కాంగ్రెస్ నేతల డ్రామా: వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యేలు
రాష్ట్ర విభజనపై స్వార్ధం కోసమే కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, గొల్ల బాబూరావు విమర్శించారు. పదవులు కాపాడుకోవడానికి సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారని వారు ఆరోపించారు.
సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ సంతకాలు పెట్టామని డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. చిరంజీవి తన ఆస్తులు, పదవుల కోసమే ఉమ్మడి రాజధానిపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన అంగీకరించేది లేదన్న కావూరి సాంబశివరావు.. కేంద్రమంత్రి కాగానే నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు.
కేసీఆర్ అప్పుడే సీఎం అయినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అప్పులు, ఉద్యోగుల సమస్యలపై చర్చించకుండా విభజన ఎలా చేస్తారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆగిపోయి యువత అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చేందుకు, ముందస్తు ఎన్నికల కోసమే విభజన చిచ్చు పెట్టారని ఆరోపించారు.
ప్రజల డిమాండ్ మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందాకే విభజన గురించి మాట్లాడాలన్నారు. రాష్ట్రం అట్టుడికి పోతుంటే చంద్రబాబు ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు.