
మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎన్జీవోలు
విజయవాడ: సమైక్యాంధ్రా సెగ అంతకంతకూ రాజుకోంటుంది. ఏపీఎన్జీవోలు మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు. సీమాంధ్రాలో ఉన్న ప్రజా ప్రతినిధులు స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు సమర్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ లోపు రాజీనామాలు చేయకుంటే రాష్ట్రంలో పాలన స్తంభింపజేస్తామని వారు హెచ్చరించారు.
గత నాలుగు రోజులుగా సీమాంధ్ర జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రా ప్రభుత్వానికి వెళ్లిపోవాల్సిందేనన్న కేసీఆర్ వ్యాఖ్యలు నేపథ్యంలో ఏపీఎన్జీవోలు విధులను బహిష్కరించి నిరసన బాట పట్టారు. ప్రస్తుతం తాము చేపట్టిన నిరసన కార్యక్రమంలో అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొంటారని వారు తెలిపారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలను కూడా బహిష్కరిస్తామన్నారు. ఆగస్టు 12వ తేదీ తరువాత హైదరాబాద్‌లో సమైక్య సభ ఉంటుందని వారు తెలిపారు.
మంత్రులకు పదవులు కావాలో, ప్రజలు కావాలో తేల్చుకోవాలని ఏపీఎన్జీవోలు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే తప్ప..తమకు వేరే ఆప్షన్లు వద్దని హెచ్చరించారు. హైదరబాద్ మహా నగరం రాష్ట్రంలో అంతర్భాగమన్నారు. నిర్ణయం జరిగిపోయింది..సర్దుకు పొమ్మంటే కుదరదన్నారు. రెండు రోజుల్లో సీఎస్‌కు సమ్మె నోటీసు అందజేస్తామని వారు తెలిపారు.