కేసీఆర్‌తోనే తెలంగాణ: కొండా సురేఖ
ధన్యవాద తీర్మానంపై చర్చ
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతోనే తెలంగాణ వచ్చిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. అవమానాలకు గురిచేసినా కేసీఆర్ భరించారని, వాటికి కుంగిపోయి వెనక్కి తగ్గితే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. అంబేద్కర్ లాగే ఆయన పట్టుదలతో ఉద ్యమాన్ని నడిపించారని కితాబిచ్చారు. అసెంబ్లీలో గురువారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని మరో సభ్యుడు సోమారపు సత్యనారాయణ బలపరిచారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడారు. విద్యార్థుల బలిదానాలు, ఉద్యోగుల పోరాటాలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోశాయన్నారు. ఏ అంసెబ్లీలో తెలంగాణ అనే పదాన్ని మాట్లాడనీయలేదో, తెలంగాణకు నిధులు ఇవ్వమని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారో అదే అసెంబ్లీలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని నడుపుకోవడం గర్వకారణమని చెప్పారు. రిటైర్ అయిన ఆంధ్రా ఉద్యోగులకు అక్కడే పెన్షన్లు తీసుకునేలా, ఎంత కష్టమైనా రైతులకు ఎనిమిది గంటల విద్యుత్తు సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ వలసవాదుల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అన్యాయానికి గురైందని, రాష్ట్ర ఏర్పాటుతో మళ్లీ ఆశలు చిగురించాయని వివరించారు.
ఆత్మహత్యల బాటలో రైతులు : డీకే
తెలంగాణ రాష్ట్ర సంబురాల్లో మనముంటే.. రైతులు ఆత్మహత్యల బాటలో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యానించారు. రైతు రుణాల మాఫీపై స్పష్టత లేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చింతించాల్సిన అంశమని పేర్కొన్నారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేసే అంశం ఎక్కడా గవర్నర్ ప్రసంగంలో లేదని ఎత్తిచూపారు. దీనిపై హరీష్‌రావు కల్పించుకుని కేసులు నమోదు చేసిన మీరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హామీలను నెరవేర్చాలి: ఎర్రబెల్లి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రుణాల మాఫీ విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఖరీఫ్‌కు రుణాలను తీసుకోవాల్సి ఉన్నందున ప్రభుత్వం త్వరగా విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతచారి తల్లికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని ఇవ్వాలని కోరారు. మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ..అమరవీరుల కుటుంబాలపై టీడీపీకి ప్రేమ ఉంటే శంకరమ్మపై పోటీని నిలబెట్టేవారు కాదని గుర్తు చేశారు. అమరవీరుల కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు భూమిని కూడా కేటాయిస్తామని, అర్హులు ఉంటే ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపారు.
సర్కార్‌కు మద్దతు: వైఎస్సార్సీఎల్పీ నేత వెంకటేశ్వర్లు
రుణమాఫీ, పక్కా ఇళ్లు, సంక్షేమ కార్యక్రమాలు, 12 శాతం గిరిజనులకు రిజర్వేషన్ల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో పలు విషయాలను ప్రస్తావించ లేదన్నారు. గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టాలను పంపిణీ చేశారని గుర్తు చేస్తూ, మిగిలిన పట్టాలను వెంటనే పంపిణీ చేయాలన్నారు. బయ్యారం ఫ్యాక్టరీని ఖమ్మంలోనే పెట్టాలని కోరారు. హైదరాబాద్ ఇంకా అభివృద్ది చెందడానికి వీలైన చర్యల్ని తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.