speaker format
-
ఈటల రాజీనామా ఆమోదం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఆమోదించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లోనే ఉండడంతో ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. కాగా ఇవాళ ఉదయమే స్పీకర్ ఫార్మాట్లో ఉన్న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అనంతరం గన్‌పార్క్ సందర్శించిన ఈటల తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. కాగా ఈటెల రాజేందర్ జూన్ 14న బీజేపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, తరుణ్ ఛుగ్ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరుతారు. ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల.. వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అవ్వటంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆ స్థానానికి సంబంధించి శనివారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేశారు. చదవండి: హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమే: ఈటల -
కర్నాటకంలో కొత్త ట్విస్ట్
సాక్షి, బెంగళూరు/ ముంబై: కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుందని, తప్పుడు నిర్ణయంతో చరిత్రలో ద్రోహిగా మారడం ఇష్టం లేదని స్పీకర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తనకు అందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖల్లో 5 మాత్రమే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయని ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన శివాజీనగర ఎమ్మెల్యే రోషన్ బేగ్ కూడా రెబెల్స్ జాబితాలో చేరిపోగా, సర్కారు మనుగడ ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. బేగ్ రాజీనామా లేఖ అందింది ‘నేను జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకూడదు. భవిష్యత్ తరాలు నన్నో అపరాధిగా చూస్తాయి’అని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ అన్నారు. మంగళవారం విధాన సౌధలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనపై ఆయన స్పందిస్తూ.. రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఈ నెల 11వ తేదీలోగా ఆధారాలను చూపాలని కోరానని, సమాధానాన్ని బట్టి చర్యలుంటాయని వివరించారు. రాజీనామా చేసిన 14 మందిలో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలున్నారని వెల్లడించారు. రాజీనామాలను ఆమోదించాలా లేక మరే ఇతర చర్యలు చేపట్టాలా అనే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు, రూల్‌బుక్ ప్రకారం నడుచుకుంటానన్నారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ‘ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా లేఖ ఈ రోజే అందింది. దానిని ఇంకా పరిశీలించలేదు. ఇప్పటికే అందిన అధికార కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 14 ఎమ్మెల్యేల రాజీనామా పత్రాల్లో ఐదుగురివే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయి. మిగతా వారికి ఈ మేరకు సమాచారం అందించాం. వారు మరోసారి రాజీనామా పత్రాలు అందజేస్తే పరిశీలిస్తా’అని స్పష్టం చేశారు. సీఎల్పీ భేటీకి రాని 20 మంది మంగళవారం ఉదయం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. పదవులకు రాజీనామా చేసిన వారితోపాటు మొత్తం 20 మంది ఈ భేటీకి గైర్హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు స్పీకర్‌ను కలిశారు. తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చేసిన తీర్మానం ప్రతిని వారు స్పీకర్‌కు అందజేశారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాజీనామాలు చేసి, బీజేపీతో చేతులు కలిపిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాం. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’అని వెల్లడించారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎల్పీ నేత సిద్దరామయ్య హెచ్చరించారు. ‘రాజ్యాంగం పదో షెడ్యూల్లోని ఫిరాయింపుల చట్టంలోని నిబంధనలు తెలియకనే వారంతా రాజీనామా చేశారు. బీజేపీ వలలో చిక్కుకున్న ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీతో చేతులు కలిపారు. మోదీ, అమిత్ షా ఈ వ్యవహారంలో తలదూరుస్తున్నారు’ అని అన్నారు. అంతకుముందు విధానసౌధ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, బీకే హరిప్రసాద్ బెంగళూరుకు చేరుకుని ఎమ్మెల్యేలు, నేతలతో చర్చలు ప్రారంభించారు. రెబెల్స్ మళ్లీ ముంబైకి.. కర్ణాటక తిరుగుబాటు శాసనసభ్యులు సోమవారం ముంబై నుంచి గోవాకు బయలుదేరి మార్గమధ్యంలో సతారా సమీపంలో ఆగిపోయారు. తమ రాజీనామాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసం వారు అక్కడే మంగళవారం ఎదురు చూశారు. కొందరి ఎమ్మెల్యేల రాజీనామాలు నిర్దేశిత నమూనా ప్రకారం లేవని స్పీకర్ ప్రకటించడంతో తిరిగి ముంబై వెళ్లారు. రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలలతో సమావేశాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు. నగర శివార్లలోని ఒక రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లోనుకావద్దని, మరో నాలుగు రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు. హెచ్చరికలకు లొంగని రెబెల్స్ రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామంటూ కాంగ్రెస్ హెచ్చరికలు పంపినప్పటికీ వారు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. ‘రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదు. స్వచ్ఛందంగా రాజీనామాలు ఇచ్చాం. ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సోమశేఖర్ మీడియాతో వ్యాఖ్యానించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇటీవల సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్ బేగ్ మంగళవారం రాజీనామా సమర్పించినట్లు ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికే.. ఐఎంఏ గ్రూప్ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే బేగ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఐఎంఏ గ్రూప్ ముఖ్య నిర్వాహకుడు, ఐఎంఏ జ్యుయెల్లర్స్ అధినేత మొహమ్మద్ మన్సూర్ ఖాన్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. రోషన్‌బేగ్ తన వద్ద నుంచి రూ.400 కోట్లు తీసుకుని, ఎగనామం పెట్టాడని ఆయన విడుదల చేసిన ఆడియోలో ఆరోపించడం కలకలం రేపింది. -
స్పీకర్ ఫార్మాట్లో 13 మంది ఎంపీలు రాజీనామా!
కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మొత్తం 13 మంది లోక్‌సభ సభ్యులు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించారని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం సోమవారం వెల్లడించింది. ఇందులో 10 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు, ఒక్క టీడీపీ ఎంపీ పేర్లు ఉన్నాయి. వీరిలో ఏడుగురు మాత్రమే ఇంతవరకూ స్పీకర్ మీరాకుమార్ను స్వయంగా కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారని తెలిపింది. స్పీకర్‌ను కలవని ఆరుగురు ఎంపీలు స్వయంగా స్పీకర్ కార్యాలయానికి వచ్చి మీరాకుమార్ను కలిసి వెళ్లాల్సిందిగా కోరుతూ కార్యాలయ అధికారులు వారికి నోటీసులు పంపారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవటానికి ముందుగా ఎంపీలు స్వయంగా స్పీకర్ ఎదుట హాజరై రాజీనామాలకు కారణాలను వివరించాల్సి ఉంటుందని.. రాజీనామాలను ఆమోదించేందుకు సభ్యులు ఎలాంటి ఒత్తిళ్లకు, భావోద్వేగాలకు గురికాకుండా స్వచ్ఛందంగానే పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోవాలని భావిస్తున్నట్లు స్పీకర్ సంతృప్తి చెందాల్సి ఉంటుందని ఒక బులెటిన్‌లో వివరించారు. లోక్‌సభ నియమ, నిబంధనల్లోని 101 (3) (బి) ప్రకారం స్పీకర్ తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుని విచారించే అవకాశముందని పేర్కొన్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు సమర్పించిన తర్వాత కూడా సభకు హాజరైనట్లు స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన నోట్లో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడంతో గత ఆగస్టు 2వ తేదీ తర్వాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయి ప్రతాప్, జి.వి.హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి (ఇటీవల వైఎస్సార్సీపీలో చేరారు.), కొనకళ్ల నారాయణరావు (టీడీపీ), వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్) రాజీనామాలు సమర్పించారు. వీరిలో ఏడుగురు - ఉండవల్లి, లగ డపాటి, అనంత, సాయిప్రతాప్, సబ్బం హరి, రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి మాత్రమే గత నెలాఖరులో విడివిడిగా స్పీకర్‌ను స్వయంగా కలిశారు. స్పీకర్ విచారణలో వీరిలో కొంతమంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజానీకంలో పెల్లుబుకిన ఆగ్రహావేశాల కారణంగా తాము నియోజకవర్గాలకు కూడా వెళ్లలేకపోతున్నామని, రాజీనామా చేయాల్సిందిగా తమపై ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నదని అంగీకరించిన ట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పీకర్‌ని కలిసినప్పుడు తన రాజీనామాను, తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నందున జగన్మోహన్రెడ్డి స్వయంగా రాలేకపోయారని, ఆయన తరఫున తాను ఆయన రాజీనామాను కూడా ఆమోదించాల్సిందిగా కోరుతున్నానని స్పష్టంచేశారు. -
మా రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్లో లేవు: తెదేపా ఎంపీలు
-
సోనియా, బాబు డ్రామాలను ప్రజలు నమ్మరు
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేశామని టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలను మభ్యపెడుతున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇవ్వాలని తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఆమరణ నిరాహారదీక్ష మంగళవారానికి రెండోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు చేసిన రాజీనామాలు చెల్లవన్నారు. తనతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశామన్నారు. రాజీనామాలు చేశామని చెబుతూ, ప్రారంభోత్సవాల్లో ఎలా పాల్గొంటున్నారని ఆయన దుయ్యబట్టారు. కేవలం తెలుగుతల్లిని, ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. సీఎం కిరణ్, చంద్రబాబునాయుడు, పురందేశ్వరి, ఎంపీలు, కేంద్ర మంత్రులు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసి ఉద్యమానికి తరలిరావాలని డిమాండ్ చేశారు. తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ కోరుకుంటే ,నేడు