టీల నాయకులు, ప్రభుత్వ పెద్దలను కలుస్తామన్నారు.
ఇరు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలి..
ఇరు ప్రాంతాల్లో పార్టీ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, సమైక్యవాదానికి అనుకూలంగా ప్రస్తుతం నిర్ణయం తీసుకొనే పరిస్థితుల్లో లేనని చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు విభజన బాధ కలిగించిందంటూనే.. ఇరు ప్రాంతా ల్లో పార్టీని బతికించుకోవాల్సిన బాధ్యతను మర్చిపోకూడదని, తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేనని పేర్కొన్నారు.
యూటీఎఫ్ ఆందోళనలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న నిర్వహించ తలపెట్టిన ఆందోళనలను వాయిదా వేసినట్లు యూటీఎఫ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు నిర్వహించాల్సిన ర్యాలీలు, ధర్నాలను వాయిదా వేసినట్లు పేర్కొంది. కాగా, రాష్ట్ర విభజన అనివార్యంగా మారిన పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.నర్సిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఐ.వెంకటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు.
‘సమైక్య’ సమ్మెలో ఎన్‌ఎంయూ
సాక్షి, హైదరాబాద్: విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఈనెల 12 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) నిర్ణయించింది. సీమాం ధ్రలోని 13 జిల్లాల్లోని 123 డిపోల్లో దాదాపు 75 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. డిపోలు, రీజియన్ల వారీగా స్థానికంగా సమ్మె నోటీసు జారీ చేయాలని ఎన్‌ఎంయూ నిర్ణయించినట్లు సమాచారం. ఆందోళనల వల్ల ఇప్పటికే దాదాపు 60 డిపోల్లో బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. కార్మికులు సమ్మెకు దిగితే.. పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది.
‘సమైక్యం’పై బాబు, బొత్స హామీ ఇవ్వలేదు
Published Tue, Aug 6 2013 4:39 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM
Advertisement
Advertisement