హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆ పార్టీనేత బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రాష్ట్రానికి సమన్వాయం చేయలేనప్పుడు, రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని మాత్రమే వైఎస్సార్ సీపీ కోరుతుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ ఉనికి కోల్పోతుందన్న టీఆర్ఎస్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీకి బలం ఉందో లేదో టీఆర్ఎస్ నేతలు నిర్ణయించనక్కర్లేదన్నారు. వైఎస్సార్ సీపీ హవాను తగ్గించాలనే టీఆర్ఎస్ విమర్శలకు దిగుతుందన్నారు. తెలంగాణాలో వైఎస్సార్ విగ్రహాలను కూల్చాలని టీఆర్ఎస్ నేత హరీష్ రావు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసి టీఆర్ఎస్ నేతలు రాక్షాసనందం పొందుతున్నారని బాజిరెడ్డి విమర్శించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ది చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ సహకారంతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్న విషయాన్ని హరీష్ రావు మరచిపోయినట్లున్నారని బాజిరెడ్డి నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ వాదంతో పుట్టిన పార్టీ అని, మిగతా పార్టీలు ఏవీ కూడా అలా ఏర్పడలేదన్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యల్లో వైఎస్సార్ సీపీ ఎప్పుడూ భాగస్వామిగా ఉంటుందన్నారు. వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీల్లా డ్రామాలు ఆడటం లేదని, వైఎస్సార్ విగ్రహాల జోలికి వస్తే ఊరుకునేది లేదని బాజిరెడ్డి హెచ్చరించారు.