భద్రాచలం, న్యూస్‌లైన్: ముంపు మండలాలను సీమాంధ్రకు బదలాయించి ఆదివాసీల హక్కులపై దాడి చేస్తారా అని టీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్షను శనివారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుప్పెడు మంది కార్పొరేట్ శక్తుల కోసం లక్షలాది మంది అమాయక ఆదివాసీ ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరి నీటిని వినియోగించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ.. వనరులను దోపిడీ చేయాలనే లక్ష్యంతోనే పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. పెట్టుబడిదారుల ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని విమర్శించారు. తాము తెలంగాణలోనే ఉంటామని ముంపు ప్రాంత ఆదివాసీలంతా పట్టుబడుతున్నా.. ఎవరినీ సంప్రదించకుండా ఆర్డినెన్స్ తీసుకురావటం అన్యాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రతోనే ఈ ఆర్డినెన్స్ వచ్చిందని ఆరోపించారు. రాజ్యాంగంపై ఆయనకు గౌరవం ఉంటే గిరిజనులకు అన్యా యం చేసే పోలవరం ప్రాజెక్టును ఆపాలని కోరారు. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు టీజేఏసీ పక్షాన అన్ని రకాలుగా ఉద్యమిస్తామని ప్రకటించారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజ య్య ఒక సత్కార్యం కోసం చేస్తున్న దీక్షలు అభినందనీయమన్నారు. ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
గవర్నర్ జోక్యం చేసుకోవాలి...
రాజ్యాంగ విరుద్ధంగా, గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న బదలాయింపును అడ్డుకునేందుకు రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోదండరామ్ కోరారు. ఆర్డినెన్స్ వచ్చినందున ఈ దశలో ఏమీ చేయలేమని చెప్పటం సరికాదన్నారు. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన చట్టాలు గిరిజనులకు రక్షణ కవచాల వంటివని, వీటిని పరిరక్షించాల్సింది రాష్ట్ర గవర్నరేనని అన్నారు.
ఉద్యమాన్ని ఉధృతం చేయాలి...
ముంపు మండలాల్లోని గిరిజనులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాలకు కొంతమంది దూరంగా ఉంటున్నట్లుగా తాము గుర్తించామని, వారి వైఖరి సరైంది కాదని అన్నారు. ఆదివాసీలకు అండగా నిలువాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కేంద్రం కళ్లు తెరిపించేలా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమించడంలో భద్రాచలం టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, తెలంగాణ పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు నడింపల్లి వెంకటపతిరాజు, టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఎస్‌కే గౌసుద్ధీన్, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, పూసం రవికుమారి తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీల హక్కులపై దాడి చేస్తారా..?
Published Mon, Jun 2 2014 3:40 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement