ఉద్యమేతరులు, వలస నేతలపై పార్టీ శ్రేణుల వ్యతిరేకత
- కార్యకర్తలు, ద్వితీయ స్థాయి నాయకుల సహకారం కోసం కొత్త నేతల పాట్లు
- అసలు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరో తెలియని పరిస్థితి
- ప్రత్యర్థులు దూసుకెళుతుండడంతో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ వేడి చల్లారకముందే సార్వత్రిక ఎన్నికలు రావడంతో.. ఇదే అదనుగా కారెక్కిన కొత్తముఖాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ టికెట్‌తో గెలవడం నల్లేరుపై నడకే అనుకున్న వారి ఆశలు ఆవిరవుతున్నాయి. తమతో పాటు వచ్చి చేరినవారు మినహా టీఆర్‌ఎస్ పాత శ్రేణుల నుంచి సహకారం లేకపోవడంతో.. వారు ఆందోళన చెందుతున్నారు. పార్టీ శ్రేణులతో సమన్వయం, సహకారం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎంపీలుగా పోటీచేస్తున్న పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు మరో చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎవరు పార్టీ నాయకులో, ఎవరు కాదో తెలియక తికమకపడుతున్నారు. చేతి నుంచి చమురు వదులుతున్నా అందుకు తగ్గ ఫలితం కనిపించక లబోదిబోమంటున్నారు.
రాత్రికి రాత్రే వచ్చి చేరినవారిపై టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్యమం జరిగినన్నాళ్లు ఎవరినైతే తీవ్రంగా వ్యతిరేకించారో వారికే జై కొట్టడానికి కింది స్థాయి కేడర్ విముఖత చూపుతోంది. వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగినవారిలో ఇతర పార్టీలకు చెందిన అగ్రనాయకులు, వివిధ రంగాలకు చెందిన రాజకీయేతరులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే రత్నం, మాజీమంత్రి కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్దన్ వంటివారికి కేడర్ నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.
40 మంది దాకా ఉద్యమేతరులే: ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ కేసీఆర్ మాత్రం 40మంది కొత్త ముఖాలను టీఆర్‌ఎస్ తరఫున లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల బరిలోకి దించారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చి రాత్రికి రాత్రే టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా అవకాశం పొందినవారు కొందరైతే.. మరికొందరు వ్యాపార, పారిశ్రామికవేత్తలకు బీఫారాలు ఇచ్చారు. పార్టీ నిర్మాణం బలహీనంగా ఉన్న స్థానాల్లో.. ఏ పార్టీవారైనా సరే బలమైన నేతలు చేరితే గెలుపు సాధ్యమనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా చేరిన దాదాపు 40 మంది అభ్యర్థులపై టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు ఉద్యమ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కొత్తముఖాలుఎక్కడెక్కడ?:మాజీమంత్రి కొండా సురేఖకు వరంగల్ తూర్పు నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడంతో.. మాజీమంత్రి సారయ్యతో పోటీపడుతున్నారు. తెలంగాణ వ్యతిరేకిగా మొన్నటిదాకా పనిచేసిన సురేఖకు టీఆర్‌ఎస్ శ్రేణులు సహకరించడం లేదు. సురేఖకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు, అనుచరులతో పాటు పాత శ్రేణులను బతిమాలుకోవడానికే పరిమితమవుతుండగా.. సారయ్య మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి పి.బాబూమోహన్‌కు మెదక్ జిల్లా ఆందోల్ నుంచి చివరి క్షణంలో టికెట్ ఇవ్వగా... మాజీ ఉపముఖ్యమంత్రి దామోదరతో తలపడుతున్నారు. రెండుసార్లు ఇదే నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన బాబూమోహన్‌కు కేవలం పాత టీడీపీ నాయకులే టీఆర్‌ఎస్‌లో చేరి మద్దతు ఇస్తుండగా టీఆర్‌ఎస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు టీడీపీ, టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలను తనకు అనుకూలంగా మలుచుకుని దామోదర విశ్వాసంతో ఉన్నారు. మాజీ మంత్రి కె.జానారెడ్డిపై నాగార్జునసాగర్‌లో సీపీఎం శాసనసభాపక్ష మాజీ నేత నోముల నర్సింహయ్యకు రాత్రికి రాత్రే టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చారు. నియోజకవర్గానికి, టీఆర్‌ఎస్‌కు కొత్త అయిన నోములకు టీఆర్‌ఎస్ నేతలెవరో? ఎవరితో పనిచేయించుకోవాలో అర్థం కాని అయోమయ స్థితి ఉంది. జానారెడ్డి మాత్రం చాప కింద నీరులా అన్ని పార్టీల నేతలను పిలిపించుకుని నియోజకవర్గాన్ని ఇప్పటికే చుట్టేశారు. ఇక నిజామాబాద్ రూరల్ స్థానంలో పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌పై బాజిరెడ్డి గోవర్దన్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించారు.
ఇక్కడ పోటీ చేయడానికి ముందే ప్రణాళిక వేసుకున్న డీఎస్.. అన్ని వర్గాలతో సమావేశమై, ఇతర పార్టీల నాయకులను అనుకూలంగా మార్చుకున్నారు. బాజిరెడ్డి గోవర్దన్ మాత్రం ఇంకా పార్టీ శ్రేణులను సమన్వయ పరుచుకోవడంలోనే తలమునకలయ్యారు. టీడీపీ నేతగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు ఒకరోజు ముందు కాంగ్రెస్‌లో చేరి టికెట్‌కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా ఆఖరు నిమిషంలో బరిలోకి వచ్చారు. ఇక్కడితో పాటు కుత్బుల్లాపూర్, ఎల్‌బీనగర్ తదితర అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులు పార్టీ శ్రేణుల మద్దతుకోసమే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొన్ని నియోజకవర్గాల్లోనూ నెలకొంది.