baji reddy govardhan
-
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో ఇక స్నాక్ బాక్స్.. స్పెషల్ ఏంటంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్‌తో పాటే ‘స్నాక్ బాక్స్’ను ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల్లో స్నాక్ బాక్స్ విధానాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తోంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది. ఈ స్నాక్ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్ ప్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్ బాక్స్ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ‘ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో టీఎస్ఆర్టీసీ ముందుకు వెళుతోంది. అందులో భాగంగా స్నాక్ బాక్స్ ప్రయాణికులకు ఇవ్వాలని నిర్ణయించింది. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని బలపరిచే చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు ప్రయాణంలో ఉపయోగపడే మౌత్ ప్రెషనర్, టిష్యూ పేపర్‌తో కూడిన స్నాక్ బాక్స్‌ను ప్రయాణికులకు సంస్థ అందించనుంది. టీఎస్ఆర్టీసీ ఏ కార్యక్రమం తీసుకువచ్చినా ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారు. సంస్థను ప్రోత్సహిస్తున్నారు. ఈ స్నాక్ బాక్స్ విధానాన్ని అలాగే అదరించాలి’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. ప్రతీ స్నాక్ బాక్స్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని ఫోన్లలో స్కాన్ చేసి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫీడ్ బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని స్నాక్ బాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్‌ను బట్టే మిగతా సర్వీసులకు స్నాక్ బాక్స్ విధానాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రేపు సీఎం కేసీఆర్‌తో కేజ్రీవాల్ భేటీ.. -
సిగ్గు ఉంటే రాజీనామా చెయ్ : బాజిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సిగ్గు, లజ్జ ఉంటే ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) టీఆర్ఎస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ సవాల్ విసిరారు. మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ.. డీఎస్ వల్ల టీఆర్ఎస్కి ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. డీఎస్‌కు రాజ్యసభ సీటు కోసం ఆరాటం తప్ప మరొకటి లేదని విమర్శించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రాజ్యసభ సభ్యుడిగా పదవిని అనుభవించవచ్చని డీఎస్ ఆరాటపడుతున్నారన్నారు. -
టీఆర్ఎస్లో ‘కొత్త’ కష్టాలు
ఉద్యమేతరులు, వలస నేతలపై పార్టీ శ్రేణుల వ్యతిరేకత కార్యకర్తలు, ద్వితీయ స్థాయి నాయకుల సహకారం కోసం కొత్త నేతల పాట్లు అసలు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరో తెలియని పరిస్థితి ప్రత్యర్థులు దూసుకెళుతుండడంతో ఆందోళన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ వేడి చల్లారకముందే సార్వత్రిక ఎన్నికలు రావడంతో.. ఇదే అదనుగా కారెక్కిన కొత్తముఖాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ టికెట్‌తో గెలవడం నల్లేరుపై నడకే అనుకున్న వారి ఆశలు ఆవిరవుతున్నాయి. తమతో పాటు వచ్చి చేరినవారు మినహా టీఆర్ఎస్ పాత శ్రేణుల నుంచి సహకారం లేకపోవడంతో.. వారు ఆందోళన చెందుతున్నారు. పార్టీ శ్రేణులతో సమన్వయం, సహకారం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎంపీలుగా పోటీచేస్తున్న పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు మరో చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎవరు పార్టీ నాయకులో, ఎవరు కాదో తెలియక తికమకపడుతున్నారు. చేతి నుంచి చమురు వదులుతున్నా అందుకు తగ్గ ఫలితం కనిపించక లబోదిబోమంటున్నారు. రాత్రికి రాత్రే వచ్చి చేరినవారిపై టీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్యమం జరిగినన్నాళ్లు ఎవరినైతే తీవ్రంగా వ్యతిరేకించారో వారికే జై కొట్టడానికి కింది స్థాయి కేడర్ విముఖత చూపుతోంది. వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగినవారిలో ఇతర పార్టీలకు చెందిన అగ్రనాయకులు, వివిధ రంగాలకు చెందిన రాజకీయేతరులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే రత్నం, మాజీమంత్రి కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్దన్ వంటివారికి కేడర్ నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. 40 మంది దాకా ఉద్యమేతరులే: ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ కేసీఆర్ మాత్రం 40మంది కొత్త ముఖాలను టీఆర్ఎస్ తరఫున లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల బరిలోకి దించారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చి రాత్రికి రాత్రే టీఆర్ఎస్ అభ్యర్థులుగా అవకాశం పొందినవారు కొందరైతే.. మరికొందరు వ్యాపార, పారిశ్రామికవేత్తలకు బీఫారాలు ఇచ్చారు. పార్టీ నిర్మాణం బలహీనంగా ఉన్న స్థానాల్లో.. ఏ పార్టీవారైనా సరే బలమైన నేతలు చేరితే గెలుపు సాధ్యమనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా చేరిన దాదాపు 40 మంది అభ్యర్థులపై టీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఉద్యమ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్తముఖాలుఎక్కడెక్కడ?:మాజీమంత్రి కొండా సురేఖకు వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో.. మాజీమంత్రి సారయ్యతో పోటీపడుతున్నారు. తెలంగాణ వ్యతిరేకిగా మొన్నటిదాకా పనిచేసిన సురేఖకు టీఆర్ఎస్ శ్రేణులు సహకరించడం లేదు. సురేఖకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు, అనుచరులతో పాటు పాత శ్రేణులను బతిమాలుకోవడానికే పరిమితమవుతుండగా.. సారయ్య మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి పి.బాబూమోహన్‌కు మెదక్ జిల్లా ఆందోల్ నుంచి చివరి క్షణంలో టికెట్ ఇవ్వగా... మాజీ ఉపముఖ్యమంత్రి దామోదరతో తలపడుతున్నారు. రెండుసార్లు ఇదే నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన బాబూమోహన్‌కు కేవలం పాత టీడీపీ నాయకులే టీఆర్ఎస్లో చేరి మద్దతు ఇస్తుండగా టీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు టీడీపీ, టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలను తనకు అనుకూలంగా మలుచుకుని దామోదర విశ్వాసంతో ఉన్నారు. మాజీ మంత్రి కె.జానారెడ్డిపై నాగార్జునసాగర్‌లో సీపీఎం శాసనసభాపక్ష మాజీ నేత నోముల నర్సింహయ్యకు రాత్రికి రాత్రే టీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. నియోజకవర్గానికి, టీఆర్ఎస్కు కొత్త అయిన నోములకు టీఆర్ఎస్ నేతలెవరో? ఎవరితో పనిచేయించుకోవాలో అర్థం కాని అయోమయ స్థితి ఉంది. జానారెడ్డి మాత్రం చాప కింద నీరులా అన్ని పార్టీల నేతలను పిలిపించుకుని నియోజకవర్గాన్ని ఇప్పటికే చుట్టేశారు. ఇక నిజామాబాద్ రూరల్ స్థానంలో పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌పై బాజిరెడ్డి గోవర్దన్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఇక్కడ పోటీ చేయడానికి ముందే ప్రణాళిక వేసుకున్న డీఎస్.. అన్ని వర్గాలతో సమావేశమై, ఇతర పార్టీల నాయకులను అనుకూలంగా మార్చుకున్నారు. బాజిరెడ్డి గోవర్దన్ మాత్రం ఇంకా పార్టీ శ్రేణులను సమన్వయ పరుచుకోవడంలోనే తలమునకలయ్యారు. టీడీపీ నేతగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు ఒకరోజు ముందు కాంగ్రెస్‌లో చేరి టికెట్‌కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత టీఆర్ఎస్లో చేరి మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా ఆఖరు నిమిషంలో బరిలోకి వచ్చారు. ఇక్కడితో పాటు కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ తదితర అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులు పార్టీ శ్రేణుల మద్దతుకోసమే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొన్ని నియోజకవర్గాల్లోనూ నెలకొంది. -
'ఓటర్ల నమోదు ప్రక్రియలో విస్తృతంగా పాల్గొనాలి'
హైదరాబాద్:ఓటర్లు నమోదు ప్రక్రియలో పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొనాలని వైఎస్సార్ సీపీ నేతలు కొణతల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ లు విజ్ఞప్తి చేశారు. గడగడపకూ పార్టీని తీసుకువెళ్లి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. ఓటర్లు నమోదు ప్రక్రియ, సమైక్య అంశాలపై సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓటర్లు నమోదు ప్రక్రియలో పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కింది స్థాయి నుంచి అన్ని కమీటీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్క నేత ప్రజలకు అందుబాటులో ఉంటూ సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని వారు సూచించారు. -
'తెలంగాణకు వ్యతిరేకమని వైఎస్సార్ సీపీ చెప్పలేదు'
-
'తెలంగాణకు వ్యతిరేకమని వైఎస్సార్ సీపీ చెప్పలేదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆ పార్టీనేత బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రాష్ట్రానికి సమన్వాయం చేయలేనప్పుడు, రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని మాత్రమే వైఎస్సార్ సీపీ కోరుతుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ ఉనికి కోల్పోతుందన్న టీఆర్ఎస్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీకి బలం ఉందో లేదో టీఆర్ఎస్ నేతలు నిర్ణయించనక్కర్లేదన్నారు. వైఎస్సార్ సీపీ హవాను తగ్గించాలనే టీఆర్ఎస్ విమర్శలకు దిగుతుందన్నారు. తెలంగాణాలో వైఎస్సార్ విగ్రహాలను కూల్చాలని టీఆర్ఎస్ నేత హరీష్ రావు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసి టీఆర్ఎస్ నేతలు రాక్షాసనందం పొందుతున్నారని బాజిరెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ది చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ సహకారంతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్న విషయాన్ని హరీష్ రావు మరచిపోయినట్లున్నారని బాజిరెడ్డి నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ వాదంతో పుట్టిన పార్టీ అని, మిగతా పార్టీలు ఏవీ కూడా అలా ఏర్పడలేదన్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యల్లో వైఎస్సార్ సీపీ ఎప్పుడూ భాగస్వామిగా ఉంటుందన్నారు. వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీల్లా డ్రామాలు ఆడటం లేదని, వైఎస్సార్ విగ్రహాల జోలికి వస్తే ఊరుకునేది లేదని బాజిరెడ్డి హెచ్చరించారు. -
‘తెలంగాణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు’
మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ నేత బాజిరెడి గోవర్ధన్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్సార్సీపీ అభిమానులే పార్టీని నడిపిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేత షర్మిల ఇచ్ఛాపురం పాదయాత్ర ముగింపు సభలో చేసిన వ్యాఖ్యలను కొన్ని ఛానెల్స్ వక్రీకరించాయన్నారు. జిల్లాలోని గద్వాలలో సర్పంచ్‌లుగా ఎన్నికైన వైఎస్సార్సీపీ మద్దతుదారులను బాజిరెడ్డి, ఎడ్మి కృష్ణారెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలు సన్మానించారు. సన్మాన సభలో వారు ప్రత్యేక తెలంగాణ అంశంకు సంబంధించి మాట్లాడారు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని తెలిపారు.