టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్
కొల్లాపూర్, న్యూస్‌లైన్: సీమాంధ్ర తరహా తెలంగాణకూ పన్నుల మినహాయింపుతో పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రా ప్రాంతం నష్టపోయిందని ప్రచారం జరుగుతోందని, వాస్తవానికి నష్టపోయింది తెలంగాణ ప్రాంతమేనని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామ కాలు, వనరుల్లో తమ వాటా దక్కాల్సిందేనని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధి ఎలా జరుగుతుందని, కొందరు అనవసరంగా భయపడుతున్నారని, దీనిపై ఎవరికీ ఎలాంటి బెంగ అక్కర్లేదన్నారు. తెలంగాణ ప్రజలు ధైర్యంగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉద్యమ నాయకత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోదండరాం కోరారు. తెలంగాణను అభివృద్ధి చేసుకునే సత్తా ఇక్కడి ప్రజలకు ఉందన్నారు. ఎంపీ మంద జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సభలో ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకూ ప్రత్యేక ప్రతిపత్తి
Published Sat, Mar 1 2014 1:09 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement