సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఆరో రోజైన సోమవారం సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలను మరింత విసృ్తతం చేశారు. మారుమూల పల్లెలనూ ఉద్యమ సెగలు తాకాయి. నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన గుల్లా రవి కుమార్ (35) అనే వ్యవసాయ కూలీ విభజనపై మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సమైక్య ఉద్యమంలో పాల్గొం టున్న భవన నిర్మాణ కార్మికుడు కొవ్వూరి రాంబాబు(50) రాష్ట్ర విభజన ప్రకటనతో కలత చెంది చింతలపూడిలో సోమవారం గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో సోనియా, దిగ్విజయ్, కేసీఆర్‌లపై సమైక్యవాదులు విరుచుకుపడ్డారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనే ఆలోచన విరమించుకోకపోతే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మునిసిపల్ ఉద్యోగులు 72 గంటల పెన్‌డౌన్ ప్రారంభించారు. బుట్టాయగూడెంలో నెహ్రూ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అయితే సమైక్య ఉద్యమకారులు ఆ విగ్రహానికి రంగులు వేయించి, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పూలమాలలు వేయించారు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బ్యాంకింగ్‌సేవలు పూర్తిగా స్తంభించాయి. ఆర్టీసీ కొన్ని సర్వీసులను మధాహ్నం నుంచి నడిపింది. భీమవరంలో కేసీఆర్, దిగ్విజయ్, సోనియాలకు పిండప్రదానం చేశారు. కేసిఆర్ సీమాంధ్ర ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ న్యాయవాదులు నరసాపురం టౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తిలిలో సమైక్యవాదులు రైల్‌రోకో నిర్వహించారు.
కేంద్ర మంత్రి కావూరి ఇంటిని ముట్టడించిన మహిళలు
ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో చిరంజీవి, కావూరు, బొత్స డబ్బుకు అమ్ముడుపోయారని హిజ్రాలు దుమ్మెత్తిపోశారు. ఎంపీగా ఉన్న సమయంలో సమైక్యాంధ్ర అంటూ హడావుడి చేసిన కావూరి సాంబశివరావు మంత్రి పదవి అనే కుక్క బిస్కెట్‌కు ఆశపడి తన కళ్ళముందు విభజన జరుగుతున్నా కనీసం అభ్యంతరం తెలపకపోవడం దారుణమని కావూరి ఇంటిని ముట్టడించిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో దహనం చేశారు. సాయంత్రం ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మానవహారం ఏర్పాటు చేశారు. కామన్‌మెన్ రివల్యూషన్ ఫోర్స్ ఆధ్వర్యంలో వైఎంహెచ్‌ఏ హాలు ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పాలభిషేకం చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు ట్రాక్టర్లతో, టాక్సీ, ఆటోల డ్రైవర్లు, ఓనర్లు కార్లతో, ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద మూడోరోజైన సోమవారం తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు వేషధారణలో చిన్నారులు అలరించారు. కొత్తబస్టాండ్‌లో క్రికెట్ ఆడి యువకులు నిరసన తెలిపారు.
రోడ్లపై ఆటలు
పెనుగొండలో వైద్యసిబ్బంది రాస్తారోకో చేశారు. ఉపాధ్యాయులు రోడ్లపై కబడ్డీ ఆడారు. ఈశ్వర వినాయక సంఘం ఆధ్వర్యంలో రోడ్లపై కర్రసాధన చేశారు. జంగారెడ్డిగూడెంలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కామవరపుకోటలో వైఎస్సార్ సీపీ అనుబంధ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. కొవ్వూరులో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈజీకే రోడ్డుపై కబడ్డీ, వాలీబాల్ తదితర ఆటలు ఆడుతూ నిరసనలు తెలిపారు. రిక్షాలు తొక్కారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మల శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బోర్డుపై రాసి పిల్లలకు పాఠాలు చెప్పారు. నందిగంపాడులో పాఠశాల విద్యార్థుల ర్యాలీలో తెలుగుతల్లి వేషధారణ ఆకట్టుకుంది. కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తణుకులో భవననిర్మాణ కార్మికుల సంఘం, వంటెద్దు సోమసుందరరావు మోటార్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉండ్రాజవరం నుంచి తణుకు వరకు రైతుసంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, ఇందిరాగాంధీ సెంటర్‌లో మానవహారం జరిగింది.
బుట్టాయగూడెంలో భారీ ర్యాలీ
బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి నుంచి బుట్టాయగూడెం అంబేద్కర్ కాలనీ వరకూ సుమారు 4 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో కేసిఆర్ దిష్టిబొమ్మలు ఐందింటిని దహనం చేశారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో, భీమవరం రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు వద్ద వంటావార్పు చేపట్టి భోజనాలు పెట్టారు. ఇక్కడి రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామమోహన్ సంద ర్శించి ప్రసంగించారు. టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో చిన్నకార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. యలమంచిలి మండలం ఏనుగువానిలంక నుంచి చించి నాడ బ్రిడ్జి వరకు సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. పెనుమర్రు, లంకల కోడేరు, పూలపల్లిలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నరసాపురంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం
నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పార్టీ కార్యకర్తలతో కలసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేపట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అగ్నికుల క్షత్రియ సంఘం అంబేద్కర్ సెంటర్లో వంటావార్పు చేశారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రెస్ట్‌హౌస్ రోడ్డు యూత్, చినవెంకన్నపాలెం యూత్ వేర్వేరుగా వందలాదిమందితో సోనియాగాంధీ దిష్టిబొమ్మ శవయాత్రను డప్పులు, నృత్యాలతో బాణ సంచా కాలుస్తూ నిర్వహిం చారు. నాచువారి సెంటర్లో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్‌లకు పిండప్రదానం చేసి తద్దినం పెట్టారు. ఈ సందర్భంగా ఓ కార్మికుడు గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన వంటా వార్పును మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ ప్రారంభించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు, ఉండి మాజీ ఎమ్మెల్యే సర్రాజు ఉద్యమంలో పాల్గొన్నారు. కోలమూరులో సోనియాగాంధి దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై వంటావార్పు చేశారు.
నిరసన జ్వాల
Published Tue, Aug 6 2013 12:29 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement