* స్పీకర్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
* పార్టీల వైఖరేమిటో బయట పడుతుందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉండటంలో రాష్ట్ర అసెంబ్లీలో జరగాల్సిన తీర్మానమే ప్రాతిపదికగా ఉంటుందంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు... అందుకనుగుణంగా తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటించింది. పార్టీ ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, జి.బాబూరావు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ సానుభూతి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుక్రవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. అసెంబ్లీని సమావేశపరచాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.
‘‘వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడే రాష్ట్రంలో నెలకొన్న ఈ రాజ్యాంగ సంక్షోభానికి ముగింపు పలికినట్టవుతుంది’’ అని అందులో పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా వినతిపత్రంపై సంతకం చేశారు. స్పీకర్‌తో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్రంలో జరుగుతున్న విభజన ప్రక్రియను సీమాంధ్ర కాంగ్రెస్ నేతలెవరూ అడ్డుకోలేకపోతున్నారన్నారు.
‘‘కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రి.. ఎవరూ విభజన ప్రక్రియను ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాన్నయినా ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి చేతిలో ఉన్న వ్యవహారం. దీనికి ఎవరి అనుమతీ అవసరం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసేందుకు వీలుగా మంత్రివర్గ సమావేశం పెట్టండి. ఆ నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపండి. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా 30వ తేదీన గవర్నర్‌ను కలిసి, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరబోతున్నారు. ఆ దిశగా కిరణ్ కూడా ముందుకు రావాలి’’ అని శోభ విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక సందర్భాలలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ విషయంలోనూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరు కోట్ల ప్రజలు తమ భవిష్యత్ అంధకారమవుతుందన్న ఆందోళనలతో రోడ్లపైకి వచ్చి దీక్షలు చేస్తున్నారని, లక్షలాది ఉద్యోగులు రెండు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాబట్టి ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం పెట్టి, దాన్ని కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయమ్మ గురువారమే కిరణ్‌కు లేఖ రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకోకముందే, దానిపై కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలను రోడ్‌మ్యాప్ అడిగినప్పుడే వారు అడ్డుపడి ఉంటే ఈ రోజు ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదన్నారు.
పార్టీల బండారం బయటపడాలంటే..:
విభజన ప్రక్రియపై పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఎమ్మెల్యేలు విమర్శించారు. విభజనకు కాంగ్రెస్ పార్టీతో పాటు, సీఎంగా ఉన్న కిరణ్, విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులదే బాధ్యతన్నారు. ‘మనం లేఖ ఇవ్వడం వల్లే విభజన జరిగిందని ప్రచారం చేయండ’ని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలతో చెబుతున్న చంద్రబాబే, సీమాంధ్రలో తెలుగువారి ఆత్మగౌరవయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ప్రాంతం (తెలంగాణ)లో నష్టపోతామని తెలిసీ, మెజారిటీ ప్రజల ఆలోచనకు అనుగుణంగా సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యేలం రాజీనామా చేశామని గుర్తు చేశారు. తమను విమర్శిస్తున్న సీమాంధ్ర టీడీపీ నేతలు ముందు వాళ్ల పార్టీ అధ్యక్షుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేయాలని సూచించారు.
అశోక్‌బాబూ! అందరినీ ఒకే గాటన కట్టొద్దు
వైఎస్సార్‌సీపీలో అధ్యక్షుడు ఒక మాట, ఎమ్మెల్యేలు ఒక మాట మాట్లాడుతున్నారన్న ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబు వ్యాఖ్యలను శోభ తప్పుబట్టారు. మా అధ్యక్షుడు వైఎస్ జగన్ నుంచి ఎమ్మెల్యేలు, కిందిస్థాయి కార్యకర్తల దాకా అందరూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఒకే మాటతో ఉన్నారు. సమైక్యాంధ్రకు సంపూర్ణ మద్దతుగా విజయమ్మ, జగన్‌తో సహా ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేశాం. అలాంటి మా పార్టీనీ, రెండు విధానాలతో డ్రామాలాడుతున్న వారినీ ఒకే గాటన కట్టడం ఏమాత్రమూ సబబు కాదు. అశోక్‌బాబు అలా చేస్తే ఉద్యమం నీరుకారుతుంది.
రెండు నాల్కల పార్టీలపై ఒత్తిడి పెంచి వాటిని ఇరుకున పెట్టాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి. ఉద్యోగులు నెలల తరబడి జీతాల్లేక ఇబ్బంది పడుతుంటే అధికారంలో ఉన్న వారు పదవులను అనుభవిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేంద్రానికి రాసే లేఖపై తానే తొలి సంతకం చేస్తానని జగన్ చెప్పారు. మిగతా పార్టీల నేతలు కూడా అదే వైఖరితో లేఖపై సంతకాలు చేయడానికి ముందుకొస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. ఒక వర్గం మీడియా సమైక్యాంధ్ర విషయంలో తమ వైఖరిని తప్పుపట్టేలా వ్యవహరిస్తోంది. బాబు అనుకూల మీడియా మాత్రమే ఇలా వ్యవహరిస్తుందని చెప్పారు. మాపై విమర్శలు చేస్తున్న ఆ మీడియా, విభజనపై రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న బాబును మాత్రం ఏమీ ప్రశ్నించదు’’ అంటూ ధ్వజమెత్తారు.
ఆటతో పోల్చడం దుర్మార్గం: శ్రీకాంత్‌రెడ్డి
ఒకవైపు రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే, దాన్ని కిరణ్ ఒక ఆటతో పోల్చడం దుర్మార్గమని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరి బంతి పడేదాకా ఆట ముగిసినట్టు కాదంటున్నారంటే ఆయన ఆలోచనా తీరు ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. కేబినెట్ నోట్ రూపొందక ముందే సమైక్య తీర్మానం చేస్తే విభజన ప్రక్రియను అడ్డుకోవచ్చన్నారు.
'సమైక్య' తీర్మానానికి అసెంబ్లీ భేటీ
Published Sat, Sep 28 2013 3:12 AM | Last Updated on Mon, Oct 22 2018 5:46 PM
Advertisement