సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం జరిగినన్నాళ్లు తాము గళం విప్పి కదం తొక్కుతామని జిల్లా కవులు, కళాకారులు, రచయితలు తెలిపారు.
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం జరిగినన్నాళ్లు తాము గళం విప్పి కదం తొక్కుతామని జిల్లా కవులు, కళాకారులు, రచయితలు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన కవులు రచయితలు, కళాకారులు, మేధావుల సదస్సు నిర్వహించారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ పోరాట చరిత్ర కలిగిన కందనవోలులో కళాకారులు గళం విప్పి గర్జిస్తే ఉద్యమం మరింత ఊపందుకుంటుందన్నారు. రాయలసీమలో కర్నూలు జిల్లా పోరాటాల ఖిల్లాగా గుర్తింపు పొందిందన్నారు.
నేటి నుంచే కళా రూపాల ప్రదర్శన: బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు జేఏసీ ఆధ్వర్యంలో జరిగే సభలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కళా రూపాల ప్రదర్శన ఉంటుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మియ్యా తెలిపారు. కొత్తపాటలతో సరికొత్త వ్యంగ్య నాటికలతో ఉద్యమానికి ఊతమిస్తామన్నారు. గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ కల్కూరా మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనకు సాగే ఉద్యమంలో రచయితలు, కవులు, మేధావులు అగ్రభాగంలో ఉండాలన్నారు. కర్నూలు జిల్లా రచయితల సంఘం వ్యవస్తాపక అధ్యక్షుడు హీరాలాల్, నవలా రచయిత ఎస్‌డీవీ.అజీజ్, రచయితలు కేఎన్‌ఎస్.రాజు, ఎలమర్తి రమణయ్య, కేజీ జయరామిరెడ్డి, ఏపీడీఐసీ డెరైక్టర్ గంగాధర్‌రెడ్డి, కథా రచయిత ఇనాయతుల్లా, రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్ శాస్త్రి, డీవీఎస్.ఛాయామణి, యాగంటీశ్వరప్ప, డాక్టర్ వి.పోతన, రంగస్థల కళాకారులు, హెచ్.చంద్రన్న, రోషన్ అలీ, రంగముని పాల్గొన్నారు.