గుంతకల్లు, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పెట్రోలియం ట్యాంకర్ల డ్రైవర్లు, క్లీనర్ల అసోసియేషన్ల జేఏసీ నాయకులు జీ.అబ్దుల్ నజీర్, ఏ.షర్మస్‌వలీ, మహమ్మద్ రఫీ, హనుమేష్, రామాంజి, వలీ డిమాండ్ చేశారు. గురువారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక రైల్వే క్రీడా మైదానం నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్ మీదుగా మస్తానయ్య దర్గా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సర్కిల్‌లో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు మానవహారంగా ఏర్పడ్డారు.
వారిని ఉద్దేశించి జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం 50 రోజులుగా సీమాంధ్ర ప్రాంత ప్రజలు పోరాడుతుంటే, కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. తెలుగు ప్రజల మనోభావాలు, ఉద్యమ తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం కోసం గురువారం నుంచి 48 గంటల పాటు డీజిల్, పెట్రోల్, కిరోసిన్ రవాణాను స్తంభింపజేస్తున్నామన్నారు.
సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని ఐఓసీ, హెచ్‌పీసీ, బీపీసీ ఆయిల్ డిపోల నుంచి ఒక్క ట్రక్కు కూడా బయటకు వెళ్లకుండా డ్రైవర్లు, క్లీనర్లు, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సంయుక్తంగా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారని, దీంతో రాష్ట్ర వ్యాప్తం గా 5 వేల పెట్రోలియం ట్యాంకర్లు ఎక్కడికక్కడ రెండు రోజుల పాటు ఆగిపోనున్నాయని చెపాపరు. ర్యాలీ సందర్భంగా జేఏసీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అలాగే తెలుగు జాతిని ఐక్యంగా ఉంచాలని కోరుతూ మహాత్మాగాంధీ, వైఎస్సార్, ఎన్టీఆర్, డాక్టర్ అంబేద్కర్, పొట్టిశ్రీరాములు, భగత్‌సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.