samaikayanandhra
-
జోరు పెరిగిన సమైక్య ఉద్యమం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం జోరు పెరిగింది. సోమవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు, ర్యాలీలు, వినూత్న నిరసన కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగాయి. మరోవైపు.. ప్రజాప్రతి నిధులు, రాజకీయ నాయకులకు ఉద్యమ సెగ త గిలింది. టెక్కలిలో ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటిని జేఏసీ నేతలు, సభ్యులు ముట్టడించి నినాదాలు చేశారు. అక్కడ జరుగుతున్న గృహ నిర్మాణ శాఖాధికారుల సమీక్షను అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ ఘటనలో వైఎస్ఆర్సీపీ నాయకుడు చింతాడ గణపతి చొక్కా చిరిగిపోయింది. దీంతో ఉద్యమకారులు ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. మందస బస్టాండ్‌లో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పీసీసీ ఉపాధ్యక్షురాలు మజ్జి శారదను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తాను సమైక్యవాదినేనని ఆమె స్పష్టం చేయటంతో గొడవ సద్దుమణిగింది. శ్రీకాకుళంలో బీజేపీ సమావేశాన్ని ఉద్యమకారులు అడ్డుకుని నేతలను నిలదీశారు. శ్రీకాకుళంలో ఖజానా శాఖ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి మావనహారం చేపట్టారు. రిమ్స్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. సుందర సత్సంగం సభ్యులు వైఎస్ఆర్ కూడలిలో రుద్రాభిషేకం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలో కంచిలి మండల రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల కూర్చున్నారు. గృహనిర్మాణశాఖ ఉద్యోగుల రిలే దీక్షల్లో గార, కోటబొమ్మాళి మండలాల అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జెడ్పీ ఉద్యోగులు కుటుంబాలతో సహా గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఆందజేశారు. వైద్యులు, న్యాయవాదులు, నీటి పారుదల శాఖ ఉద్యోగులు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వైఎస్ఆర్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. పురపాలక సంఘం, పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పాలిటెక్నిక్ అధ్యాపకుల రిలే దీక్షలు కొనసాగాయి. పాలకొండలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక వద్ద అల్లూరి, టంగుటూరు ప్రకాశం పంతులు, షిర్డీసాయి వేషధారణలతో సమైక్యవాదులు ప్రదర్శన నిర్వహించారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు రిలే దీక్షలో పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిం చారు. ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్యవేదిక వద్ద తంపటాపల్లి, టీకేరాజపురం, అట్టలి, తుమరాడ, బుక్కూరు, బెజ్జి, పనుకువలస పాఠశాలల ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. సంగీత విభావరి నిర్వహించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులకు సంకెళ్లు వేసి సోనియాగాంధీ తన చుట్టూ తిప్పుకుంటున్నట్టు ప్రదర్శించారు. భామినిలో ప్రైవేటు పాఠశాలలను మూయిం చారు. సీతంపేట ఐటీడీఏలో ఏపీఓ నాగోరావు గిరిజన దర్బార్ నిర్వహిస్తుండగా సమైక్యవాదులు అడ్డుకున్నారు. వీరఘట్టం మండలం తెట్టంగి, నవగాంలో ఉపాధ్యాయులు జనచైతన్య యాత్రలు నిర్వహించారు. టెక్కలిలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు విన్యాసాలను ప్రదర్శించారు. లింగాలవలస ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్షలో పాల్గొన్నారు. ఆమదాలవలసలో జేఏసీ, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. మున్సిపల్ ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. చింతాడలో గ్రామస్తులు, రొట్టవలసలో విద్యార్థులు రోడ్డును దిగ్బంధించారు. పొందూరు, బూర్జ తదితర మండలాల్లో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. నరసన్నపేటలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షల్లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలాకి మండలం డోల జంక్షన్ వద్ద ఉపాధ్యాయులు మానవహారం చేపట్టి రిలేదీక్షలో పాల్గొన్నారు, జలుమూరు, సారవకోటల్లో రిలే దీక్షలు కొనసాగాయి. పలాసలో టీడీపీ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ప్రెస్‌క్లబ్‌లు వేర్వేరుగా చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. మరదరాజపురంలో సమైక్యవాదులు జలదీక్ష చేపట్టారు. టెక్కలిపట్నం, వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటులో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. తప్పెటగుళ్ల ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి మండలాల్లో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. పాతపట్నంలో ఉద్యోగులు మొక్కజొన్న పొత్తులు విక్రయించి నిరసన తెలిపారు. ఎచ్చెర్లలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూని వర్సిటీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని దుకాణాలను మూయించారు. -
గళం విప్పి కదం తొక్కుతాం
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం జరిగినన్నాళ్లు తాము గళం విప్పి కదం తొక్కుతామని జిల్లా కవులు, కళాకారులు, రచయితలు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన కవులు రచయితలు, కళాకారులు, మేధావుల సదస్సు నిర్వహించారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ పోరాట చరిత్ర కలిగిన కందనవోలులో కళాకారులు గళం విప్పి గర్జిస్తే ఉద్యమం మరింత ఊపందుకుంటుందన్నారు. రాయలసీమలో కర్నూలు జిల్లా పోరాటాల ఖిల్లాగా గుర్తింపు పొందిందన్నారు. నేటి నుంచే కళా రూపాల ప్రదర్శన: బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు జేఏసీ ఆధ్వర్యంలో జరిగే సభలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కళా రూపాల ప్రదర్శన ఉంటుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మియ్యా తెలిపారు. కొత్తపాటలతో సరికొత్త వ్యంగ్య నాటికలతో ఉద్యమానికి ఊతమిస్తామన్నారు. గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ కల్కూరా మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనకు సాగే ఉద్యమంలో రచయితలు, కవులు, మేధావులు అగ్రభాగంలో ఉండాలన్నారు. కర్నూలు జిల్లా రచయితల సంఘం వ్యవస్తాపక అధ్యక్షుడు హీరాలాల్, నవలా రచయిత ఎస్‌డీవీ.అజీజ్, రచయితలు కేఎన్ఎస్.రాజు, ఎలమర్తి రమణయ్య, కేజీ జయరామిరెడ్డి, ఏపీడీఐసీ డెరైక్టర్ గంగాధర్‌రెడ్డి, కథా రచయిత ఇనాయతుల్లా, రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్ శాస్త్రి, డీవీఎస్.ఛాయామణి, యాగంటీశ్వరప్ప, డాక్టర్ వి.పోతన, రంగస్థల కళాకారులు, హెచ్.చంద్రన్న, రోషన్ అలీ, రంగముని పాల్గొన్నారు. -
‘సమైక్యం’పై బాబు, బొత్స హామీ ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమంలో కలిసిరావాలని, విభజనను అడ్డుకోవడానికి మద్దతు ఇవ్వమని తాము చేసిన విజ్ఞప్తికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందించలేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. అశోక్‌బాబు నేతృత్వంలోని ఉద్యోగుల ప్రతినిధి బృందం సోమవారం చంద్రబాబు, బొత్సలతో వేర్వేరుగా భేటీ అయింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనల నేపథ్యంలో విభజనపై టీడీపీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోమని, సమైక్య ఉద్యమానికి అండగా నిలబడమని చంద్రబాబును కోరామని, ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేదని చెప్పారు. సమైక్య ఉద్యమానికి ప్రతికూల వైఖరి తీసుకోవడం వల్ల సీమాంధ్ర ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత ఏర్పడుతోందని, చంద్రబాబును ప్రజలు దోషిగా చూస్తున్నారని చెప్పినప్పు డు.. ‘అదంతా పొలిటికల్ గేమ్. తప్పదు. భరించా లి’ అని బాబు స్పందించారని వెల్లడించారు. పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి అంత సులభంగా నిర్ణయం తీసుకోలేనన్నారని అశోక్‌బాబు చెప్పారు. అయితే ఇరు ప్రాంతాలకూ న్యాయం జరిగే విధంగా సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటానని బాబు చెప్పారని వివరించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఇదే తీరు గా స్పందించారని చెప్పారు. అన్ని పార్టీల నాయకులను కలుస్తామని, విభజనను ఆపడానికి ఆఖరు వరకు తమ శక్తి మేరకు ప్రయత్నిస్తామన్నారు. ‘సమైక్యానికి కలిసొచ్చే పార్టీలతో నడుస్తాం. అన్ని రాజకీయ పార్టీలు కలిసిరాకపోతే.. ఏ పార్టీతో కలిసి వెళ్లాలనే విషయంలో మేం కూడా రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి రాజకీయ శూన్యత సృష్టిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. సమైక్య ఉద్యమం వల్ల ప్రజలు, ఉద్యోగులకు కష్టాలు, నష్టాలు ఉంటాయని, విభజన వల్ల జరిగే నష్టం కంటే అవేమీ ఎక్కువ కాదన్నారు. 