నంద్యాల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన విషయంలో జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల తీరు ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని.. ఇప్పటికైనా వారు తమ వైఖరి స్పష్టం చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు.
పట్టణంలోని చెరుకు ఫ్యాక్టరీ ఆవరణలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి కోట్ల, రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలు తలో వాదం వినిపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడినని చెప్పుకుంటున్న టీజీ కొద్దిసేపు గ్రేటర్ రాయలసీమ, ఆ తర్వాత రాయల తెలంగాణ, మరోసారి మహబూబ్‌నగర్‌తో కూడిన రాయలసీమ అంటూ విభిన్న ప్రతిపాదనలతో సమైక్యవాదుల మనోభావాలను దెబ్బతియడం తగదన్నారు.
కోట్ల విషయానికొస్తే తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని సోనియా ఇంటి ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టే బదులు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారన్నారు. అంతేతప్ప నీచ రాజకీయాలకు పాల్పడితే ఎన్నటికీ క్షమించరని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి రాష్ట్ర విభజనకు సానుకూలంగా స్పందించి సీమాంధ్ర ప్రజల మనోభావాలపై దెబ్బ కొట్టాడన్నారు. వెన్నుపోటు రాజకీయాలతో సీల్డ్‌కవర్ పదవులు పొందేకన్నా.. ప్రజాభిమానంతో ఏ చిన్న పదవిలో కొనసాగినా గౌరవప్రదంగా ఉంటుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మౌనంగా ఉండటం ద్వారా రెండు ప్రాంతాల్లో లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని.. అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు రెంటికీ చెడ్డ రేవడిలా తయారు కాక తప్పదన్నారు. సీమాంధ్రలో చాలా మంది ఎమ్మెల్యేలకు తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మెట్‌లో పంపాలని తెలియకపోవడం శోచనీయమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యులంతా స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు చేసి ప్రజల్లో ధైర్యంగా తలెత్తుకు తిరుగుతున్న విషయాన్ని గమనించాలని కాంగ్రెస్, టీడీపీ నాయకులకు సూచించారు. జేఏసీ నేతలు స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేయని నాయకుల మెడలు వంచాలని భూమా కోరారు.
మంత్రుల వైఖరి స్పష్టం చేయాలి
Published Thu, Aug 8 2013 4:47 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement