మండలిలోకాంగ్రెస్ పక్ష నేతగా డీఎస్
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ధర్మపురి శ్రీనివాస్ ప్రస్థానం శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత గా ఎన్నికైన ధర్మపురి శ్రీనివాస్ పార్టీలో కీలక నేతగా పేరుపొందారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. డీఎస్ 1989 లో నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తిరిగి ఇదే నియోజకవర్గం నుంచి 1999, 2004లలో వరుసగా విజయాలు సాధించారు. 2009లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చవి చూశారు. 2010లో యెండల తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లోనూ డీఎస్ ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంనుంచి పోటీ చేసినా గెలుపొందలేకపోయారు.
డి శ్రీనివాస్.. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గాల్లో గ్రామీణాభివృద్ధిశాఖ, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. 1999లో పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడిగా ఉన్నారు. 2004, 2009లలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సభ్యుడుగా వ్యవహరించారు. మూడేళ్లుగా శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.
షబ్బీర్ అలీ రాజకీయ నేపథ్యం
కాంగ్రెస్ పార్టీ శాసనమండలి పక్ష ఉప నేతగా నియమితులైన షబ్బీర్ అలీకి సైతం సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా 1989లో తొలిసారిగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేసి గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 1994, 1999 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004 లో గెలిచిన ఆయనకు వైఎస్ మంత్రివర్గంలో చోటు లభించింది. కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు.
2009 సాధారణ ఎన్నికల్లో కామారెడ్డినుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2010లో ఎల్లారెడ్డి నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమే ఎదురయ్యింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించలేకపోయారు. ఆయన 2013లో ఎమ్మెల్సీ అయ్యారు. ఈ పదవిలో ఇంకా ఐదేళ్లు కొనసాగనున్నారు.
షబ్బీర్ అలీ పార్టీలోనూ కీలక పదవులు నిర్వర్తించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, డీసీసీ అధ్యక్షునిగా, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యునిగా, పీసీసీ ప్రచార కమిటీ కోకన్వీనర్‌గా పనిచేశారు.
జిల్లా కాంగ్రెస్ నేతల్లో హర్షం
డీఎస్, షబ్బీర్‌లకు పార్టీ శాసనమండలి పదవులు లభించడంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ శాసన మండలి విపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలుసుకున్న పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట టపాకాయలు కాల్చారు. అనంతరం ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ప్రగతినగర్‌లోని డీఎస్ ఇంటి వద్ద కూడా టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచారు. ఈ సంబురాలలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, టీపీసీసీ సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, యువజన కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు బంటురాము, నాయకుడు బగ్గలి అజయ్, ఆర్‌ఎంవై అధ్యక్షుడు ధాత్రిక రమేశ్ తదితరులు పాల్గొన్నారు.