నకిలీ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు సోనియాగాంధీకి మద్దతిచ్చి రాష్ట్ర విభజనకు సహకరించారని ఆరోపించారు. తెలుగుజాతి తనదని, రాష్ట్రం ఒక్కటిగా ఉండాలన్న ఎన్టీ రామారావు కుమార్తెగా పుట్టిన పురందేశ్వరి తన పదవికి రాజీనామా చేసి తెలుగుజాతి గౌరవాన్ని నిలిపి తండ్రికి తగిన కుమార్తెగా నిలవాలన్నారు. నాడు ఇందిరాగాంధీ ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రజాభీష్టం మేరకు రాష్ట్ర విభజన చేయకుండా గొప్ప నాయకురాలిగా నిలిచారన్నారు. రాజీనామాలు చేయని ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర , రాష్ట్ర మంత్రులు గంగిరెద్దులతో సమానమని ప్రసన్న అభివర్ణించారు. నేడు సోనియాగాంధీ తెలుగుప్రజల రక్తాన్ని తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనానికి రాష్ట్ర విభజన చేస్తోందన్నారు. దీనికి డ్రామాలు వేయడంలో ఆరితేరిన చంద్రబాబునాయుడ్ని ఉపయోగించుకుందన్నారు. వైఎస్సార్సీపీని విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదు రాష్ట్ర విభ జన విషయంలో ఏకపక్షం తగదని తొలుత నుంచి వైఎస్సార్సీపీ చెబుతూనే ఉందని ప్రసన్న అన్నారు. కేసీఆర్ విజయనగరం నుంచి వచ్చిన వ్యక్తి అని, అతనిది తెలంగాణ కాదని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులను విమర్శించే అర్హత కేసీఆర్‌కు, ఆయన కుమారుడు కేటీఆర్‌కు లేదన్నారు. దీక్షకు సంఘీభావం తెలిపిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, పాశం సునీల్‌కుమార్, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నాపా వెంకటేశ్వర్లునాయుడు, వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి ఉన్నారు. -
మంత్రుల వైఖరి స్పష్టం చేయాలి
నంద్యాల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన విషయంలో జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల తీరు ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని.. ఇప్పటికైనా వారు తమ వైఖరి స్పష్టం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. పట్టణంలోని చెరుకు ఫ్యాక్టరీ ఆవరణలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి కోట్ల, రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలు తలో వాదం వినిపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడినని చెప్పుకుంటున్న టీజీ కొద్దిసేపు గ్రేటర్ రాయలసీమ, ఆ తర్వాత రాయల తెలంగాణ, మరోసారి మహబూబ్‌నగర్‌తో కూడిన రాయలసీమ అంటూ విభిన్న ప్రతిపాదనలతో సమైక్యవాదుల మనోభావాలను దెబ్బతియడం తగదన్నారు. కోట్ల విషయానికొస్తే తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని సోనియా ఇంటి ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టే బదులు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారన్నారు. అంతేతప్ప నీచ రాజకీయాలకు పాల్పడితే ఎన్నటికీ క్షమించరని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి రాష్ట్ర విభజనకు సానుకూలంగా స్పందించి సీమాంధ్ర ప్రజల మనోభావాలపై దెబ్బ కొట్టాడన్నారు. వెన్నుపోటు రాజకీయాలతో సీల్డ్‌కవర్ పదవులు పొందేకన్నా.. ప్రజాభిమానంతో ఏ చిన్న పదవిలో కొనసాగినా గౌరవప్రదంగా ఉంటుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మౌనంగా ఉండటం ద్వారా రెండు ప్రాంతాల్లో లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని.. అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు రెంటికీ చెడ్డ రేవడిలా తయారు కాక తప్పదన్నారు. సీమాంధ్రలో చాలా మంది ఎమ్మెల్యేలకు తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మెట్లో పంపాలని తెలియకపోవడం శోచనీయమన్నారు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులంతా స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేసి ప్రజల్లో ధైర్యంగా తలెత్తుకు తిరుగుతున్న విషయాన్ని గమనించాలని కాంగ్రెస్, టీడీపీ నాయకులకు సూచించారు. జేఏసీ నేతలు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేయని నాయకుల మెడలు వంచాలని భూమా కోరారు.