అదంతా దుష్ర్పచారం : కోదండరాం
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నుంచి సీమాంధ్రులను వెళ్లగొడతారని దుష్ర్పచారం జరుగుతోందని, అది నిజం కాదని, ఈ ప్రాంతంలో వారు స్వేచ్ఛగా జీవించవచ్చునని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం ఖైరతాబాద్ విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్‌సౌధలో తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల జేఏసీ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్రలు చేస్తున్నారంటూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు కోదండరాంతో పాటు ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, హరీష్‌రావు, ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందని, ఈ సమయంలో హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత పేరుతో వచ్చిన రాష్ట్రాన్ని అడ్డుకోవద్దని కోరారు.
విభజన కోసం ఓ ప్రత్యేక కమిటీ వేస్తారని, అందులోనే ఉద్యోగాల పంపిణీ, నీటి కేటాయింపులు రాజ్యాంగబద్ధంగా జరుగుతాయని వారు తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఎంతో ఉధృతంగా సాగిన సమయంలో కూడా హైదరాబాద్‌లో సీమాంధ్రులపై దాడులు జర గలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తమ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదని, హక్కుల రక్షణ కోసం మాత్రమేనని వారు తెలిపారు. కేవలం కొన్ని రాజకీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకే సమైక్యవాదమంటూ అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. కలిసి ఉంటామని చెప్పడం ఒక భావన అని, అందుకు అవతలి వారు అంగీకరించనప్పుడు కూడా బలవంతంగా కలిసే ఉంటామనడం అనైతిక చర్య అవుతుందని కోదండరాం అన్నారు. తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నేడు పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర అంటూ ప్లకార్డులు పట్టుకోవడం హేయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అద్దంకి దయాకర్, రఘు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.