స్పీకర్‌తో మాట్లాడుతున్న సిద్ధరామయ్య, కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ దినేశ్ తదితరులు
సాక్షి, బెంగళూరు/ ముంబై: కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుందని, తప్పుడు నిర్ణయంతో చరిత్రలో ద్రోహిగా మారడం ఇష్టం లేదని స్పీకర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తనకు అందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖల్లో 5 మాత్రమే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయని ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన శివాజీనగర ఎమ్మెల్యే రోషన్ బేగ్ కూడా రెబెల్స్ జాబితాలో చేరిపోగా, సర్కారు మనుగడ ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
బేగ్ రాజీనామా లేఖ అందింది
‘నేను జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకూడదు. భవిష్యత్ తరాలు నన్నో అపరాధిగా చూస్తాయి’అని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ అన్నారు. మంగళవారం విధాన సౌధలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనపై ఆయన స్పందిస్తూ.. రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఈ నెల 11వ తేదీలోగా ఆధారాలను చూపాలని కోరానని, సమాధానాన్ని బట్టి చర్యలుంటాయని వివరించారు.
రాజీనామా చేసిన 14 మందిలో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలున్నారని వెల్లడించారు. రాజీనామాలను ఆమోదించాలా లేక మరే ఇతర చర్యలు చేపట్టాలా అనే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు, రూల్‌బుక్ ప్రకారం నడుచుకుంటానన్నారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ‘ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా లేఖ ఈ రోజే అందింది. దానిని ఇంకా పరిశీలించలేదు. ఇప్పటికే అందిన అధికార కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 14 ఎమ్మెల్యేల రాజీనామా పత్రాల్లో ఐదుగురివే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయి. మిగతా వారికి ఈ మేరకు సమాచారం అందించాం. వారు మరోసారి రాజీనామా పత్రాలు అందజేస్తే పరిశీలిస్తా’అని స్పష్టం చేశారు.
సీఎల్పీ భేటీకి రాని 20 మంది
మంగళవారం ఉదయం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. పదవులకు రాజీనామా చేసిన వారితోపాటు మొత్తం 20 మంది ఈ భేటీకి గైర్హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు స్పీకర్‌ను కలిశారు. తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చేసిన తీర్మానం ప్రతిని వారు స్పీకర్‌కు అందజేశారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాజీనామాలు చేసి, బీజేపీతో చేతులు కలిపిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాం. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’అని వెల్లడించారు.
రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎల్పీ నేత సిద్దరామయ్య హెచ్చరించారు. ‘రాజ్యాంగం పదో షెడ్యూల్‌లోని ఫిరాయింపుల చట్టంలోని నిబంధనలు తెలియకనే వారంతా రాజీనామా చేశారు. బీజేపీ వలలో చిక్కుకున్న ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీతో చేతులు కలిపారు. మోదీ, అమిత్ షా ఈ వ్యవహారంలో తలదూరుస్తున్నారు’ అని అన్నారు. అంతకుముందు విధానసౌధ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, బీకే హరిప్రసాద్ బెంగళూరుకు చేరుకుని ఎమ్మెల్యేలు, నేతలతో చర్చలు ప్రారంభించారు.
రెబెల్స్ మళ్లీ ముంబైకి..
కర్ణాటక తిరుగుబాటు శాసనసభ్యులు సోమవారం ముంబై నుంచి గోవాకు బయలుదేరి మార్గమధ్యంలో సతారా సమీపంలో ఆగిపోయారు. తమ రాజీనామాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసం వారు అక్కడే మంగళవారం ఎదురు చూశారు. కొందరి ఎమ్మెల్యేల రాజీనామాలు నిర్దేశిత నమూనా ప్రకారం లేవని స్పీకర్ ప్రకటించడంతో తిరిగి ముంబై వెళ్లారు.
రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు
ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలలతో సమావేశాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు. నగర శివార్లలోని ఒక రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లోనుకావద్దని, మరో నాలుగు రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు.
హెచ్చరికలకు లొంగని రెబెల్స్
రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామంటూ కాంగ్రెస్ హెచ్చరికలు పంపినప్పటికీ వారు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. ‘రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదు. స్వచ్ఛందంగా రాజీనామాలు ఇచ్చాం. ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సోమశేఖర్ మీడియాతో వ్యాఖ్యానించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇటీవల సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్ బేగ్ మంగళవారం రాజీనామా సమర్పించినట్లు ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికే.. ఐఎంఏ గ్రూప్ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే బేగ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఐఎంఏ గ్రూప్ ముఖ్య నిర్వాహకుడు, ఐఎంఏ జ్యుయెల్లర్స్ అధినేత మొహమ్మద్ మన్సూర్ ఖాన్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. రోషన్‌బేగ్ తన వద్ద నుంచి రూ.400 కోట్లు తీసుకుని, ఎగనామం పెట్టాడని ఆయన విడుదల చేసిన ఆడియోలో ఆరోపించడం కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment