ప్రజల సెంటిమెంట్తో ఆడుకోవద్దు: శ్రీకాంత్రెడ్డి
రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలుగు ప్రజల మనోభావాలను వీరు పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కిరణ్ అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబు మౌనంగా ఉన్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జనం సెంటిమెంట్తో ఆడుకోవద్దని హెచ్చరించారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు విభజనపై నోరెత్తకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించులా వ్యవహరిస్తోందని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 33 ఎంపీ స్థానాలు బహుమతిగా ఇచ్చిన రాష్ట్రాన్ని ప్రాంతాలవారీగా విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు. ఎక్కడా బలమైన నాయకుడు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. చరిత్ర గత ప్రాంతాన్ని చీల్చితే చరిత్రహీనులుగా మిగిలిపోతారని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.