12న అర్ధరాత్రి నుంచి సమ్మె ఉంటుందన్నారు. అనంతరం ఢిల్లీ వెళ్లి వివిధ పార్టీల నాయకులు, ప్రభుత్వ పెద్దలను కలుస్తామన్నారు. ఇరు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలి.. ఇరు ప్రాంతాల్లో పార్టీ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, సమైక్యవాదానికి అనుకూలంగా ప్రస్తుతం నిర్ణయం తీసుకొనే పరిస్థితుల్లో లేనని చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు విభజన బాధ కలిగించిందంటూనే.. ఇరు ప్రాంతా ల్లో పార్టీని బతికించుకోవాల్సిన బాధ్యతను మర్చిపోకూడదని, తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేనని పేర్కొన్నారు. యూటీఎఫ్ ఆందోళనలు వాయిదా సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న నిర్వహించ తలపెట్టిన ఆందోళనలను వాయిదా వేసినట్లు యూటీఎఫ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు నిర్వహించాల్సిన ర్యాలీలు, ధర్నాలను వాయిదా వేసినట్లు పేర్కొంది. కాగా, రాష్ట్ర విభజన అనివార్యంగా మారిన పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.నర్సిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఐ.వెంకటేశ్వర్రావు డిమాండ్ చేశారు. ‘సమైక్య’ సమ్మెలో ఎన్ఎంయూ సాక్షి, హైదరాబాద్: విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఈనెల 12 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) నిర్ణయించింది. సీమాం ధ్రలోని 13 జిల్లాల్లోని 123 డిపోల్లో దాదాపు 75 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. డిపోలు, రీజియన్ల వారీగా స్థానికంగా సమ్మె నోటీసు జారీ చేయాలని ఎన్ఎంయూ నిర్ణయించినట్లు సమాచారం. ఆందోళనల వల్ల ఇప్పటికే దాదాపు 60 డిపోల్లో బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. కార్మికులు సమ్మెకు దిగితే.. పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. -
నిరసన జ్వాల
సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఆరో రోజైన సోమవారం సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలను మరింత విసృ్తతం చేశారు. మారుమూల పల్లెలనూ ఉద్యమ సెగలు తాకాయి. నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన గుల్లా రవి కుమార్ (35) అనే వ్యవసాయ కూలీ విభజనపై మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సమైక్య ఉద్యమంలో పాల్గొం టున్న భవన నిర్మాణ కార్మికుడు కొవ్వూరి రాంబాబు(50) రాష్ట్ర విభజన ప్రకటనతో కలత చెంది చింతలపూడిలో సోమవారం గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో సోనియా, దిగ్విజయ్, కేసీఆర్‌లపై సమైక్యవాదులు విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనే ఆలోచన విరమించుకోకపోతే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మునిసిపల్ ఉద్యోగులు 72 గంటల పెన్‌డౌన్ ప్రారంభించారు. బుట్టాయగూడెంలో నెహ్రూ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అయితే సమైక్య ఉద్యమకారులు ఆ విగ్రహానికి రంగులు వేయించి, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పూలమాలలు వేయించారు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బ్యాంకింగ్సేవలు పూర్తిగా స్తంభించాయి. ఆర్టీసీ కొన్ని సర్వీసులను మధాహ్నం నుంచి నడిపింది. భీమవరంలో కేసీఆర్, దిగ్విజయ్, సోనియాలకు పిండప్రదానం చేశారు. కేసిఆర్ సీమాంధ్ర ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ న్యాయవాదులు నరసాపురం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తిలిలో సమైక్యవాదులు రైల్‌రోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి కావూరి ఇంటిని ముట్టడించిన మహిళలు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో చిరంజీవి, కావూరు, బొత్స డబ్బుకు అమ్ముడుపోయారని హిజ్రాలు దుమ్మెత్తిపోశారు. ఎంపీగా ఉన్న సమయంలో సమైక్యాంధ్ర అంటూ హడావుడి చేసిన కావూరి సాంబశివరావు మంత్రి పదవి అనే కుక్క బిస్కెట్కు ఆశపడి తన కళ్ళముందు విభజన జరుగుతున్నా కనీసం అభ్యంతరం తెలపకపోవడం దారుణమని కావూరి ఇంటిని ముట్టడించిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి ఫైర్‌స్టేషన్ సెంటర్లో దహనం చేశారు. సాయంత్రం ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మానవహారం ఏర్పాటు చేశారు. కామన్‌మెన్ రివల్యూషన్ ఫోర్స్ ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ హాలు ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పాలభిషేకం చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు ట్రాక్టర్లతో, టాక్సీ, ఆటోల డ్రైవర్లు, ఓనర్లు కార్లతో, ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద మూడోరోజైన సోమవారం తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు వేషధారణలో చిన్నారులు అలరించారు. కొత్తబస్టాండ్‌లో క్రికెట్ ఆడి యువకులు నిరసన తెలిపారు. రోడ్లపై ఆటలు పెనుగొండలో వైద్యసిబ్బంది రాస్తారోకో చేశారు. ఉపాధ్యాయులు రోడ్లపై కబడ్డీ ఆడారు. ఈశ్వర వినాయక సంఘం ఆధ్వర్యంలో రోడ్లపై కర్రసాధన చేశారు. జంగారెడ్డిగూడెంలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కామవరపుకోటలో వైఎస్సార్ సీపీ అనుబంధ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. కొవ్వూరులో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈజీకే రోడ్డుపై కబడ్డీ, వాలీబాల్ తదితర ఆటలు ఆడుతూ నిరసనలు తెలిపారు. రిక్షాలు తొక్కారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మల శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బోర్డుపై రాసి పిల్లలకు పాఠాలు చెప్పారు. నందిగంపాడులో పాఠశాల విద్యార్థుల ర్యాలీలో తెలుగుతల్లి వేషధారణ ఆకట్టుకుంది. కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తణుకులో భవననిర్మాణ కార్మికుల సంఘం, వంటెద్దు సోమసుందరరావు మోటార్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉండ్రాజవరం నుంచి తణుకు వరకు రైతుసంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, ఇందిరాగాంధీ సెంటర్లో మానవహారం జరిగింది. బుట్టాయగూడెంలో భారీ ర్యాలీ బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి నుంచి బుట్టాయగూడెం అంబేద్కర్ కాలనీ వరకూ సుమారు 4 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో కేసిఆర్ దిష్టిబొమ్మలు ఐందింటిని దహనం చేశారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో, భీమవరం రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు వద్ద వంటావార్పు చేపట్టి భోజనాలు పెట్టారు. ఇక్కడి రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామమోహన్ సంద ర్శించి ప్రసంగించారు. టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో చిన్నకార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. యలమంచిలి మండలం ఏనుగువానిలంక నుంచి చించి నాడ బ్రిడ్జి వరకు సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. పెనుమర్రు, లంకల కోడేరు, పూలపల్లిలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నరసాపురంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పార్టీ కార్యకర్తలతో కలసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేపట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అగ్నికుల క్షత్రియ సంఘం అంబేద్కర్ సెంటర్లో వంటావార్పు చేశారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రెస్ట్‌హౌస్ రోడ్డు యూత్, చినవెంకన్నపాలెం యూత్ వేర్వేరుగా వందలాదిమందితో సోనియాగాంధీ దిష్టిబొమ్మ శవయాత్రను డప్పులు, నృత్యాలతో బాణ సంచా కాలుస్తూ నిర్వహిం చారు. నాచువారి సెంటర్లో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్‌లకు పిండప్రదానం చేసి తద్దినం పెట్టారు. ఈ సందర్భంగా ఓ కార్మికుడు గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన వంటా వార్పును మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ ప్రారంభించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు, ఉండి మాజీ ఎమ్మెల్యే సర్రాజు ఉద్యమంలో పాల్గొన్నారు. కోలమూరులో సోనియాగాంధి దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై వంటావార్పు చేశారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎన్జీవోలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం ఆందోళన చేశారు. సచివాలయంలోని రెండు గేట్ల ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, హైదరాబాద్‌పై తామందరికీ హక్కు ఉందని ఉద్యోగులు తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు వెళ్లిపోవాలంటూ కేసీఆర్ కావాలనే తమను రెచ్చగొట్టారని వారు ఆరోపించారు. ఉద్యోగులుగా హైదరాబాద్ నిర్మాణంలో తమకూ పాత్ర ఉందని, కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఉద్యమంలో పాల్గొంటారని వారు తెలిపారు. రాష్ట్ర విభజన ఇప్పటికే నిర్ణయమైపోయిందని, అందువల్ల సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులంతా ఆయాప్రాంతాకు వెళ్లిపోవాల్సిందేనని ఇటీవల టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించడం, హరీశ్ రావు లాంటి నాయకులు కూడా ఆయనను సమర్థించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎన్జీవోలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. కార్యాలయాలకు తాళాలు వేయించడంతో ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయడంలేదు. బ్యాంకులతో సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ తాళాలు వేయిస్తున్నారు. దీంతో సీమాంధ్ర ప్రాంతంలో దాదాపుగా పాలన స్తంభించింది. వివిధ కోర్సులలో చేరేందుకు విద్యార్థులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉండగా, అవి పొందడం కూడా గగనం అవుతోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేడు, రేపు ప్రభుత్వ కార్యాలయాల బంద్ పాటిస్తున్నట్లు అక్కడి జేఏసీ ప్రకటించింది. చిత్తూరులో ఎమ్మెల్యే సీకే బాబు నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
రేపు కడప దిగ్బంధనం
వైఎస్ఆర్ జిల్లా: సమైక్యాంధ్రా నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఇప్పటికే సీమాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోగా, కడప పట్టణాన్ని సోమవారం దిగ్బంధిస్తున్నట్లు సీమాంధ్ర ఆందోళన కారులు హెచ్చరించారు. రోడ్డుపైనే వంటా వార్పూ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజక కేంద్రాల్లోనూ ఆందోళనలు దిగనున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో కూడా నిరసనల హోరు ఉధృతమైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురంలో ఎస్కే యూనివర్శిటీలోని అధ్యాపక బృందం తమ కుటుంబసభ్యులతో ఆదివారం యూనివర్శిటీ ఎదుట ఆందోళన చేయనుంది. అలాగే సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయాయి. -
మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎన్జీవోలు
-
మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎన్జీవోలు
విజయవాడ: సమైక్యాంధ్రా సెగ అంతకంతకూ రాజుకోంటుంది. ఏపీఎన్జీవోలు మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు. సీమాంధ్రాలో ఉన్న ప్రజా ప్రతినిధులు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు సమర్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ లోపు రాజీనామాలు చేయకుంటే రాష్ట్రంలో పాలన స్తంభింపజేస్తామని వారు హెచ్చరించారు. గత నాలుగు రోజులుగా సీమాంధ్ర జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రా ప్రభుత్వానికి వెళ్లిపోవాల్సిందేనన్న కేసీఆర్ వ్యాఖ్యలు నేపథ్యంలో ఏపీఎన్జీవోలు విధులను బహిష్కరించి నిరసన బాట పట్టారు. ప్రస్తుతం తాము చేపట్టిన నిరసన కార్యక్రమంలో అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొంటారని వారు తెలిపారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలను కూడా బహిష్కరిస్తామన్నారు. ఆగస్టు 12వ తేదీ తరువాత హైదరాబాద్‌లో సమైక్య సభ ఉంటుందని వారు తెలిపారు. మంత్రులకు పదవులు కావాలో, ప్రజలు కావాలో తేల్చుకోవాలని ఏపీఎన్జీవోలు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే తప్ప..తమకు వేరే ఆప్షన్లు వద్దని హెచ్చరించారు. హైదరబాద్ మహా నగరం రాష్ట్రంలో అంతర్భాగమన్నారు. నిర్ణయం జరిగిపోయింది..సర్దుకు పొమ్మంటే కుదరదన్నారు. రెండు రోజుల్లో సీఎస్‌కు సమ్మె నోటీసు అందజేస్తామని వారు తెలిపారు. -
ఏయూలో విద్యార్థుల దీక్ష భగ్నం
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థుల చేపట్టిన దీక్షనుపోలీసులు భగ్నం చేశారు. కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయ తీసుకున్న అనంరతం సీమాంధ్ర ప్రాంతంలో నిరసనల సెగ రాజుకుంది. దీంతో దీక్ష చేపట్టిన విద్యార్థులను అరెస్టు చేసి దీక్షను భగ్నం చేశారు. ఆరోగ్యం క్షీణించిన విద్యార్థులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా గోదావరి జిల్లాలలో పలు చోట్ల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. వరుసగా అయిదోరోజూ పశ్చిమగోదావరి జిల్లాలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఏలూరు నగరంలో వాణిజ్య, వర్తక దుకాణాలన్నీ మూతబడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. వట్లూరు గ్రామస్ధులు కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఫైర్ స్టేషన్ సెంటర్లో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్ వేషధారణతో ఓ వ్యక్తిని అలకరించి, ఊరేగించారు. బొత్స, చిరంజీవి బ్యానర్లను ప్రదరిస్తూ ... సమైక్యాంధ్ర కావాలని నినదించారు. రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.